లొంగుబాట్లపై మావోయిస్టుపార్టీ సంచలన నిర్ణయం
x
Letter on Maoist surrender

లొంగుబాట్లపై మావోయిస్టుపార్టీ సంచలన నిర్ణయం

ఇంతకీ ఆ ముహూర్తం ఎప్పుడుంటే జనవరి 1వ తేదీ


మావోయిస్టుపార్టీ సంచలన నిర్ణయం తీసుకున్నది. వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లు, లొంగుబాట్ల నేపధ్యంలో మావోయిస్టులంతా లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఎంఎంసీ జోన్ అధికార ప్రతినిధి అనంత్ పేరుతో ఒక లేఖ శుక్రవారం విడుదలైంది. లొంగిపోయేందుకు తేదీని కూడా మావోయిస్టుపార్టీ ముహూర్తాన్ని డిసైడ్ చేసుకున్నది. ఇంతకీ ఆ ముహూర్తం ఎప్పుడుంటే జనవరి 1వ తేదీ. సాయుధవిరమణకు పార్టీ జనవరి 1వ తేదీని డెడ్ లైన్ గా నిర్ణయించుకున్నట్లు అనంత్ పేరుతో రిలీజయిన లేఖలో ఉంది. పరస్పర సమన్వయం, సమాచార మార్పిడికోసం మావోయిస్టు ప్రతినిధిగా ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ ను కూడా విడుదల చేసినట్లు తెలిపారు.

తమకు ప్రాధాన్యతిచ్చే ప్రభుత్వంముందు లొంగిపోవాలని పార్టీ నిర్ణయించుకున్నట్లు అనంత్ లేఖలో చెప్పారు. ఆయుధాలు వదులుకోవటం అంటే ప్రజలకు ద్రోహంచేయటం కాదని అధికారప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఈమధ్యనే హిడ్మా తదితరులు చనిపోయిన విషయం పెద్ద వివాదాస్పదమైన విషయం తెలిసిందే. హిడ్మాతో పాటు మరికొందరిని విజయవాడలో పట్టుకుని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్ళి కాల్చిచంపేశారని మావోయిస్టుపార్టీ లేఖలో తీవ్రంగా మండిపడింది. హిడ్మా తదితరులది భూటకపు ఎన్ కౌంటర్ అంటు హక్కులసంఘం నేతలు ఆరోపిస్తున్నారు. మరణాలు వివాదాస్పదమైనా హిడ్మా తదితరులు చనిపోయింది అయితే వాస్తవం.

అంతకుముందు మావోయిస్టుపార్టీలో దశాబ్దాలుగా పనిచేసి కేంద్రకమిటి సభ్యులుగా ఉన్న ఆశన్న, మల్లోజుల,సుజాత లాంటి కొందరు పోలీసుల ముందు లొంగిపోయారు. ఇదేసమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరరావుతో పాటు మరికొందరు కేంద్రకమిటి సభ్యులు ఎన్ కౌంటర్లలో చనిపోయారు. మిగిలిన కొంతమంది నేతలుకూడా అనేక అనారోగ్యాలతో బాగా ఇబ్బందులు పడుతున్నారని పోలీసులకు పక్కా సమాచారం ఉంది. కొంతకాలం ఆపరేషన్ కగార్ నిలిపేయాలని మావోయిస్టులు ఎన్నిసార్లు విజ్ఞప్తులుచేసినా భద్రతాదళాలు ఏమాత్రం ఖాతరుచేయటంలేదు. మార్చి 31, 2026కి మావోయిస్టు రహితదేశంగా మార్చాలన్న గట్టినిర్ణయంతోనే భద్రతాదళాలు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి.

ఆపరేషన్ కగార్ ఇలాగే జరుగుతుంటే నిజంగానే మావోయిస్టుపార్టీలోని కీలకనేతలు ఎన్ కౌంటర్ అయిపోవటం ఖాయమనే చర్చ పెద్దఎత్తున జరుగుతోంది. ఇలాంటి అనేక అంశాలను క్షుణ్ణంగా చర్చించిన తర్వాత జనవరి 1వ తేదీన మావోయిస్టులందరు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు అనంత్ తాజా లేఖ ద్వారా అర్ధమవుతోంది.

Read More
Next Story