![వలస పక్షుల మనసు తెలుసుకోరా? వలస పక్షుల మనసు తెలుసుకోరా?](https://andhrapradesh.thefederal.com/h-upload/2025/02/14/512910-birds-111zon.webp)
నౌపడాలో కామన్ రెడ్ షాంక్ పక్షులు
వలస పక్షుల మనసు తెలుసుకోరా?
ఏటా ఉత్తరాంధ్రకు వేలల్లో వీటి రాక. క్రమంగా వందలకు పడిపోతున్న సంఖ్య. ఆవాసాలకు ఆటంకం కలగడం వల్లేనంటున్న పక్షి ప్రేమికులు. ప్రకృతి వనరులను కాపాడాలని వేడుకోలు.
ఏటా దేశవిదేశాల నుంచి వలస పక్షులు రెక్కలు కట్టుకుని వస్తుంటాయి. వేల కిలోమీటర్లు ఎగురుతూ ఇక్కడకే వచ్చి వాలుతుంటాయి. కొన్ని నెలలు ఆ ప్రాంతంలోనే ఉండి తిరిగి తమ స్వస్థలాలకే పయనమవుతాయి. కానీ ఇటీవల కాలంలో వలస వచ్చే పక్షుల సంఖ్య తగ్గిపోతోంది. ఇదే ఇప్పుడు పక్షి ప్రేమికులకు ఆందోళనకు గురి చేస్తోంది.
ఉత్తరాంధ్ర.. వలస పక్షులకు అత్యంత ఇష్టమైన ప్రాంతం. పక్షులకు ఆవాసానికే కాదు.. తిండికీ ఎంతో అనువుగా ఉంటుంది. అక్టోబర్ నుంచి తమ ప్రాంతంలో అతి శీతల వాతావరణం ఉండడం వల్ల అక్కడ నుంచి ఖండాంతరాలు దాటి ఒకింత ఉష్ణ వాతావరణం ఉండే ఇక్కడికి చేరుకుంటాయి. అలా అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడే ఉంటాయి. ఇలా శ్రీకాకుళం జిల్లాలోని తేలినీలాపురం, తేలికుంచి, నౌపడ, దాలిచెరువు ప్రాంతాలతో పాటు విశాఖపట్నం జిల్లా మేహాద్రిగెడ్డ, విశాఖ విమానాశ్రయం వెనక భాగం, తాటిపూడి రిజర్వాయరు, అనకాపల్లి జిల్లా కొండకర్ల ఆవ తదితర ప్రదేశాలకు ఏటా వేల సంఖ్యలో వలస పక్షులు వస్తుంటాయి. దశాబ్దాల తరబడి ఈ పక్షుల రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కొన్నాళ్లుగా వీటి రాక తగ్గిపోతున్నట్టు పక్షి, పర్యావరణ ప్రేమికులు గుర్తించారు. ఈ పరిస్థితిపై వీరు ఆందోళన చెందుతున్నారు.
రెడ్ అవడావట్ పక్షి
వేల నుంచి వందలకు తగ్గాయి..
శ్రీకాకుళం జిల్లా నౌపడ. దాలిచెరువు ప్రాంతానికి శీతాకాలంలో ఉత్తరాదితో పాటు యూరప్ నుంచి ఐదారు వేల పక్షులు వచ్చేవి. వీటిలో బ్లాక్ వింగ్ స్టిల్ట్, పైఫ్ట్ ఎవోసెట్స్, సాండ్ పైపర్స్, రెడ్ షాంక్, గ్రీన్ షాంక్ వంటి అరుదైన పక్షులుంటాయి. అక్కడుండే చిత్తడి నేల (వెట్ ల్యాండ్స్) ల్లో లభించే చిన్న చిన్న చేపలు, పురుగులు, కీటకాలను తిని ఇవి జీవిస్తాయి. ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపిస్తాయి. ఈ పక్షులు గతంలో వేలాదిగా వచ్చేవి. గతేడాది శీతాకాలంలో కూడా ఈ పక్షులు వేలల్లోనే వచ్చాయి. కానీ ఈ ఏడాది వాటి సంఖ్య 200-300కి మించి కనిపించడం లేదు. ఆ జిల్లాలోని మూలపేట (భావనపాడు) వద్ద కొత్తగా పోర్టు నిర్మాణం జరుగుతోంది. అక్కడకు ఈ పక్షులు ఆవాసాలేర్పరచుకునే నౌపడా చిత్తడి నేలల మీదుగా రోడ్డు వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని చెరువులను కప్పేశారు. పైగా రోడ్లు వేస్తుండడం, వాహనాల రాకపోకలతో రొదగా ఉండడం వల్ల ఈ పక్షుల జీవనానికి ఇబ్బంది ఏర్పడింది. దీంతో ప్రతికూల వాతావరణంతో వలస పక్షులు మనసు మార్చుకుంటున్నాయని వృత్తిపరంగా చార్టర్డ్ అకౌంటెంట్, వైజాగ్ బర్డ్ వాచర్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు విక్రమ్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
తేలినీలాపురంలో స్పాట్ బిల్డ్ పెలికాన్లు
తేలి నీలాపురంలో సైతం..
