
ఇదేం పోలిక కళా వెంకట్రావ్!
ఏ పార్టీ అధికారంలో ఉన్నా బలైంది నక్సలైట్లు కాదా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంట్లో పడడానికో ఏమో ఆ పార్టీ సీనియర్లు ఈమధ్య బాగా రెచ్చిపోతున్నారంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొన్న ఒకాయన జగన్ తలతీస్తే తప్పేమిటంటే నిన్నొకాయన జగన్ కంటే నక్సలైట్లు బెటర్ అన్నారు. ఇలా అర్థం పర్థం లేని పోలికలతో ఏమి లబ్ధి పొందాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం.. అంటూ పేర్కొన్నారు. జిల్లాలోనేగాక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. నిజానికి అటు తెలుగుదేశమైనా ఇటు వైసీపీ అయినా నక్సలైట్లను అణచివేయాలని చూసిన పార్టీలే. ఎన్ కౌంటర్లు చేసిన పాలకపక్షాలే. అటువంటి పార్టీలు ఇప్పుడు నక్సలైట్లను అడ్డం పెట్టి వాళ్లవాళ్ల కక్షలు, కార్పణ్యాలను తీర్చుకోవడం అన్యాయమని వ్యాఖ్యానించారు సీనియర్ జర్నలిస్టు కె.చంద్రశేఖరరావు.
ఇంతకీ విషయమేమిటంటే...
‘వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం. వారు సిద్ధాంతం కోసం పోరాడితే, వైసీపీ నాయకులకు సిద్ధాంతమే లేదు. కేవలం బెదిరింపులకు పాల్పడడమే వారి లక్ష్యం’ అని టీడీపీ సీనియర్ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు(Cheepurupalli MLA Kala Venkata Rao) ధ్వజమెత్తారు. విజయనగరం జడ్పీ అతిథి గృహంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాజీ సీఎం జగన్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana)పై నిప్పులు చెరిగారు. పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలల నిర్మాణ, నిర్వహణకు ముందుకు వచ్చిన వారిని, అభివృద్ధి పనులు చేయడానికి ఆసక్తి చూపుతున్న కాంట్రాక్టర్లను బెదిరిస్తూ రాజ్యాంగేతర శక్తులుగా తయారయ్యారని మండిపడ్డారు.
కళా వెంకటరావు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, గతంలో మంత్రిగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్నవారు. ఆయన ఇంత ఘాటైన విమర్శలు చేయడం వెనుక రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు కూడా కావొచ్చు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, అధికారులు కూడా ఇలాంటి బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Next Story

