దేవదాయ శానిటేష‌న్ టెండ‌ర్ల‌లో భారీ అవినీతి
x
Potina Venkata Mahesh, YSRCP

దేవదాయ శానిటేష‌న్ టెండ‌ర్ల‌లో భారీ అవినీతి

రాష్ట్రంలోని దేవాలయాల శానిటేషన్ టెండర్లలో అవినీతిని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్


రాష్ట్రంలో 7 ప్ర‌ధాన దేవాల‌యాల్లో శానిటేష‌న్ టెండ‌ర్ పేరు మార్చి కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ పేరిట ఒక్క‌రికే క‌ట్ట‌బెట్టేందుకు వీలుగా జీవో ఆర్టీ నెంబ‌ర్ 1014 జారీ చేసి ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందన్నారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. శ్రీకాళ‌హ‌స్తి, శ్రీశైలం, కాణిపాకం, విజ‌య‌వాడ కనక దుర్గ‌మ్మ ఆల‌యం, ద్వార‌కా తిరుమ‌ల‌, అన్న‌వ‌రం, సింహాచలం ఆల‌యాల్లో శానిటేష‌న్ టెండ‌ర్‌ని తిరుప‌తికి చెందిన భాస్క‌ర్‌నాయుడు అనే వ్య‌క్తికి క‌ట్టబెట్టింది. గ‌తంలో ఈ ఏడు ఆల‌యాల‌కు శానిటేష‌న్ ఖ‌ర్చు రెండేళ్ల‌కు రూ. 50 కోట్ల లోపే ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్ల‌కు క‌ట్టబెడుతూ శానిటేష‌న్ టెండ‌ర్లు కేటాయిస్తూ జీవో ఇచ్చారు. 2014-19 మ‌ధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు సీఎంగా ఇదే భాస్క‌ర్ నాయుడుకి చెందిన ప‌ద్మావ‌తి హాస్ప‌టాలిటీ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కంపెనీకి ఏడు ప్ర‌ధాన ఆల‌యాల్లో శానిటేష‌న్ వ‌ర్కుల పేరిట దోచిపెట్టారు అని విమర్శించారు.

వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత 7 ఆల‌యాల్లో వేర్వేరుగా టెండ‌ర్లు నిర్వ‌హించి ప్ర‌జాధ‌నాన్ని వృథా కాకుండా కాపాడితే, కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక తిరిగి అదే భాస్క‌ర్ నాయుడికి రూ. 50 కోట్ల లోపు ఇచ్చిన ప‌నుల‌ను ఏకంగా రెండింత‌లు పెంచేసి రూ. 100 కోట్ల‌కు ఒక్క‌డికే క‌ట్ట‌బెట్టేశారు. గ‌తంలో ఉన్న కాంట్రాక్ట‌ర్లు శానిటేష‌న్ ప‌నులు స‌రిగా చేయ‌డంలేద‌ని, జీతాలు, పీఎఫ్‌లు, ఈఎస్ఐలు స‌రిగా ఇవ్వ‌డం లేద‌ని, డ్రెస్ కోడ్ పాటించ‌డం లేద‌ని సాకు చూపించి భాస్క‌ర్ నాయుడికి టెండ‌ర్లు క‌ట్ట‌బెట్టేశారు. అయితే ఇదే భాస్క‌ర్ నాయుడు కాంట్రాక్ట‌ర్ గా ఉండి నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌ని ఆయ‌న మీద లోకాయుక్తాలో కేసులు పెట్టి విచార‌ణ జ‌రిపిన విష‌యాన్ని ఈ ప్ర‌భుత్వం విస్మ‌రించి ఏక‌ప‌క్షంగా కాంట్రాక్టు క‌ట్ట‌బెట్ట‌డం దారుణం. పైపెచ్చు ఈ ఏక‌ప‌క్ష టెండ‌ర్ల‌ను ఏడు ఆల‌యాల‌కు చెందిన ఈవోలు కూడా వ్య‌తిరేకించ‌క‌పోవ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. నోరెత్త‌కుండా వారి మీద ఎవ‌రు ఒత్తిడి చేశారు. అని విమర్శించారు.

