ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాయలసీమ రైతులు 60 వేల ఎకరాలు త్యాగం చేసినప్పటికీ, ప్రాజెక్టు రూపకల్పనలో రాయలసీమకు తీరని ద్రోహం జరిగిందని ఆయన గుర్తుచేశారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు నాలుగు దశాబ్దాల క్రితం SRBC, హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టులు బచావత్ ట్రిబ్యునల్ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం అనుమతులు పొందినవని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా సుమారు మూడు లక్షల ఎకరాలను భూసేకరణ ద్వారా రైతులు త్యాగం చేశారని, వాటి ద్వారా రాయలసీమలో 14 లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం కేవలం రెండు లక్షల ఎకరాలకు మాత్రమే కాలువల ద్వారా నీరు చేరుతోందని తెలిపారు. మరో రెండు లక్షల ఎకరాలకు రైతులు ఇంజన్ల సాయంతో నీరు తోడుకోవాల్సి వస్తోందనీ , మిగిలిన పది లక్షల ఎకరాల రైతులు నీటి చుక్క కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారనీ, నీటి కోసం రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు పాలకులకు అగుపించడం లేదా అని బొజ్జా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెండింగ్‌లో ఉన్న 5 నుండి 10 శాతం పనులు పూర్తి చేస్తే, మొత్తం ఆయకట్టుకు నీరు అందే అవకాశం ఉందని వివరించారు. అయితే, ఈ పనులకు కేవలం 5,000 నుండి 10,000 కోట్ల రూపాయల నిధులు అవసరమయ్యే స్థితిలో ఆ నిధులను విడుదల చేయని పాలకులు 90 వేల కోట్ల రూపాయలతో గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం, నిప్పులవాగు, గాలేరు, కుందూనది విస్తరణ పేరుతో కొత్త భూసేకరణలు చేయడం తీవ్రమైన అన్యాయమని ఆయన విమర్శించారు. “రాయలసీమ నీటి హక్కులను రక్షించేందుకు, రాయలసీమకు న్యాయం జరిగేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నాము,” అని బొజ్జా తెలిపారు. క్రింద పేర్కొన్న డిమాండ్ల సాధనకై అక్టోబర్ 24న నంద్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రజలందరూ పాల్గొని ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు.
డిమాండ్లు:
పెండింగ్‌లో ఉన్న అన్ని రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు పనులు, పంటకాలువల నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలి.
శ్రీశైలం ప్రాజెక్టు విధివిధానాలను అమలు చేయాలి.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు బచావత్ ట్రిబ్యునల్ మరియు రాష్ట్ర విభజన చట్టం కల్పించిన హక్కులను అమలు పరచాలి.
నిప్పులవాగు, గాలేరు–నగరి, కుందూనది విస్తరణ పనులను తక్షణమే ఆపాలి.
రాజోలి, జోలదోరాశి తదితర రిజర్వాయర్ల నిర్మాణానికి సేకరించిన భూములకు తక్షణమే పరిహారం విడుదల చేయాలి.
రాయలసీమ ఆయకట్టు స్థిరీకరణకు అవసరమైన రిజర్వాయర్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలి.
ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వై. యన్‌. రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, నాగప్ప గారి పెద్ద ఉశేని, బెక్కం చిన్న రామకృష్ణారెడ్డి, కొమ్మా శ్రీహరి, మహేశ్వర రెడ్డి, మహబూబ్ భాష, కృష్ణమోహన్ రెడ్డి, భాష్యం సుబ్బనరసయ్య, ఏరువ రామిరెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, భాస్కర్ రెడ్డి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.