మోదీ ఏపీ టూరు.. 2 రోజులు.. 3 సభలు.. 1 రోడ్ షో
x

మోదీ ఏపీ టూరు.. 2 రోజులు.. 3 సభలు.. 1 రోడ్ షో

దక్షిణాదిపై పట్టుసాధించాలని బీజేపీ చేస్తున్న కసరత్తులో భాగంగా ప్రధాని మోదీ.. ఆంధ్రలో పర్యటించనున్నారు. ఆయన షెడ్యూల్ ఎలా ఉందంటే..


దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్.. రాష్ట్రానికి క్యూ కట్టారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 2,3 తేదీలలో రాష్ట్రంలో పర్యటనకు వచ్చారు. 5న మరో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వస్తున్నారు. ఆయన రాయలసీమ ప్రాంతంలో ప్రచారం చేయబోతున్నారు. 6, 8 తేదీలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారానికి వస్తున్నారు. 10న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఆ తర్వాతి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే అవకాశం ఉంది.

ప్రధాని పర్యటనపైన్నే ఆశలన్నీ...

మహా కూటమి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 8 తేదీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన మొత్తం నాలుగు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీటిలో మూడు బహిరంగ సభలు, ఒక రోడ్ షో ఉంది. అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈ మూడు నియోజకవర్గాలలో సభల ద్వారా దాదాపు 8 లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేసినట్టు భావిస్తున్నారు. 8వ తేదీన విజయవాడలోని దుర్గమ్మ కొండ నుంచి బందరు రోడ్డు మీదుగా గాని ఏలూరు రోడ్డు చివరి వరకు గాని రోడ్డు షోలో పాల్గొంటారు. ఇంకా పూర్తిగా షెడ్యూల్ ఖరారు కాలేదు.

ముందనుకున్న ప్రతిపాదన ప్రకారం గన్నవరం నుంచి విజయవాడ వరకు మోదీతో రోడ్ షో నిర్వహించాలనుకున్నా జనాన్ని తరలించడం కష్టమవుతుందని భావించారు. పైగా అన్ని కిలోమీటర్ల దూరం రోడ్డు షో బాగుండదని, ఐదారు కిలోమీటర్లకు కుదించాలని బీజేపీ అధిష్టానం సూచించింది. దీంతో రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి అటు బెంజ్ సర్కిల్ వైపు గాని లేదా ఇటు ఏలూరు రోడ్డు, బీఆర్టీ రోడ్డు మీదుగా వన్ టౌన్ వైపు గాని రోడ్ షో చేయించాలని నిర్ణయించారు. రూట్ పరిశీలన జరుగుతోందని, ఇంకా ఖరారు కాలేదని చెప్పారు పార్టీ ప్రచార బాధ్యతలు చూస్తున్న చైతన్య వాసిరెడ్డి. మోదీ రోడ్ షో కార్యక్రమంపై టీడీపీ, బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు.

మోదీ ఈసారైనా జగన్‌ను విమర్శిస్తారా.. మహాకూటమి ఏర్పాటు సందర్భంగా చిలకలూరిపేట సమీపంలో జరిగిన తొలి బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన జనాన్ని అంతగా ఆకట్టుకోలేదన్న విమర్శలు వచ్చాయి. ప్రధాని ప్రసంగం ఎటువంటి మెరుపులు లేకుండా సాగిందని చాలామంది పెదవి విరిచారు. ఆయన ఎందుకువచ్చారో, ఎందుకు వెళ్లారో కూడా అర్థం కాలేదని ప్రత్యర్థులు విమర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్న నరేంద్ర మోదీపై మహాకూటమి నేతలు భారీగా ఆశలు పెంచుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈసారి వైసీపీని ఘాటుగా విమర్శిస్తారని టీడీపీ, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. మోదీ ఇచ్చే ప్రసంగాన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Read More
Next Story