కొత్త గవర్నర్ ముందుకు పాత పంచాయితి
x

కొత్త గవర్నర్ ముందుకు పాత పంచాయితి

ఎంఎల్సీల నియామకం వ్యవహారం హైకోర్టు విచారణలో ఉన్న కారణంగా నియామకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని లేఖలో వీళ్ళిద్దరు గవర్నర్ ను కోరారు.


కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో వెంటనే పాత పంచాయితి ఆయన ముందుకు వచ్చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే గవర్నర్ కోటాలో ఎంఎల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ ఆలీఖాన్ నియమాకంపై నిర్ణయం తీసుకోవద్దని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ గవర్నర్ కు లేఖ రాశారు. ఎంఎల్సీల నియామకం వ్యవహారం హైకోర్టు విచారణలో ఉన్న కారణంగా నియామకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని లేఖలో వీళ్ళిద్దరు గవర్నర్ ను కోరారు.

వివాదం ఏమిటంటే కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉండగా గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యానారాయణను ఎంఎల్సీలుగా నామినేట్ చేస్తు ఆమోదం కోసం ఫైలును గవర్నర్ తమిళిసైకి పంపారు. అప్పటికే గవర్నర్-కేసీఆర్ మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా ఉండేవి. దాంతో గవర్నర్ కోటాలో ఇద్దరి నియామకానికి ఆమె అడ్డం పడ్డారు. చాలా కాలం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగులో పెట్టిన తమిళిసై చివరకు సంతకం చేయటానికి నిరాకరించి ఫైలను తిప్పిపంపేశారు. దాంతో కేసీఆర్ కు మండిపోయినా చేయగలిగేదేమీ లేక మౌనం వహించారు.

ఇదే విషయాన్ని ఒకసారి మీడియా గవర్నర్ ను ప్రశ్నిస్తే గవర్నర్ కోటాలో నియామకాలకు రాజకీయ నేతలను నియమించటాన్ని తాను అంగీకరించలేదని చెప్పారు. గవర్నర్ కోటాలో నియమితులయ్యేవారు ఏదేనా రంగంలో నిపుణులు అయి ఉండాలని ఆమె చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కోదండరామ్, మీర్ ఆలీఖాన్ ను ఎంఎల్సీలుగా నామినేట్ చేస్తు ఆమోదం కోసం గవర్నర్ కు ఫైల్ పంపారు. ఫైలును వెంటనే గవర్నర్ ఆమోదం తెలిపి సంతకం కూడా చేసేశారు. వీళ్ళు శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు తీసుకోవాలని వెళితే శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేని కారణంగా ప్రమాణస్వీకారం వాయిదాపడింది.

ఇంతలో దాసోజు, కుర్రా వీళ్ళిద్దరి నియామకాలను సవాలు చేస్తు హైకోర్టులో కేసు వేశారు. ఎంఎల్సీల నామినేషన్ లో రాజకీయ నేతలుగా తమను తిరస్కరించిన గవర్నర్ కోదండరామ్, మీర్ ఆలీఖాన్ ను మాత్రం ఎలా నియమించారని ప్రశ్నించారు. హైకోర్టు కోదండరామ్, మీర్ నియామకంపై స్టే విధించింది. దాంతో వీళ్ళిద్దరి నియామకం ఆగిపోయింది. ఇపుడు జిష్ణుదేవ్ గవర్నర్ గా కొత్తగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అందుకనే ప్రభుత్వం గవర్నర్ ముందు కోదండరామ్, మీర్ లను ఎంఎల్సీలుగా నామినేట్ చేసే విషయమై మాట్లాడుతుందన్న అనుమానం దాసోజు, కుర్రాకు వచ్చినట్లుంది.

అందుకనే ముందు జాగ్రత్తగా ఈ ఇద్దరు గవర్నర్ కు చరిత్రను వివరిస్తు పై ఇద్దరి నియామకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని రిక్వెస్టుచేశారు. వివాదం కోర్టు విచారణలో ఉందన్న విషయాన్ని కూడా గుర్తుచేశారు. క్యాబినెట్ నిర్ణయాన్న తిరస్కరించే అధికారం గవర్నర్ కు ఉందా లేదా అనే విషయమై కోర్టులో విచారణ జరుగుతోంది. మరి కొత్త గవర్నర్ ఈ వివాదంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read More
Next Story