ఏపీ తీరానికి ‘మెగా’ వెలుగులు
x

ఏపీ తీరానికి ‘మెగా’ వెలుగులు

కేంద్ర మంత్రి సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌పై కీలక వినతి.


ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని రాష్ట్ర ఆర్థిక చోదక శక్తిగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సమావేశమైన ఆయన, రాష్ట్రంలో నౌకా నిర్మాణ రంగం (Shipbuilding) మరియు మత్స్యకారుల ప్రయోజనాల కోసం చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్ర సహాయం కోరుతూ పలు విజ్ఞప్తులు చేశారు.

దుగరాజపట్నం: నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “చిప్ టు షిప్” విజన్‌లో ఆంధ్రప్రదేశ్‌ను భాగస్వామిని చేయాలని సీఎం కోరారు. దుగరాజపట్నంలో షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం 3,488 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రికి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (TEFR) సిద్ధమైందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లో పేర్కొన్న విధంగా దుగరాజపట్నం ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి, త్వరితగతిన ఆమోదించాలని విన్నవించారు. దీనివల్ల నౌకా నిర్మాణ అనుబంధ MSME యూనిట్లు పెద్ద ఎత్తున ఏర్పడతాయని పేర్కొన్నారు.

ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి నిధుల విడుదల

మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి కేంద్రం తోడ్పాటు అవసరమని సీఎం చంద్రబాబు వివరించారు. ఫేజ్–1లో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల నిర్మాణాన్ని రూ.1361.49 కోట్లతో చేపట్టామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.782.29 కోట్లు ఖర్చు చేసిందని, అయితే కేంద్రం నుంచి రావాల్సిన వాటా నిధుల్లో జాప్యం జరుగుతోందని వివరించారు. ప్రస్తుతం ఫేజ్–1 పూర్తి కోసం ఇంకా రూ.440.91 కోట్లు అవసరమని పేర్కొన్నారు.

ఓడరేవు హార్బర్‌కు సాయం

ప్రకాశం జిల్లాలోని ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని సాగరమాల పథకం కింద చేర్చాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.150 కోట్లు మంజూరు చేయాలని కోరారు. మొత్తంగా ఫిషింగ్ హార్బర్ల విభాగంలో కేంద్రం నుంచి రూ.590.91 కోట్ల ఆర్థిక సహాయం తక్షణమే అందాల్సి ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.

కేంద్ర మంత్రి సానుకూల స్పందన:

నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్రం తీసుకువచ్చిన నూతన విధానాలకు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం విన్నపాలపై కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ సానుకూలంగా స్పందించారు. ఏపీ తీరప్రాంతం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని, రాష్ట్ర ప్రాజెక్టుల అభివృద్ధికి తమ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Read More
Next Story