హజ్‌ యాత్రపై మంత్రి సత్యకుమార్ అనుచిత వ్యాఖ్యలు.. ఏపీ మండలిలో రచ్చ
x

హజ్‌ యాత్రపై మంత్రి సత్యకుమార్ అనుచిత వ్యాఖ్యలు.. ఏపీ మండలిలో రచ్చ

చర్చ జరిగింది ఒక అంశంపైన. ప్రస్తావించింది మరొక అంశంపైన. ఏపీ శాసన మండలిలో రచ్చకు దారి తీసిన మంత్రి సత్యకుమార్‌ అనవసర వ్యాఖ్యలు.


ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక అంశంపై చర్చ జరుతుంటే.. సంబంధం లేని మరొక అంశాన్ని ప్రస్తావించడం రచ్చకు దారి తీసింది. ఈ అనసవర పరిణామాలు కూటమి భాగస్వాగా ఉన్న బీజేపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల చోటు చేసుకుంది. మంత్రి మాటలకు ఒక్క క్షణం అయోమయానికి లోనైన విపక్ష సభ్యులు వెంటనే తేరుకొని మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. చర్చల మధ్యలో మతాల ప్రస్తావనలు ఎందుకు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో నిలదీశారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు మంత్రి ప్రయత్నం చేస్తున్నారని నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో మంత్రి సత్యకుమార్‌ దిగిరాక తప్ప లేదు. తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి.

అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సమావేశాల సందర్భంగా గురువారం ఉదయం చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించిన ప్రశ్న ఉంది. ఏపీకి ఇస్తామన్న ఎంబీబీఎస్‌ సీట్లను వద్దని పేర్కొంటూ జాతీయ వైద్య మండలికి లేఖ రాసిన విషయం వాస్తవమేనా? ఒక వేళ రాస్తే ఎందుకు రాశారు? కారణాలు ఏమిటి? రిజర్వేషన్‌ వర్గాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని నూతన వైద్య కళాశాలల్లో రద్దు చేయకపోవడానికి కారణాలేమి? ఇన్‌ సర్వీసు కోటా పీజీ సీట్లు తగ్గించడానికి, ప్రైవేటు వైద్య కళాశాలలను ప్రోత్సహించడానికి కారణాలేమిటి? వంటి ప్రశ్నలకు కూటమిలో ఉన్న బీజేపీ మంత్రి సత్యకుమార్‌ సమాధానలు చెప్పాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో సత్యకుమార్‌ మాట్లాడుతూ హజ్‌ యాత్రకు సంబంధించిన ప్రస్తావన చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి.. హజ్‌ యాత్రకు వెళ్లినట్లుగా అంటూ అనవసర ప్రస్తావన చేశారు. దీంతో విపక్ష సభ్యులు ఒక్క సారిగా పైకి లేచారు. మంత్రి సత్యకుమార్‌ వ్యాఖ్యలపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతగల మంత్రి స్థానంలో ఉండి మతాలపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారని నిలదీశారు. సర్వ మతాలను సమానంగా చూడాల్సిన శాసన మండలిలో ముస్లింలను కించపరిచే విధంగా ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. పవిత్రమైన హజ్‌ యాత్రను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికదన్నారు. మతాలను, వ్యక్తులను చర్చల్లోకి లాగడం మంచిది కాదన్నారు. మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌ మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత హజ్‌ యాత్రను కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదన్నారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇతర మతాలను, వ్యక్తులను చర్చల్లోకి లాగడం, దూషించడం మంచిది కాదన్నారు.
ఈ నేపథ్యంలో తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని, రికార్డుల్లో నుంచి వాటిని తొలగించాలని ఛైర్మన్‌ను కోరారు. తర్వాత మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్‌ మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదన్నారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్‌ మాటలను సమర్థిస్తూ, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదన్నారు. మంత్రి సత్యకుమార్‌ ఆ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో అదే సభలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నవ్వుతూ కనిపించడం విశేషం.
Read More
Next Story