వరద సాయం కోసం ఎంతో మంది ఎదురు చూపు
విజయవాడ వరద బాధితులు చచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సాయం ఇవ్వలేదని చెబుతున్నారు. సచివాలయ సిబ్బందికి చీమకుట్టినట్లు కూడా లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ వరదల్లో మునిగిన ఇళ్ల వారందరికీ ఒక్కో ఇంటికి రూ. 25వేలు ఇస్తామని ప్రకటించారు. అది ప్రచారార్బాటమే కాని బాధితుల్లో చాలా మందికి సాయం అందలేదు. వార్డు సచివాలయాల వద్ద సిబ్బంది ఉండటం లేదు. వాలంటీర్లు ఫోన్ లు కూడా ఎత్తడం లేదు. ఎక్కడ వున్నారో తెలియడం లేదు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కొన్న సచివాలయాలు తెరవడం లేదు. ఇదేమిటంటే వారి నుంచి సమాధానం లేదు. ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. కొందరు అనర్హులకు రూ. 25లు నగదు బ్యాంక్ అకౌంట్లలో జమైనట్లు బాధితులు వాపోతున్నారు.
విజయవాడ రామలింగేశ్వర నగర్ లోని ఆళ్ల చెల్లారావు రోడ్డులో ఉన్న 71వ సచివాలయం శనివారం 11 గంటలకు కూడా తాళం వేసి ఉంది. వారు ఎక్కడికి వెళ్లారో ఎప్పుడు వస్తారో కూడా కనీసం బోర్డు కూడా లేదు. ఫెడరల్ ప్రతినిధి కూడా బాధితుడే కావడంతో సచివాలయం వద్దకు వెళ్లాడు. అక్కడ రోడ్డు గేట్లో ఇద్దరు, లోపల తాళం వేసిన గేటు వద్ద ఇద్దరు బాధితులు కూర్చున్నారు. ఒక్కరొక్కరుగా బాధితులు వస్తున్నారు. సచివాలయం వద్దకు వచ్చిన ఓ యువతి మా పై అంతస్తు వారికి డబ్బులు వేశారు. మా ఇల్లు పూర్తిగా మునిగి పోయింది. మాకు డబ్బులు రాలేదని బాధపడుతూ చెప్పారు. మీపేరేంటని అడిగితే మా పేరెందులెండి అంటూ వెళ్లిపోయారు.
సచివాలయం వద్ద బెనిఫిషరీ జాబితా ఉందని, బాధితులై ఉండి పేర్లు జాబితాలో లేకుంటే ఫిర్యాదు చేయవ్చని ప్రభుత్వం చెబుతోంది. సచివాలయం వద్ద బెనిఫిషరీ జాబితానే పెట్టలేదు. అలాంటప్పుడు నా పేరు ఉందో లేదో ఎలా తెలుస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. సచివాలయం చుట్టుపక్కల ఉండే వారి పేర్లు కూడా లబ్ధిదారుల జాబితాలో లేవు. ఇదీ వదర బాధితుల పరిస్థితి. సచివాలయాలను ప్రక్షాళన చేయకుంటే స్థానికులకు న్యాయం జరిగే అవకాశాలు కూడా కనిపించడం లేదు.