అమరావతిని కమ్మేసిన మోదీ ఫీవర్!
x
2015 అక్టోబర్ 22న అమరావతి శంకుస్థాపన సమయంలో చంద్రబాబుకు ఢిల్లీ నుంచి తెచ్చిన మట్టి కలశం అందిస్తున్న ప్రధాని మోదీ

అమరావతిని కమ్మేసిన మోదీ ఫీవర్!

అమరావతిని మోదీ ఫీవర్ కమ్మింది. ఇప్పుడు ఏ ఇద్దర్ని కదిపినా మోదీ ముచ్చటే. అమరావతి పర్యటన గురించి చర్చే.


అమరావతిని మోదీ ఫీవర్ కమ్మింది. ఇప్పుడు ఏ ఇద్దర్ని కదిపినా మోదీ ముచ్చటే. అమరావతి పర్యటన గురించి చర్చే. అమరావతి ప్రాంత రైతుల ముఖాలు కళకళలాడుతున్నాయి. మోదీ వస్తున్నాడటగా, ఈసారీ ఏదో ఒకటి తేకపోతాడా అని కొందరు.. అమరావతిని దేశ రెండో రాజధానిగా ప్రకటిస్తారటగా అని మరికొందరు ముచ్చట్లలో మునిగి తేలుతున్నారు. మోదీ పర్యటనకు రండంటూ అమరావతి ప్రాంత మహిళలు ఇంటింటికీ వెళ్లి బొట్టుబెట్టి మరీ ఆహ్వాన పత్రాలు అందిస్తున్నారు.

సరిగ్గా పదేళ్ల కిందట 2015 అక్టోబర్ 22న అమరావతికి ఇదే ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మళ్లీ వస్తున్నారు. ఆవేళ పేరు శంకుస్థాపన. ఈవేళ్టి పేరు అమరావతి రాజధాని పనుల పునర్ నిర్మాణం.. ఆవేళా ఈవేళా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఆ ఇద్దరే అధిపతులుగా ఉన్నారు.
ఆవేళ శంకుస్థాపనకు వచ్చిన మోదీ దేశంలోని పవిత్ర నదీ సంగమాల నుంచి నీళ్లు, వివిధ ప్రాంతాల నుంచి మట్టి తెచ్చి ఇచ్చారు. ఈసారి ఇవి కాకుండా మరేమైనా ప్రకటిస్తారా అనే దాని కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఇదే మోదీ తల్లిని చంపి బిడ్డను బతికించారని 2014లో ఎన్నికలకు ముందు అన్నారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో గెలిచినా వివిధ కారణాలు చూపి ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఇవ్వలేమన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ అది. అయినా సరే ఎవరూ పట్టించుకోలేదు. దానికి బదులు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. అదీ కూడా అమలు కాలేదు. ఈలోపు చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి వచ్చారు.

2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వైఎస్ జగన్ మూడు రాజధానుల ముచ్చట్ని తెరపైకి తెచ్చి అమరావతిని విస్మరించారు. ఆయన ఉన్న ఐదేళ్లు అమరావతి రైతులు అటు అనుకూలంగా ఇటు ప్రతికూలంగా పోటాపోటీ ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్రలు, పుణ్యక్షేత్రల సందర్శనలు చేశారు. ఈలోపు చంద్రబాబు హయాంలో మొదలు పెట్టిన పనులన్నీ పాడుబడి పోయాయి. అదో దెయ్యాల దిబ్బగా తయారైంది. వేసిన రోడ్లు కంకరతేలి పోయాయి. తెచ్చిన సిమెంట్ గడ్డ కట్టుకుపోయింది. పునాదులు పూడిపోయాయి. ఇనుము తుప్పు పట్టిపోయింది. సిమెంట్ గొట్టాల్ని సైతం దొంగలు ఎత్తుకుపోయారు.
బీజేపీ పై తిరగబడిన దాని తాలుకూ ఫలితం చంద్రబాబు అనుభవించాల్సి వచ్చింది. చివరకు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. సరిగ్గా ఈ దశలో ఆపద్భాంధవుడిలా వచ్చిన పవన్ కల్యాణ్- మోదీ, చంద్రబాబు మధ్య సయోధ్య కుదిర్చి ఎన్నికల్లో పొత్తుకు దారి చూపాడు. ఈ మూడు పార్టీల కలయిక కొంత, జగన్ మోహన్ రెడ్డి చేసుకున్న స్వయంకృతం కొంత కలిసి 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. కూటమి గెలిచింది.
ఇప్పుడు అమరావతి మళ్లీ పట్టాలెక్కింది. చంద్రబాబు తన పాత ఫైల్ ను దుమ్ముదులిపి గాడిన పట్టించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ సందర్భంలో ఆయన ప్రధానమంత్రి మోదీని అమరావతికి పిలిపిస్తున్నారు. అమరావతి 2.ఓ పేరిట మే 2 జరిగే ఈ కార్యక్రమాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు శాయశక్తులా కృషి చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగినట్టు చెబుతున్న విధ్వంసాన్ని ప్రధానికి కళ్లకు కట్టినట్టు చూపించేందుకు భారీ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రధానికి ఆ వివరాలన్నీ దగ్గరుండే చెప్పబోతున్నారు.
ప్రధాని మోదీని మెప్పించేలా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మోదీ కేరళ పర్యటన ముగించుకుని రెండో తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటుంది. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో నేరుగా వెలగపూడి సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ పైలాన్ ను ఆవిష్కరిస్తారు. పలు ప్రతిష్టాత్మక పథకాలకు శంకుస్థాపన చేస్తారు. మరికొన్ని పనులను పునఃప్రారంభిస్తారు.
అక్కడి నుంచి నేరుగా సుమారు 250 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. చంద్రబాబు పాలనకు, అమరావతికి ప్రజామోదం భారీగా ఉందనే సంకేతాలు ఇచ్చేలా జనసమీకరణ ఉంటుందని అంచనా. ఒక్క దెబ్బకు రెండు పిట్టలనే సామెతగా అమరావతిని వ్యతిరేకించే వారితో పాటు మళ్లీ 44 వేల ఎకరాల భూ సమీకరణకు ఇష్టపడని వారిని ఒప్పించేలా ఈ సభా నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశంలా ఉంది.

అందుకే పెద్ద నాయకుడు మొదలు గల్లీ నాయకుడు వరకు.. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తున్నారని, పర్యటనను విజయవంతం చేయాలని పిలుపు ఇస్తున్నారు. లక్ష కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని చెబుతున్నారు. జగన్‌మోహన్ రెడ్డి నిర్వాకంతో రూ.2 లక్షల కోట్ల విలువైన 130 పరిశ్రమలు, ప్రఖ్యాత వ్యాపార, విద్యాసంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని, ఫలితంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయాయని రాజధాని ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ప్రభుత్వం తలచుకుంది గనుక సభ సక్సెస్ అయితీరుతుందనడంలో సందేహం లేదు. అయితే మోదీ పర్యటన ఈ రాష్ట్ర ప్రజలకు, ప్రయోజనాలకు ఎంతమేరకు ఉపయోగపడుతుందనేదే ప్రశ్న.
"ఈ రాజధాని కేవలం భవనాల సముదాయం కాదు... ఇది తల్లిదండ్రుల త్యాగం, భవిష్యత్తు తరాల ఆకాంక్ష. ఇది ఒక్క మోదీ సభతో పునఃప్రారంభం కాదు… ఇది ప్రజాస్వామ్యంలో ఒక నూతన నమ్మకానికి నాంది."
Read More
Next Story