ఇక విదేశీ పక్షులకు ఎన్నో దశాబ్దాల నుంచి పేరెన్నిక గన్న తేలినీలాపురంలోనూ విదేశీ పక్షుల రాక ఏటా క్షీణిస్తోంది. ఇక్కడకు రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి పెయింటెడ్ స్టార్క్, స్పాట్ బిల్లెడ్ పెలికాన్ పక్షులు అక్టోబర్, నవంబరు నెలల్లో వేల సంఖ్యలో వస్తుంటాయి. అవి అక్కడున్న చింత చెట్లపై ఆవాసాలేర్పాటు చేసుకుని అక్కడే గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి. ఆ పరిసరాల్లోని చెరువులు, కాలువల్లో లభించే చేపలను వేటాడి తింటాయి. పుట్టిన పిల్లలు రెక్కలు తొడిగి వాటంతట అవే ఎగిరే స్థాయికి ఎదిగే వరకు తేలినీలాపురంలోనే ఉంటాయి. ఆ తర్వాత తామొచ్చిన ప్రాంతాలకు పిల్లలతో ఎగిరి పోతాయి. తేలినీలాపురంలో బర్డ్ శాంక్చురీ ఉన్నప్పటికీ అక్కడ కూడా ఈ పక్షులకు అనుకూలత లేక వచ్చే వాటి సంఖ్య తగ్గిపోతోంది.
నౌపడ పక్షుల ఆవాసాల సమీపం నుంచి భావనపాడుకు వేస్తున్న రోడ్డు
ఒకప్పుడు వలస వచ్చే సైబీరియా పక్షులు వేలలో ఉండగా ఇప్పుడక్కడ 700-800కి మించడం లేదు. తేలినీలాపురంలో బర్డ్ శాంక్చురీ ఉన్నా అక్కడ వైద్యుడు కూడా లేకపోవడంతో అనారోగ్యం బారిన పడిన పక్షులకు వైద్యమందే పరిస్థితి లేక చనిపోతున్నాయి. ఇక తాటిపూడి రిజర్వాయరు ప్రాంతంలో రెడ్ క్రస్ట్ పోచార్డ్, టెఫ్టెడ్ డక్స్, పిన్టేల్ డక్స్ యూరప్ నుంచి వస్తాయి. అలాగే కొండకర్ల ఆవ ప్రాంతానికి కాటన్ టేల్స్, రెడ్ క్రస్ట్ పోచార్డ్, కాటన్ పోచార్డ్, పింక్ టెయిల్ బాతులు వస్తుంటాయి.
కొండకర్ల ఆవలో పర్పుల్ హెరాన్ పక్షి
పదేళ్ల క్రితం వీటి సంఖ్య పది వేల వరకు ఉండగా ఇప్పుడవి 2-3 వేలకు తగ్గిపోయినట్టు అంచనా వేస్తున్నారు. కొండకర్ల ఆవలో స్థానికులు చేపల వేటకు అడ్డంకిగా మారడం కూడా వీటి సంఖ్య తగ్గడానికి ఒక కారణమని చెబుతున్నారు. ఉత్తరాంధ్రకు ఖండాలు దాటుకుని వచ్చే వలస పక్షుల విడిదికి విఘాతం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ త్రూ రీసెర్చి అండ్ ఎడ్యుకేషన్ సభ్యుడు వివేక్ రాథోడ్ కోరారు.
స్పాట్ బిల్డ్ హెడ్ డక్
ప్రకృతిని ధ్వంసం చేయడం వల్లే..
'వేల మైళ్ల దూరం ప్రయాణించి ఈ ప్రాంతానికి పక్షులు వలస రావడానికి కారణం ఇక్కడ ఉండే ప్రకృతి, పర్యావరణ వనరులే. కొన్నాళ్లుగా భావనపాడు పోర్టుకు అనుసంధానంగా థర్మల్ పవర్ ప్లాంటుతో మరికొన్ని ఏర్పాటవుతున్నాయి. ఇందుకోసం వేలాది ఎకరాలు వెట్ ల్యాండ్స్/ బీల భూములను సేకరించడం వల్ల తేలినీలాపురం, నౌపడ ప్రాంతాలకు వలస వచ్చే విదేశీ పక్షులకు ప్రతికూల పరిస్థితులేర్పడుతున్నాయి.
ఈఎఎస్ శర్మ
ఫలితంగా ఏటా వలస పక్షుల రాక తగ్గిపోతోంది. ప్రకృతి ప్రసాదించిన పర్యావరణ వనరును ధ్వంసం చేయడం సబబు కాదు. వలస పక్షుల ఆవాసాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దీనిపై ఇప్పటికే నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్కు లేఖ రాశాను' అని భారత ప్రభుత్వ ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఎఎస్ శర్మ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.