మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఒకటి కాదు రెండు..
ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ చెప్పంది. వారికి అతి త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం అందించనున్నట్లు ప్రకటించింది. దాంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు కూడా ప్రభుత్వం తీపి కబురు చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చంద్రబాబు చెప్పారు. అందులో భాగంగానే డ్వాక్రా మహిళల ఆర్థిక స్వాలంబన కోసం తమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చంద్రబాబు వివరించారు. అదే విధంగా చెప్పిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అమలు చేస్తామని వెల్లడించారు. వీటితో పాటుగా పేదలకు రూ.5 భోజనం అందించడమే దిశగా అన్న క్యాంటీన్లను కూడా పునరుద్దరిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు.
కసరత్తు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే రోజుకు బస్సులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది. పథకం అమలులో ఎలాంటి సమస్యలు తలెత్తొచ్చు? ఆర్థిక పరంగా తీసుకోవాల్సిన చర్యలేంటి? అమలు తర్వాత తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరించాలి? కావాల్సినన్ని బస్సులు ఉన్నాయా? లేకుంటే ఇంకా ఎన్ని బస్సులు కావాల్సి వస్తుంది? వంటి అధికారులతో చర్చించింది.
అంతేకాకుండా ఏయే క్యాటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి? అన్ని మార్గాల్లో ఈ పథకం అమలు సాధ్యమేనా? అలా చేస్తే ప్రభుత్వం భారం ఎంత మేర ఉండొచ్చు? చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అందుకు వీలవుతుందా లేదా అనే విషయంపై అధికారుల అభిప్రాయాలను సేకరించింది. వీటితో పాటు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారుల అభిప్రాయాలను కూడా సేకరించి పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చింది సర్కార్. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అన్న క్యాంటీన్లు అప్పటి నుంచే
ఇదిలా ఉంటే రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునరుద్దరణ కూడా ఆగస్టు 15 నుంచి జరగనున్నట్లు ఆయన ప్రకటించారు. పేదలకు రూ.5 భోజనం అందించే పథకాన్ని దేశానికి స్వతంత్య్రం వచ్చిన రోజు నుంచి పునఃప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. అన్న క్యాంటీన్ల తొలి విడతలో ఎన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తారు అన్న అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ దాదాపు 100 క్యాంటీన్లను ప్రారంభించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా ఈసారి కూడా అన్న క్యాంటీన్లలో భోజన సదుపాయాలు చేసే కాంట్రాక్ట్‌ను మళ్ళీ ఇస్కాన్ వారికే అందించనున్నట్లు సమాచారం. కాగా మరోవైపు టెండర్లు పిలవాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మహిళాసాధికారతే లక్ష్యం
ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే డ్వాక్రా మహిళలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చంద్రబాబు వివరించారు. ఉన్నతి పథకం కింద డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తున్న మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది సర్కార్. మహిళల జీవనోపాధి కింద ఒక్కోక్కరికి రూ.50వేల నుంచి రూ.5 లక్షల మరకు వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. ఈ పథకాన్ని తీసుకురావడానికి బలమైన కారణాలు ఉన్నాయని, మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చంద్రబాబు వెల్లడించారు.
డ్వాక్రా మహిళలు ఉన్నతి పథకం కింది రుణాలు తీసుకుని చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారు సొంత వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారాయన. తాజాగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో వారికి మరింత ఊతమందుతుందని, ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బడ్జెట్‌లో ఈ పథకం కోసం మరో రూ.250 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపించినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ పథకానికి రూ.250 కోట్ల నిధులు అందుతున్నాయని, వాటికి అదనంగా ఇప్పుడు మరో రూ.250 నిధులు జోడించి మొత్తం రూ.500 కోట్ల రుణాలను ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు అందించనున్నట్లు చంద్రబాబు వివరించారు.