దొరికిందే ఛాన్సని వాయించేస్తున్నారా ?
x

దొరికిందే ఛాన్సని వాయించేస్తున్నారా ?

దొరికినపుడే వ్యవహారమేంటో తేల్చుసుకోవాలని మంత్రులు అనుకున్నట్లున్నారు. అందుకనే కేసీఆర్ దొరికిందే చాలన్నట్లుగా వాయించేస్తున్నారు.


దొరికినపుడే వ్యవహారమేంటో తేల్చుసుకోవాలని మంత్రులు అనుకున్నట్లున్నారు. అందుకనే కేసీఆర్ దొరికిందే చాలన్నట్లుగా వాయించేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గురువారం అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు గంటన్నరసేపు ప్రసంగించిన భట్టి ఏ రంగానికి ఎన్ని నిధులు, ఏ శాఖకు ఎన్ని నిధులు, ఏ పథకానికి కేటాయించిన నిధులెన్ని అన్న విషయాలను వివరించారు. భట్టి ప్రజెంట్ చేసిన బడ్జెట్ చివరిదశలో ఉండగానే కేసీఆర్ సభలోనుండి వెళిపోయారు.

బడ్జెట్ ప్రవేశపెట్టడం అయిపోయిన తర్వాత మొదటిసారి కేసీఆర్ అసెంబ్లీ ఆవరణలోనే ఉన్న మీడియా పాయింటుకు వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడుతు బడ్జెట్ కేటాయింపులపై విరుచుకుపడ్డారు. ప్రజల ఆశలపై బడ్జెట్ నీళ్ళు చల్లేట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తమ హయాంలో అమలుచేసిన చాలా పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. ఈ బడ్జెట్ వల్ల ఏ ఒక్క వర్గానికి కూడా మేలుజరిగేట్లుగా లేదన్నారు. బడ్జెట్లో ఐటి, పారిశ్రామిక విధానాలు లేవని చెప్పారు. బడ్జెట్ అంత ఉత్త చెత్తని, కొత్తదనం ఏమీలేదంటు పెదవి విరిచారు. రైతు భరోసా ప్రస్తావనే బడ్జెట్లో లేదని ఇది రైతు శతృత్వ ప్రభుత్వమని మండిపడ్డారు. భవిష్యత్తులో ఈ బడ్జెట్ పై ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతామని హెచ్చరించారు.

ప్రతిపక్షాలకు ప్రతివిషయంలోను ప్రభుత్వాన్ని విమర్శించటమే టార్గెట్ గా మారిపోయింది. కాబట్టి కేసీఆర్ నుండి బడ్జెట్ పై ఇంతకుమించిన రియాక్షన్ను ఆశించేందుకు లేదు. బడ్జెట్ పై కేసీఆర్ రియాక్షన్ అందరు ఊహించిందే. అయితే కేసీఆర్ రియాక్షన్ పై భట్టి మాట్లాడుతు అసలు బడ్జెట్ ను సాంతం చదవకుండానే, బడ్జెట్ స్పీచ్ ను పూర్తిగా వినకుండానే కేసీయార్ అసెంబ్లీలో నుండి వెళిపోయినట్లు మండిపోయారు. తన హయాంలో అన్నీ రంగాలను నాశనంచేసిన కేసీయార్ నుండి బడ్జెట్ పై ఇంతకుమించిన కామెంట్లను ఆశించేందుకు లేదన్నారు. మరో మంత్రి సీతక్క మాట్లాడుతు కేంద్రం బడ్జెట్ పై స్పందించని కేసీఆర్, రాష్ట్ర బడ్జెట్ పై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణాకు ద్రోహంచేసిన కేంద్రం బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసిన రోజున కేసీయార్ సభకు ఎందుకు రాలేదని నిలదీశారు.

కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ ను విమర్శించటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు సీతక్క చెప్పారు. ఇక అచ్చంపేట ఎంఎల్ఏ వంశీ కృష్ణ మాట్లాడుతు కేసీఆర్ ప్రవేశపెట్టిన పదేళ్ళ బడ్జెట్ ఎవరికీ ఉపయోగపడలేదన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల ఊసే కేసీయార్ ప్రభుత్వం ఎత్తలేదని ఎద్దేవాచేశారు. నారాయణ ఖేడ్ ఎంఎల్ఏ సంజీవరెడ్డి మాట్లాడుతు వాస్తవానికి దగ్గరగా ఉన్న బడ్జెట్ కారణంగానే కేసీఆర్ కు మింగుడుపడటంలేదని ఎద్దేవాచేశారు. ఎంఎల్ఏలు కవ్వంపల్లి సత్యనారాయణ, మధన్ మోహన్ రావు మాట్లాడుతు భట్టి ప్రవేశపెట్టిన వాస్తవానికి చాలా దగ్గరగా ఉందన్నారు. కేసీయార్ ప్రభుత్వం లాగ బడ్జెట్ అంకెలకు మాత్రమే పరిమితం అవ్వకుండా తమ ప్రభుత్వం వాస్తవంలోకి తీసుకొస్తుందన్నారు. అందుకనే బడ్జెట్ పై కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడ్డారు. మొత్తానికి రాకరాక అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ను మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏలు వాయించేస్తున్నారు. దొరికిందే ఛాన్సని మంత్రులతో పాటు ఎంఎల్ఏలు కూడా కేసీఆర్ ను టార్గెట్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

Read More
Next Story