మడ అడవులు ప్రకృతి గోడలు
x
మడ అడవుల నేషనల్ వర్క్ షాప్ లో మాట్లాడుతున్న నేషనల్ కాంపా (CAMPA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ మోహన్

మడ అడవులు ప్రకృతి గోడలు

తీర ప్రాంతాలు సురక్షితంగా ఉండాలంటే మడ అడవుల రక్షణ ఎంతో అవసరం.


సముద్ర తీర ప్రాంతాల్లో మడ అడవులు ప్రకృతి సిద్ధమైన రక్షణ గోడలుగా పనిచేస్తాయి. తుపానులు, ఉప్పెనలు, సునామీల వంటి వైపరీత్యాల నుంచి సమాజాన్ని కాపాడుతున్నాయి. ఈ అడవుల క్షీణతను అరికట్టి, స్థానికుల జీవనోపాధిని మెరుగుపరచడమే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మాంగ్రోవ్ ఇనీషియేటివ్ ఫర్ షోర్‌లైన్ హాబిటాట్స్ అండ్ టాంగిబుల్ ఇన్‌కమ్స్' (మిస్టీ - MISHTI) పథకం ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో విజయవాడలో గురువారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్‌లో మడ అడవుల అభివృద్ధి, రక్షణ విధానాలపై లోతైన చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర అటవీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో లెమన్ ట్రీ ప్రీమియర్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, దేశవ్యాప్త తీర ప్రాంత రాష్ట్రాల అధికారులు, నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది.

డెల్టా ప్రాంతం దేశానికి అన్నపూర్ణ

మడ అడవులు సముద్ర కోతను నిరోధించి భూగర్భ జలాల్లో ఉప్పు నీరు చొచ్చుకురాకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా స్థానిక రైతుల వ్యవసాయ భూములు సురక్షితంగా ఉంటాయి. అంతేకాకుండా మడ అడవులు చేపలు, ఇతర సముద్ర వనరులను సమృద్ధిగా అందించి, స్థానికులకు ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల వంటి పోషకాలను సరఫరా చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి డెల్టా ప్రాంతం ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ఇక్కడి వనరులు దేశానికి అన్నపూర్ణలా పనిచేస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇవి ప్రాథమిక రక్షణగా నిలిచి తీర ప్రాంతాలను కాపాడతాయి. గత కొన్ని దశాబ్దాల్లో మడ అడవుల క్షీణత వల్ల వ్యవసాయ భూములు దెబ్బతిన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనిని అరికట్టడం అత్యవసరం.


నేషనల్ కాంపా (CAMPA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ మోహన్ ఏమన్నారంటే...

మిస్టీ పథకం సుమారు రెండున్నర ఏళ్లుగా అమలులో ఉంది. దీనికి CAMPA నిధుల్లో 10 శాతం కేటాయిస్తున్నారు. మొత్తం 825 కోట్ల రూపాయల కేటాయింపుల్లో ఇప్పటివరకు 100 కోట్లు మాత్రమే వినియోగించారు. మిగిలిన నిధులను సమర్థవంతంగా ఉపయోగించాలి. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఈ పథకంలో ఆశించిన స్థాయిలో భాగస్వామ్యం చూపడం లేదు. రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నాలుగు దశాబ్దాలుగా మడ అడవుల విస్తరణపై దృష్టి సారించింది.


ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ పీవీ చలపతిరావు మాటల్లో...

ప్రస్తుతం ఏపీలో సుమారు 50,000 హెక్టార్లలో మడ అడవులు ఉండగా, అందులో 40,000 హెక్టార్లు నోటిఫై చేశారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక మడ అడవులు ఉన్నాయి. సముద్ర తీరంలో 30 శాతానికి మించి కోతకు గురవుతున్న ప్రాంతాలను రక్షించడానికి 'నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్' (NCCR) సహకారంతో మేనేజ్మెంట్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నాము అని ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డాక్టర్ పీవీ చలపతిరావు తెలిపారు. మిస్టీ పథకం 2028 వరకు కొనసాగుతుంది. దీని ద్వారా మడ అడవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు.

వర్క్ షాప్ లో జాతీయ అధికారులు

దేశవ్యాప్త తీర ప్రాంత రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు, జాతీయ సంస్థల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు విజయవాడలో జరుగుతున్న ఈ రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్ లో పాల్గొన్నారు. NCCR డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎస్ కంకార, నేషనల్ అఫారెస్టేషన్ అండ్ ఎకో-డెవలప్‌మెంట్ బోర్డ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ వీఎల్ రాయ్ కుల్లయ్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ ప్రశాంత్ రాజగోపాల్ లు వర్క్ షాప్ లో పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో మడ అడవుల అభివృద్ధి విధానాలు, తీర ప్రాంత రక్షణలో వాటి పాత్ర, స్థానికుల ఆదాయ మార్గాలు వంటి అంశాలపై లోతైన చర్చలు జరుగుతున్నాయి.

మడ అడవుల రక్షణ అనేది కేవలం పర్యావరణ సమస్య కాదు, స్థానిక సమాజాల ఆర్థిక, సామాజిక భద్రతకు ముడిపడిన అంశం. మిస్టీ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇలాంటి వర్క్‌షాప్‌ల ద్వారా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగితే తీర ప్రాంతాలు మరింత సురక్షితంగా మారతాయి.

Read More
Next Story