
ఏపీలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసు బలగాలు గాలింపులు తీవ్రతరం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎదురు కాల్పులు కలకలం రేపాయి. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా యు.చీడిపాలెం పంచాయతీ పరిధి కాకుల మామిడి, కంటారం సమీపంలో రెండు చోట్ల మంగళవారం ఉదయం ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాకుల మామిడి, కంటారం ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలను గమనించిన పోలీసు బలగాలు వారిపైన కాల్పులకు దిగారు. దీనిపైన స్పందించిన మావోయిస్టులు పోలీసు బలగాలపై ఎదురు కాల్పులకు దిగారు.
అయితే ఈ ఎదురు కాల్పుల ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అటు మావోయిస్టులు, ఇటు పోలీసు భద్రతా బలగాలు గాయాలు కానీ, మరణించడం కానీ జరగలేదు. అయితే పోలీసులు జరిపిన కాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు గాలింపులు చేపట్టాయి. దీని కోసం సంఘటనా స్థలంలో ఉన్న భద్రతా బలగాల కంటే మరిన్ని పోలీసుల బలగాలు ఆ ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. మరో వైపు ఇటీవల ఆంధ్రప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ బోర్డర్ ప్రాంతాల్లో కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టుల మీద నిర్భంధం పెద్ద స్థాయిలో పెరిగింది.
దీంతో ఆ నిర్భంధం నుంచి మావోయిస్టులు తప్పించుకొని ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోనికి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా గాలింపులను పోలీసులు తీవ్ర తరం చేశారు. ఎక్కడా కూడా మావోయిస్టులు తప్పించుకోకుండా ఉండే విధంగా పోలీసుల భద్రతా బలగాలతో విస్తృత స్థాయిలో జల్లెడ పట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం అదనపు పోలీసు బలగాలను కూడా రప్పిస్తున్నారు.