
కాంగ్రెస్ పార్టీ నేతల భారీ ధర్నా
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నట్లు నేతలు మండిపడ్డారు
తమ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదుచేసినందుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు భారీ ధర్నా నిర్వహించారు. హైదరాబాదు(Hyderabad)లోని ఈడీ ఆఫీసు ముందు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలతో పాటు సీనియర్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్(National Herald Case) కేసులో సోనియా(Sonia Gandhi), రాహుల్ పేర్లను ఏ1, ఏ2గా చార్జిషీటులో చేర్చడాన్ని కాంగ్రెస్ పార్టీ నిరసించింది. తమ అగ్రనేతలను వేధించటానికి నరేంద్రమోడి(Nrendra Modi) ప్రభుత్వం ఈడీని ఉసిగొల్పుతున్నట్లు ఆరోపించారు. ఈ ధర్నాలో పార్టీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) కూడా పాల్గొన్నారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నట్లు నేతలు మండిపడ్డారు. కేంద్రప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న రాహుల్(Rahul Gandhi) తో పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సోనియాను మానసికంగా ఇబ్బందిపెట్టేందుకే కేంద్రప్రభుత్వం తప్పుడు కేసులతో ఈడీ(ED)ని ఉసిగొల్పుతున్నట్లు ఆరోపించారు. తమఅగ్రనేతలపై ఈడీ నమోదుచేసిన కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కులగణన చేయాలన్న రాహుల్ డిమాండుకు సరైన సమాధానం చెప్పలేని మోడి తప్పించుకునేందుకు తమ అగ్రనేతలపై ఈడీని ఉసిగొలిపి కేసులు పెట్టించినట్లు మంత్రులు జూపల్లి, కొండా సురేఖ(Konda Surekha) తదితరులు మండిపడ్డారు.
కేసులుపెట్టి తమ అగ్రనేతలను లొంగదీసుకోవచ్చని అనుకుంటే మోడి తప్పుచేసినట్లే అని మంత్రులు ఎద్దేవాచేశారు. ఈడీ పెట్టే కేసులకు తమ పార్టీనేతలు భయపడరన్న విషయాన్ని మోడీ గుర్తుంచుకోవాలని మంత్రులు హెచ్చరించారు. ఇలాంటి తప్పుడుకేసులు ఎన్ని నమోదుచేసినా తమ అగ్రనేతలు భయపడరన్న విషయాన్ని ఈడీతో పాటు మోడీ కూడా గుర్తుంచుకోవాలని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ హెచ్చరించారు.