
ఏజీఐసీఎల్ కు ఎండీ నియామకం
అమరావతి పనుల నిర్వహణకు ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ను 'అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్'గా నామకరణం చేసారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని నగరం, ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యాల సాధనకు చర్యలు చేపట్టింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (సీఆర్‌డీఏ) విభాగం జారీ చేసిన జీఓ ఆర్టీ నెం. 1478 ద్వారా అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్)కు సొంటి వెంకట రత్న శ్రీనివాస్, ఐఏఎస్ (రిటైర్డ్)ను మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మేనేజింగ్ డైరెక్టర్‌కు వివిధ అధికారాలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం. 206 (తేదీ 07.10.2025), జీఓ ఎంఎస్ నెం. 217 (తేదీ 27.10.2025) లో అమరావతి రాజధాని నగరం, ప్రాంతీయ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రాజెక్టుల అమలు, నిర్వహణకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కంపెనీల చట్టం, 2013 ప్రకారం ఏర్పాటైన ఈ ఎస్‌పీవీని 'అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్'గా నామకరణం చేసింది. ఇందులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, ఐదుగురు డైరెక్టర్లతో బోర్డు ఏర్పాటైంది. డిసెంబర్ 2న జరిగిన మొదటి బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
బోర్డు సూచనల మేరకు, ప్రభుత్వం సొంటి వెంకట రత్న శ్రీనివాస్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఇందులో భాగంగా మేనేజింగ్ డైరెక్టర్‌కు కింది అధికారాలు అప్పగించబడ్డాయి.
ఆమోదిత మాస్టర్ ప్లాన్ ఆధారంగా ప్రత్యేక ప్రాజెక్టులకు వివరణాత్మక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి, ఏపీసీఆర్‌డీఏ ఆమోదం పొందడం.
ప్రత్యేక ప్రాజెక్టుల రూపకల్పన, అభివృద్ధి, అమలు, నిర్వహణ, నగర సేవలు అందించడం.
ప్రైవేటు డెవలపర్ల నుంచి ఏపీసీఆర్‌డీఏ ఆమోదిత అభివృద్ధి ఛార్జీలు వసూలు చేయడం.
ఏపీసీఆర్‌డీఏ అనుమతితో లీజు అద్దెలు, యూజర్ ఛార్జీలు, టారిఫ్‌లు వసూలు చేయడం.
ఏపీసీఆర్‌డీఏ ఆమోదంతో ప్రత్యేక ప్రాజెక్టులకు డెవలపర్లు/కాంట్రాక్టర్లు/ఆపరేటర్లను ఎంపిక చేయడం.
బోర్డు, ఏపీసీఆర్‌డీఏ ఆమోదంతో ప్రభుత్వ నిధులతో పాటు మార్కెట్ నుంచి ఆర్థిక వనరులు సమకూర్చడం.
ప్రభుత్వ అనుమతితో, ఏపీసీఆర్‌డీఏ ఆమోదిత మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రత్యేక ప్రాజెక్టులకు ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం.
ట్రాన్స్‌పోర్ట్, విద్యుత్ పంపిణీ, నీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) లేదా ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కాంట్రాక్టర్లు/డెవలపర్లు/ఆపరేటర్లు అభివృద్ధి చేయని సాధారణ ప్రాంతాల్లో స్మార్ట్ సిటీ సూత్రాల ప్రకారం నేరుగా లేదా పీపీపీ మోడ్ ద్వారా అందించడం.
ప్రత్యేక ప్రాజెక్టులకు సామాజిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, విద్య మరియు వినోదం)ను వివిధ పక్షాల ద్వారా అందించి, అభివృద్ధి ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయడం.
బోర్డు ఆమోదంతో, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మార్కెట్ నుంచి పోటీపరమైన నిబంధనలపై నిపుణులను నియమించడం.
ప్రత్యేక ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థగా సామర్థ్యాలు సమకూర్చడం.
ఈ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరుతో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేశ్ కుమార్ జారీ చేశారు.

