
వడ్డెర్లకు మైనింగ్ లీజులు
రాష్ట్రంలో ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని, మైనింగ్ లో శాటిలైట్, డ్రోన్ చిత్రాల ద్వారా విశ్లేషణ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
వడ్డెర్లకు మైనింగ్ లీజుల కేటాయింపు అంశంపై విధానాన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గనుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వడ్డెర్లు, సొసైటీలకు 15 శాతం మేర గనుల్లో రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వచ్చే కేబినెట్ లో చర్చించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వెనుకబడిన వర్గాలైన వడ్డెర్లకు ఆర్ధిక ప్రయోజనాలు కలిగేలా లీజు కేటాయింపు విధానాన్ని రూపోందించాలని సీఎం స్పష్టం చేశారు. సీనరేజి, ప్రీమియం మొత్తాల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని ఆదేశించారు. మైనింగ్ లీజుల కేటాయింపుతో పాటు వారు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేందుకు కూడా ప్రస్తుతం ఉన్న పాలసీని అనుసంధానించాలని అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో గనుల శాఖ, ఉచిత ఇసుక విధానంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో గనుల తవ్వకాలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ఆధారిత టెక్నాలజీతో విశ్లేషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇచ్చిన పర్మిట్లు, జరిగిన తవ్వకాలు ఎంత అనేది ఎప్పటికప్పుడు విశ్లేషించాలన్నారు. అనలటిక్స్ ను వినియోగించుకుని జరిగిన తవ్వకాలను అంచనా వేయాలన్నారు. బీచ్ శాండ్ మినరల్స్ లాంటి భార ఖనిజాల మైనింగ్ తో పాటు విలువ జోడింపు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. అలాగే కడపలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ కు ముడి ఇనుము ఖనిజం సరఫరా పై కూడా అధ్యయనం చేయాలని సూచించారు.
రాష్ట్రంలో లభ్యం అవుతున్న ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గనుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఖనిజాలకు విలువ జోడింపుతోనే అదనపు ఆదాయం వస్తుందని సీఎం సూచించారు. మేజర్, మైనర్ మినరల్స్ ద్వారా 2025-26 ఆర్ధిక సంవత్సరానికి రూ.3320 కోట్ల ఆదాయార్జనను లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గతంతో పోలిస్తే 34 శాతం మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.