విద్యారంగంపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక సూచనలు
x

విద్యారంగంపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భారీగా తగ్గుతున్న అడ్మిషన్ల దగ్గర నుంచి టీచర్ల కొరత వరకు అన్ని సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి వాటి పరిష్కారం కోసం చర్యలు చేపడుతోంది.


ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భారీగా తగ్గుతున్న అడ్మిషన్ల దగ్గర నుంచి టీచర్ల కొరత వరకు అన్ని సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి వాటి పరిష్కారం కోసం చర్యలు చేపడుతోంది. అదే విధంగా పిల్లలకు అందించే కిట్‌లపై కూడా దృష్టి సారించి.. విద్యార్థులకు ఇచ్చే కిట్‌లు నాణ్యంగా ఉండాలని, ఏదో ఇచ్చామంటే ఇచ్చాం అన్న రీతిలో ఉండకూడదని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వారికి అందించే మధ్యాహ్న భోజనంపై కూడా అధికారులను ప్రశ్నించారని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, అది కూడా మెనూ ప్రకారం క్రమం తప్పకుండా ఉండాలని సూచించారు. విద్యార్థులకు అందించే ఏ వసతి విషయంలోనైనా నిర్లక్ష ధోరణి కనిపిస్తే సదరు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అంశాలను కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో కూడా ప్రస్తావించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొని ఉన్న ఉపాధ్యాయుల కొరత సమస్యపై మాట్లాడి.. అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు.

‘విద్యా వాలంటీర్లను నియమించుకోండి’

‘‘ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులకు అందించే విద్య నాణ్యత దెబ్బతినకూడదు. ఎన్ని పోస్ట్‌లు ఖాళీ ఉంటే వాటన్నింటికీ సరిపడా సంఖ్యలో విద్య వాలంటీర్లను నియమించుకోండి. అత్యవసరంగా ఉపాధ్యాయుల అవసరం ఉన్న ప్రాంతాల్లో డిజిటల్ విధానంలో క్లాస్‌లు నిర్వహించండి. విద్యార్థులకు అందించే విద్య నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. వెంటనే విద్య వాలంటీర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్న పూర్తి వివరాలను అందించండి. వాలంటీర్ల నియామకాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి’’ అని ఆదేశించారు చంద్రబాబు.

‘బడులకు ముందు మీరు రండి’

అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య, పాఠశాలలకు వస్తు విద్యార్థుల సంఖ్య తీవ్రంగా క్షీణించడంపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మొదట ఉపాధ్యాయులందరూ పాఠశాలకు రావడం నేర్చుకుంటే ఆ తర్వాత పిల్లలను బడులకు తీసుకురావడంపై ఆలోచించొచ్చు. రాష్ట్రంలోని ప్రతి చిన్నారి కూడా ఎక్కడో ఒకచోట బడిలో చేరే ఉండాలి. యూనిఫార్మ్‌లను అందించడంలో ఎవరైనా గుత్తేదారు విఫలమయితే.. కావాల్సిన యూనిఫార్మ్‌ల ఆర్డర్‌ను మిగిలిన గుత్తేదార్లకు సమానంగా పంచాలి. తద్వారా విద్యార్థులకు యూనిఫార్మ్‌లు ఇవ్వడంలో ఆలస్యం లేకుండా చూడాలి. అంతేకాకుండా విద్యార్థులకు ఒత్తిడి లేకుండా చదువుకునే వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే వారి ప్రతిభను గుర్తించడం సాధ్యమవుతుంది’’ అని చెప్పారు. ఇదే అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడారు. ఆయన కూడా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

మూడు నెలలకొకసారి సమావేశం: లోకేష్

ప్రతి పాఠశాలలో కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం జరగాలని విద్యాశాఖ అధికారులకు శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. ‘‘రెసిడెన్షియల్, ఆదర్శ, కేజీబీవీ పాఠశాల విద్యార్థులను సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలకు సిద్ధం చేయాలని. మొదటిసారి సీబీఎస్‌ఈ పరీక్షలకు వెళ్తున్నారు. పొరపాటున ఫెయిల్ అయితే ఆ విద్యార్థి జీవితాంతం బాధపడతాడు. కాబట్టి ప్రతి విద్యార్థిని ప్రత్యేక శ్రద్ధతో సిద్ధం చేయాలి’’ అని వివరించారు. ఈ సందర్భంగానే టీచర్లకు లోకేష్ ఓ శుభవార్త చెప్పారు.

ప్రతి రోజూ ఉదయాన్నే పాఠశాలలోని మరుగు దొడ్లను ఫొటో తీసి అప్‌లోడ్ చేసే పద్దతికి స్వస్తి పలికినట్లు లోకేష్ వెల్లడించారు. ఈ ఆప్షన్‌ను యాప్ నుంచి కూడా తొలగించినట్లు వెల్లడించారు. కానీ ఏ టీచర్ అయినా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, విద్యార్థులను జీవితాలను క్రమశిక్షణ, ఉన్నత విలువలతో తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉంటుందని వివరించారు. టీచర్ల సమస్యలన్నింటికీ అధిక ప్రాధాన్యత ఇస్తామని, వాటన్నింటి పరిష్కారానికి కృషి చేస్తానని కూడా భరోసా ఇచ్చారు.

Read More
Next Story