తర్లువాడ.. ఇక లక్షాధికారుల వాడ!
x

తర్లువాడ.. ఇక లక్షాధికారుల వాడ!

గూగుల్ డేటా సెంటర్ కి భూమిస్తే కాసులు గలగలే అంటున్న ఎమ్మెల్యే గంటా


విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ ఇక లక్షాధికారుల వాడ కానుందా? అంటే అవుననే అంటున్నారు భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ తర్లువాడ గ్రామంలోనే గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కానుంది. ఈ సెంటర్ కి ప్రభుత్వం 308.657 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ భూమిని సేకరించే పనిలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు.


ప్రభుత్వం అక్కడి భూముల రిజిస్ట్రేషన్‌ విలువ రూ.20 లక్షలకు పెంచి, రైతులకు ఎక్కువ మొత్తం పరిహారం వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తర్లువాడ రైతులకు భరోసా ఇచ్చారు. కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ సమక్షంలో విశాఖపట్నంలోని సర్క్యూట్‌హౌస్‌లో మీటింగ్ పెట్టి రైతులు భూములు ఇస్తే ప్రభుత్వం ఏమేమి ఇస్తుందో పూసగుచ్చినట్టు చెప్పించారు. దీంతో సంతృప్తి వ్యక్తం చేసిన తర్లువాడ రైతులు పలువురు ఆమోదపత్రాలు అందజేశారు. భూములిచ్చిన రైతుల ఖాతాల్లో శనివారం అంటే ఇవాళ్టి నుంచే పరిహారం మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ఎకరానికి అన్నీ కలుపుకుని సుమారు 40 లక్షల రూపాయల వరకు డబ్బులు వస్తాయని అంచనా.

గూగుల్‌ కోసం 308.657 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి ఇస్తుంది. ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్క్‌ పేరుతో ఈ భూముల సేకరణ జరుగుతుంది. ప్రస్తుతం సేకరిస్తున్న భూమిలో 204 ఎకరాల వరకు డీపట్టా, శివాయ్‌ జమేదార్, రికార్డుల్లోకి ఎక్కని శివాయ్‌ జమేదార్‌ భూములున్నాయి.
అక్కడ భూముల రిజిస్ట్రేషన్‌ విలువను డీ పట్టా భూములకు ఎకరానికి రూ.20 లక్షలు, రికార్డుల్లోకి ఎక్కని శివాయ్‌ జమేదార్‌ భూములకు ఎకరానికి రూ.10 లక్షలకు పెంచారు. అయితే తమ భూమికి ఎకరానికి 20 సెంట్ల చొప్పున తర్లువాడ సమీపంలోనే భూమి కేటాయించాలని, మిగతా భూమికి పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. దానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. అంటే ఎకరం భూమి ఇచ్చిన రైతుకు 80 సెంట్లకు పరిహారం, 20 సెంట్ల భూమి కేటాయిస్తారు.
ఇక డీ పట్టా రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్‌ ధరకు రెండున్నర రెట్లు ఇస్తారు. రికార్డుల్లోకి ఎక్కని శివాయ్‌జమేదార్‌ భూములకు సర్కార్ నిర్ణయించిన ధర ప్రకారం పరిహారం ఇస్తారు. దీంతోపాటు భూములిచ్చిన రైతులకు 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలం, ఫలసాయం కోల్పోయిన కుటుంబాలకు వాణిజ్య సముదాయం నిర్మించి వ్యాపారాలు చేసుకునే సదుపాయం కల్పిస్తారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. తనను, తమ ప్రభుత్వాన్ని నమ్మాలని కోరారు. రైతుల్ని తప్పుదోవ పట్టించే దళారులపై కేసులు పెడతామని హెచ్చరించారు.


Read More
Next Story