శానిటేష‌న్ టెండ‌ర్లు ర‌ద్దు చేయాలి

భాస్క‌ర్ నాయుడికి టెండ‌ర్లు క‌ట్ట‌బెట్టే కుట్ర‌తో ఫ్రీ బిడ్ వేయ‌డానికి 15 మంది కాంట్రాక్ట‌ర్లు వ‌చ్చినా ఆరు సార్లు టెండ‌ర్లు వాయిదా వేశారు. ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌లో ఇండియా స్థాయిలో అనుభ‌వం ఉండాల‌న్న కొత్త నిబంధ‌న చేర్చి భాస్క‌ర్ నాయుడికి క‌ట్ట‌బెట్టారు. చివ‌రికి టెక్నిక‌ల్ బిడ్‌లో భాస్క‌ర్ నాయుడికి చెందిన ప‌ద్మావ‌తి స‌ర్వీసెస్‌తో పాటు చైత‌న్య జ్యోతి స‌ర్వీసెస్ మిగిలింది. కానీ చైతన్య జ్యోతికి అనుభవం లేద‌న్న కార‌ణంతో వారిని తిరస్కరించారు. టెక్నిక‌ల్ బిడ్‌లో ఒక్క‌రే ఉంటే నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఆ ఒక్క టెండ‌ర్‌కే ప్రైస్ బిడ్ ఎలా క‌ట్ట‌బెట్టారో చెప్పాలి. టెండ‌ర్ నోటిఫికేష‌న్ ఇచ్చినప్పుడు మ్యాన్ ప‌వ‌ర్ సప్లైకి రూ. 78 కోట్ల లోపు టెండ‌ర్ వేయాల‌ని, అద‌నంగా మెయింటినెన్స్‌, సర్వీస్ చార్జికి నిబంధ‌న‌లు పెట్టారు. కానీ జీవోలో మాత్రం ఆ రూ. 78 కోట్ల ప్ర‌స్తావ‌న ఎందుకు తేలేదు. కేవ‌లం స‌ర్వీస్ చార్జికి రూ. 16 కోట్లు క‌ట్టాల‌ని మాత్ర‌మే చెప్పారు. ఇదంతా పాప భీతి లేకుండా దేవుడి సొమ్ము లేకుండా చేస్తున్న అవినీతి అని మహేష్ చెప్పారు. ఈ టెండ‌ర్ల‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాలి. గ‌త వైయ‌స్సార్సీపీ హ‌యాంలో జ‌రిగిన‌ట్టు వేర్వేరుగా 7 ఆల‌యాలకు శానిటేష‌న్ టెండ‌ర్లు పిల‌వాలని డిమాండ్ చేశారు.

వారాహి డిక్ల‌రేష‌న్ ఏమైంది ప‌వ‌న్‌..?

ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించి హిందూ ఆల‌యాల‌ను, ఆస్తుల‌ను ప‌రిర‌క్షిస్తాన‌ని వాగ్ధానం చేశారు. అయితే కూట‌మి ప్ర‌భుత్వంలో ఆలయ భూములను దోచుకుతింటుంటే ఆయ‌న మాత్రం నిద్ర‌పోతున్నారు. ఆల‌యాల్లో వ‌రుస‌గా అప‌చారాలు జ‌రుగుతున్నా ఆయ‌న నోరెత్త‌డం లేదు. స‌నాత‌న ధ‌ర్మం ముసుగులో ఆల‌య భూములు కొట్టేస్తున్న వారికి అండ‌గా నిల‌బ‌డుతున్నారు. ఆల‌య భూ దోపిడీపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించాలి. ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గొడుగు వేంక‌టేశ్వ‌ర స్వామికి చెందిన ఈ 40 ఎక‌రాల భూముల్లోనే ఏర్పాటు చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది నిజ‌మో కాదో ఆయ‌నే చెప్పాలి అని ప్రశ్నించారు.

Read More
Next Story