పిఠాపురంలో పవన్‌ ప్రచారానికి మెగాస్టార్‌ చిరంజీవి
x

పిఠాపురంలో పవన్‌ ప్రచారానికి మెగాస్టార్‌ చిరంజీవి

రాజకీయాలకు దూరమైన చిరంజీవి తమ్ముడి కోసం ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు. దీంతో కూటమి శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.


రాజకీయాలకు దూరమైన మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ కోసం ఎన్నికల ప్రచారంలోకి దిగనన్నారు. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ సినీ స్టార్లందరూ ప్రచారంలో పాల్గొననున్నారు. చిరంజీవి స్వయంగా వస్తుండటంతో పిఠాపురంలోని జనసైనికులు, కూటమి శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. చిరంజీవి ప్రచారం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. చిరంజీవి ప్రచారంలో పాల్గొంటే పవన్‌ కల్యాణ్‌కు కలిసొస్తుందని, కూటమి శ్రేణులు ఒక తాటిపైకి వచ్చి పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసం పని చేస్తారని జనసైనికులు అంచనా వేస్తున్నారు.

గెలుపే ధ్యేయంగా పవన్‌ కల్యాణ్‌
పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ పెట్టిన తర్వాత రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడి పోయారు. ఆ పార్టీ నుంచి కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకో గలిగారు. తర్వాత ఆయన కూడా జనసేనను వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో గెలుపే ధ్యేయంగా పిఠాపురం నియోజక వర్గం నుంచి పవన్‌ రంగంలోకి దిగారు. ఓటర్లు తనను నమ్మాలని, ఆ నమ్మకాని తాను నిలబెడుతానని చెబుతూ పిఠాపురంలోనే నివాసం ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ఇటీవలె గృహ ప్రవేశం కూడా చేశారు. నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వారాహి సభల్లో పాల్గొంటూ, స్థానిక ఓటర్ల సమస్యలపైన దృష్టి పెట్టారు.
సినీ స్టార్లు ఉంటే
ప్రచారంలో సినీ ప్రముఖులు ఉంటే ఓటర్లును మరింత ఆకట్టుకోవచ్చనే అభిప్రాయానికి వచ్చిన మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కొరుగా ప్రచారంలోకి దిగుతున్నారు. టాలీవుడ్‌ను శాసిస్తున్న స్టార్‌లందరూ మెగా ఫ్యామీలోనే ఉన్నారు. బాబాయిని తప్పకుండా గెలిపించాలంటూ సినీ వరణ్‌ తేజ్‌ పిఠాపురంలో నిర్వహించిన రోడ్డు షోకి వేలాది జనం తరలి వచ్చారు. తమ్ముడి గెలుపు కోసం చిరంజీవి కూడా పిఠాపురంలో ప్రచారం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మే నెల 5వ తేదీనా ప్రచారానికి వస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే చిరంజీవి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అనకాపల్లి బిజెపీ అభ్యర్థి సీఎం రమేష్‌ తన మిత్రులతో కలిసి హైదరాబాద్‌లో చిరంజీవిని కలిసి ప్రచారం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన చిరంజీవి రమేష్‌ నాకు చాలా కాలం నుంచి మిత్రుడని, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్‌ను గెలిపించాలని, తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ను కూడా గెలిపించాలని కోరుతూ ఒక వీడియోను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. పవన్‌ కల్యాణ్‌ ఈ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ధ్యేయంతో ఉన్నారు. ఎన్ని అవమానాలు అడ్డంకులు వచ్చినా ఆయన టీడీపీ, బిజెపీతో కలిసి పోటీ చేసేందుకు అన్ని మార్గాలను సుగుమం చేసుకున్నారు.
గతంలో వంగ గీత కోసం చిరంజీవి ప్రచారం
పవన్‌ కల్యాణ్‌పై పోటీకి దిగిన వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వంగ గీత పట్టు వదలని విక్రమార్కురాలు. అయితే చిరంజీవి కుటుంబంతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. గతంలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరిన ఆమె ఆ పార్టీ అభ్యర్థిగా పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో వంగ గీత గెలుపు కోసం చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేశారు. అయితే ఇదే గంగ గీత ఇప్పుడు తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కు ప్రత్యర్థిగా రంగంలోకి దింపారు సీఎం జగన్‌. వంగ గీత రాజకీయంగా అనుభవం ఉన్న నాయకురాలు. పైగా ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది స్థానికుల్లో చర్చగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్‌ కల్యాణ్‌ను గెలిపించుకోవడానికి కుటుంబ సభ్యులంతా ఏకతాటిపై నిలబడటం గమనార్హం. పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న నాగబాబు ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నారు.
Read More
Next Story