మతిస్థిమితం లేని అనాథల కోసం ‘మనోబంధు ఫౌండేషన్’
x

మతిస్థిమితం లేని అనాథల కోసం ‘మనోబంధు ఫౌండేషన్’

మానసిక, మతిస్థిమితం లేక రోడ్లపై తిరుగుతుండే అనాథలను సంబంధిత ఆసుపత్రిలో చేర్పించే కార్యానికి శ్రీకారం చుట్టింది మనోబంధు ఫౌండేషన్.


పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా ఏర్పడిన మనోబంధు ఫౌండేషన్ రాష్ట్రంలో మానసిక, మతిస్థిమితం లేక రోడ్లపై తిరిగాడే అనాథలందరినీ మెంటల్ ఆసుపత్రిలో చేర్పిస్తుంది. ఈ నేపథ్యంలో మనోబంధు ఫౌండేషన్ రాయలసీమలో అనాథలైన మతిస్థిమితం లేని వాళ్లను గుర్తించి వారిని కడపలో ఉన్న ప్రభుత్వ మెంటల్ ఆసుపత్రిలో చేర్పించడానికి ఆ సంస్థ అధినేత రామకృష్ణంరాజు వచ్చారు. వారికి చేయూతనివ్వడానికి సహకారాన్ని అందించడానికి బుద్ధిస్ట్ కల్చరల్ సొసైటీ ముందుకు వచ్చింది. బుద్ధిస్ట్ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు పిల్లా కుమారస్వామి, ఉపాధ్యక్షులు శివారెడ్డి డాక్టర్ శ్రీనివాసులు.. ఫౌండేషన్ చేస్తున్న కృషికి తమ సహకారాన్ని అందించారు.

కడప చెన్నూర్ మైదుకూరు వల్లూరు ప్రొద్దుటూరు మొదలైన ప్రాంతాలలో రోడ్డు వెంబడి తిరిగే మతిస్థిమితం లేని అనాథలందరినీ గుర్తించి వారిని మనోబంధు ఫౌండేషన్ వారి ఆంబులెన్స్‌లో తీసుకెళ్లి కడప రిమ్స్‌లో కొత్తగా కట్టిన అతిపెద్ద ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారులు వారిని పేషంట్లను రోగులను గుర్తించడానికి, వారిని అంబులెన్స్‌లో ఎక్కించడానికి ఎంతో సహాయ సహకారాలను అందించారు. ఇటువంటి కార్యక్రమం ఎంతో మానవీయమైనదని, ప్రజలందరూ ఇటువంటి వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించేందుకు ముందుకు రావాలని వారంతా కోరారు. జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు.. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు తగు ఆదేశాలిచ్చి భవిష్యత్తులో అక్కడి పోలీసులకు ఇలాంటి అనాథ మతిస్థిమితం లేని వారు తారసపడితే ఆ విషయాన్ని మనోబంధు ఫౌండేషన్ వారికి లేదా బుద్ధిస్ట్ కల్చరల్ సొసైటీ వారికి తెలియజేస్తే వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడానికి తగు చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ సభ్యులు తెలియజేశారు.

ప్రభుత్వ మెంటల్ ఆసుపత్రి సూపరిండెంట్ వెంకట్ రాముడు వీరి కృషిని అభినందిస్తూ ఇలాంటి పని ఎంతో మానవత్వంతో కూడినదని, వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేయించుకున్నారు. కానీ ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది తగినంతగా లేనందువలన ఆసుపత్రిలో చేర్పించిన 26 మంది రోగులలో ముగ్గురు పారిపోయారు. తగినంత మంది డాక్టర్లు ఉన్నప్పటికీ రోగులకు అందించాల్సిన ఇతరేతర పనులన్నిటికీ తగినంత సిబ్బంది లేనందువలన పేషెంట్లకు తగినంత సేవలను అందించలేకపోతున్నారు. మానసిక రోగులకు స్నానం చేయించడం బట్టలు తొడగడం మొదలైన చర్యలు చేయడానికి అక్కడ తగినంత సిబ్బంది లేరని ఆసుపత్రి సూపరిండెంట్ తెలియజేశారు. రోగులకు ఇవ్వాల్సిన దుస్తులు సబ్బులు దువ్వెనలు అన్నం తినే ప్లేట్లు మొదలైనవి దాతల సహాయంతో ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆసుపత్రికి ఎటువంటి నిర్వహణ నిధులు మంజూరు చేయనందున ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు.తమ సొంత జేబు నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుద్ధిష్ట్ కల్చరల్ సొసైటీ అక్కడ ఆసుపత్రిలో తగినంత సిబ్బందిని నియమించాలని ఆసుపత్రికి తగినంత నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నది.

Read More
Next Story