టీడీపీ, సీపీఎం మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ
ఏపీలో రెండు చోట్ల పట్టభద్రులు, ఒక చోట టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు టీడీపీ బలం పెరిగిందో తగ్గిందో తేల్చనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటర్ల మేధా శక్తికి పరీక్షగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు మాత్రమే పోటీ చేసేవారు. అయితే ట్రెండ్ మారింది. రాజకీయ పార్టీలు నేరుగా రంగంలోకి దిగుతున్నాయి. తెలుగుదేశం మిత్రపక్షాలు, వైఎస్సార్సీపీ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించారు. అయితే ఆ విధమైన పోటీ లేదని తేలిపోయింది. ఎమ్మెల్సీ పట్ట భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో తాము పోటీ చేయడం లేదని, ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వైఎస్సార్సీపీ ప్రకటించింది.
వెలువడిన నోటిఫికేషన్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్ట భద్రుల నియోజకవర్గం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్ట భద్రుల నియోజకవర్గాలు, ఉత్తరాంధ్రలోని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. గత నెల 29న షెడ్యూల్ ప్రకటించగా నేడు ఆయా జిల్లాల కలెక్టర్ లు నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి పదో తేదీ వరకు నామినేషన్ లు స్వీకరిస్తారు. 11న పరిశీలన, 13న నామినేషన్ల ఉప సంహకరణ ఉంటుంది.
ఆలపాటి గెలుపు నల్లేరుపై నడకేనా..
మూడు నెలల క్రితమే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులు ఓటర్లను కలిసి ఓట్లు అడిగే కార్యక్రమంలో మునిగిపోయారు. వ్యక్తిగతంగా ఓటర్ల వద్దకు అభ్యర్థులు పోవడం లేదు. ఫోన్ ద్వారా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన నామినేషన్ ను ఈనెల 7న దాఖలు చేయనున్నారు. ఈయన ఇప్పటికే పలు పార్టీల నాయకులు, ముఖ్య నేతలను కలిసి తనను బలపరచాల్సిందిగా కోరుతున్నారు. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలు రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం కృషి చేస్తున్నాయి. అలాగే సీపీఐ నుంచి కూడా ఈయనకు మద్దతు ఉన్నట్లు సమాచారం.
పేరాబత్తుల కే అవకాశాలు..
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేస్తున్నారు. ఈయన కూడా ఈనెల 7న నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. జనసేన నాయకుడు, మంత్రి కందుల దుర్గేష్ రాజశేఖరం గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాజశేఖరం తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం గ్రామానికి చెందిన వారు. తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన నాయకుడు. ఐ పోలవరం ఎంపీపీ, జడ్పిటీసీగా పనిచేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు కోసం 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కాకినాడ రూరల్ పొత్తుల్లో జనసేనకు కేటాయించడంతో ఆయనకు అవకాశం దక్కలేదు. కాపు సామాజిక వర్గానికి చెందిన రాజశేఖరం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేకపోవడం వల్ల ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఆయనను బలపరిచింది. జనసేన కూడా ఆయన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తోంది.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఇళ్ల వెంకటేశ్వరావు యూటీఎఫ్ లీడర్. అంటే సీపీఎం కు మద్దతు దారుగా ఉంటూ వచ్చారు. కానీ సీపీఎం యాక్టివిటీలో నేరుగా పాల్గొన్న సందర్భాలు లేవు. ఈ దఫా ఈయన పోటీ చేయడం లేదు.
ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి రాఘవశర్మ
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ పాకలపాటి రాఘవశర్మ తిరిగి పోటీ చేయనున్నారు. ఈయన అందరి మద్దతుతో అడుగులు వేస్తున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గంలో రాజకీయాలు వద్దనే ధోరణిలో కూటమి నాయకులు ఉన్నారు. రాఘవశర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో అనుకూలంగా ఉంటున్నారు. అలాగే కమ్యూనిస్టులతో నూ సత్సంబంధాలు ఉన్నాయి. అందువల్ల తిరిగి ఆయనే గెలిచే అవకాశాలు ఉన్నట్లు పలువురు రాజకీయ నాయకులు భావిస్తున్నారు. రాఘవశర్మకు పోటీగా గాదె శ్రీనివాసులు నాయుడు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే ఇంకా పోటీలో ఉండేది, లేనిది శ్రీనివాసులు నాయుడు ప్రకటించలేదు.
పోటీలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం పోటీకి దిగుతోంది. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి ఎమెమల్సీగా ఉన్న కెఎస్ లక్ష్మణరావును తిరిగి సీపీఎం బలపరిచిన అభ్యర్థిగా పోటీకి దిగనున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి డిబి రాఘవులు పోటీ చేస్తారు. ఈయన సీనియర్ సీపీఎం నాయకులు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి సీపీఎం బలపరిచిన అభ్యర్థిగా విజయ గౌరి పోటీ చేస్తారు. వీరి పేర్లను సీపీఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించి ప్రచారంలో ఉన్నారు.
సీపీఐ మద్దతు టీడీపీ కే..
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. సీపీఎంతో కలిసి పోటీ చేద్దామని కార్యదర్శి కె రామకృష్ణ సీపీఎం వారికి లేఖ కూడా రాశారు. అయితే వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో వీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. నెల రోజుల క్రితం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేరుగా సీపీఐ కార్యదర్శి రామకృష్ణతో చర్చలు జరిపారు. విజయవాడలోని విశాలాంధ్ర కార్యాలయంలో రాజేంద్ర ప్రసాద్ రామకృష్ణను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు రామకృష్ణ సానుకూలత వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎలాగూ పోటీ చేయడం లేదు. సీపీఎం కలిసి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ కి మద్దతు ఇవ్వడమే మంచిదని సీపీఐ వారు భావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పోటీకి దూరంగా వైఎస్సార్సీపీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ వారు పోటీ చేయడం లేదు. కారణాలు వారు వెల్లడించలేదు. తాము పోటీ చేయడం లేదని మాత్రమే వైఎస్ జగన్ ప్రకటించారు. అందువల్ల వైఎస్సార్ సీపీ నుంచి ఎటువంటి వత్తిడిలు ఉండవు. ఆ పార్టీకి చెందిన వారు వారి ఇష్టమైన వారికి ఓటు వేసుకునే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీకి దిగిన ఆలపాటి కానీ, పేరాబత్తుల కానీ వివాద రహితులుగా ఉన్నారు. సీపీఎం వారు పేరుకు మాత్రమే పోటీలో ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. కేఎస్ లక్ష్మణరావుకు ఈ సారి గెలిచే అవకాశం లేదని, తెలుగుదేశం వారు చాలా రోజులుగా గ్రౌండ్ వర్క్ చేసుకోవడం, సీపీఐ మద్దతు ఆలపాటి కే ఉండటం వల్ల లక్ష్మణరావు ఓటమి ఖాయమనే ప్రచారం సాగుతోంది.