ఉత్తరకోస్తాను వణికించిన భూ ప్రకంపనలు
x
విశాఖపట్నం నగరం..

ఉత్తరకోస్తాను వణికించిన భూ ప్రకంపనలు

విశాఖలో ఉరుకులు పరుగులు పెట్టిన ప్రజలు


విశాఖపట్నం కేంద్రంగా మంగళవారం తెల్లవారుజామున 4.24 నిమిషాలకు భూమి కంపించింది. ప్రజలు నిద్రమత్తులో ఉండగా భూమి ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. భూమి అడుగు భాగం నుంచి భారీ వాహనాన్ని భారంగా ఈడ్చుకుని వెళ్తున్న శబ్దం వినిపించింది. దీంతో ఉలిక్కి పడ్డ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరికొందరు తమ కుటుంబ సభ్యులను నిద్రలేపి ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. దాదాపు నాలుగైదు సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం భయంతో జనం తిరిగి నిద్రకు ఉపక్రమించలేదు.

విశాఖ నగరంలోని సీతమ్మధార, అక్కయ్యపాలెం, మురళీనగర్, ఎంవీపీ కాలనీ, బీచ్ రోడ్డు, రుషికొండ, కైలాసపురం, సాగర్ నగర్, భీమిలి, గోపాలపట్నం, మధురవాడ, గాజువాక తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇంకా విశాఖపట్నంతో పాటు కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల, నర్సీపట్నం, చోడవరం, యలమంచిలి, అల్లూరి జిల్లా జి.మాడుగుల, రంపచోడవరం, శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం, ఆమదాలవలస, కాకినాడ జిల్లా కాకినాడ, తుని,తదితర ప్రాంతాలతో పాటు పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా రాజాం ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఒడిశాలోని జైపూర్, కోరాపుట్, మల్కనగిరి, చిత్రకొండ, బలిమెల ప్రాంతాల్లో పలుచోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. అంటే విశాఖకు దాదాపు 450 కిలోమీటర్ల పరిధి వరకు ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.

భూకంప తీవ్రత 3.7 మాగ్నిట్యూడ్గా గుర్తింపు..

విశాఖలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.7 మాగ్నిట్యూడ్ ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. ఇది విశాఖపట్నానికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల వద్ద పది కిలోమీటర్ల లోతులో భూ కంపం కేంద్రం (ఎపి సెంటర్) ఉన్నట్టు భూకంపాలు, వల్కనోలపై అధ్యయనం చేస్తున్న 'వల్కనో డిస్కవరీ' అనే సంస్థ వెల్లడించింది. భూకంప తీవ్రత భూ ఉపరితలంపై కంటే అడుగు భాగంలోనే ఎక్కువగా ఉంది.

Read More
Next Story