‘మామిడి’ అధిక దిగుబడి బరువు ఎందుకయింది?
x
source: pixabay

‘మామిడి’ అధిక దిగుబడి బరువు ఎందుకయింది?

‘ఫుడ్ ప్రాసెసింగ్’ రంగం వైసీపీ ప్రభుత్వ కాలంలో ‘డిపార్ట్మెంట్ గా మారింది. టిడిపి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమ హోదా ఇచ్చింది


ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం అంటారు కదా, సాగు సంబంధ విషయం గత ఏడాదిలో తెలుగు దినపత్రికల్లో ‘బ్యానర్ స్టోరీ’ (పతాక శీర్షిక)గా చూసిన రోజు ఒకటైనా మీకు గుర్తు ఉందా? ఇపుడు అందరం ఇష్టపడే మామిడి పండు ‘రాజకీయ వార్త’ అయి కూర్చుంది. ఈ సందర్భంగా ఈ ప్రశ్న అడగాలి అనిపించింది. ఆదేమి చిత్రమో... చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చాలు, లోపల ఎక్కడో ఉండే బిజెనెస్ పేజీ మన పత్రికల్లో మొదటి పేజీ అవుతుంది!

సిఎం అయిన కొత్తలో వ్యవసాయం దండగ అని బాబు ఏ సందర్భంలో అన్నాడో కానీ... అన్ని విషయాల్లో ఆయనకు విషయ సేకరణ బాధ్యతలు చూసే ‘ఈనాడు’ సంస్థ ప్రచురించే ‘అన్నదాత’ మాసపత్రిక అయితే, 2022 డిసెంబర్ తర్వాత ప్రచురణ ఆపేసింది. సందర్భం ‘మామిడి’ అంటూ ఇటువంటి పరిచేయంతో వ్యాసం మొదలు పెట్టడం అంటే, ఇది మన ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పు చెప్పడం కోసం.

రైతులకు కొత్త కష్టాలు వచ్చాయంట, ఎందుకు? పరిపాలన ‘నెట్ వర్క్’ తగ్గిందా? లేదు. కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో వేర్వేరు అంశాలు చూడడానికి కనీసం ఐదుగురు కార్యదర్శులు ఉంటున్నారు. వీళ్ళు గతంలో కలెక్టర్లుగా చేసి, ఏవో ఒకటి రెండు శాఖాధిపతులుగా పనిచేసిన అనుభవం ఉన్నవారు. అందరినీ మించి అస్సలు సిఎంకే గొప్ప పరిపాలనాదక్షుడు అనే పేరు ఉంది.

ప్రభుత్వం మారి ఏడాది అవుతున్నప్పుడు, సీఎంవో నుంచి కేలండర్ ప్రకారం ఏ క్రాప్ సీజన్ ఏదని ‘వాచ్’ పెట్టి, గత ఐదేళ్లుగా మీరు ప్రభుత్వంలో లేనప్పుడు ఆయా రంగాల్లో ఏమి జరిగింది, ఉన్నది కొనసాగించడమా లేక ఏవైనా మార్పు చేర్పులు అవసరమా అనేది మరి ఆ సంబంధిత సెక్రటరీలు చూడరా?

ఐదేళ్లుగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీలలో రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరి వాటిని మరింత మెరుగ్గా వాడుకోలేరా? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు. పోనీ వాళ్ళకు పట్టకపోయినా వారి ఢిల్లీ కార్యాలయాల సెక్రటరీలతో సీఎంవో నుంచి అధికారుల ‘ఫాలో అప్’ ఎందుకు లేదు? ఇక్కడ ఎన్నికయిన పార్టీ ప్రభుత్వం వరసగా ‘టార్గెట్’ అవుతుంటే అందుకు బాధ్యత ఎవరిది?

మిర్చి, పుగాకు, ఇప్పుడు మామిడి ఇవి మీ దృష్టిలో ఎందుకు లేవు? రైతులు వీధుల్లోకి వచ్చాక, ప్రతిపక్షం దాన్ని ‘అడ్రెస్’ చేయాల్సిన సమస్యగా గుర్తించాక, ప్రభుత్వం మరో ఆర డజను కొత్త సమస్యలు తెచ్చి పెట్టుకుని, అప్పుడు ఏవో కంటితుడుపు చర్యలతో దాన్ని ముగించడం ఏమిటి? విభజన తర్వాత మూసేసిన ప్రభుత్వ శాఖలు ఏమీ లేనప్పుడు, ఇన్నాళ్ళూ పనిచేసిన ఆయా శాఖల అధికారులు ఇప్పుడు ఎందుకు వారి బాధ్యతల విషయంలో నిర్లిప్తంగా ఉంటున్నారు.

అధికారులకు మునుపు లేని సౌకర్యాలు- ఏసీలు, సౌకర్యవంతమైన ప్రభుత్వ వాహనాలు, కొత్త జిల్లాలు వల్ల పాలన పరిధి తగ్గడం, పెరిగిన కమ్యూనికేషన్ నెట్ వర్క్, సాంకేతిక సహకారం అందించే పరిశోధనా శిక్షణ సంస్థల తోడ్పాటు నిజానికి ఇవన్నీ- పబ్లిక్ ‘డెలివరీ మెకానిజం’ మరింత మెరుగ్గా పెంచే అంశాలు.

సందర్భం ‘మామిడి పండు’ కనుక, ముందుగా చెప్పాల్సింది, ‘ఫుడ్ ప్రాసెసింగ్’ రంగం గురించి. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఇది కొత్తగా ‘డిపార్ట్మెంట్ గా అవతరించింది. టిడిపి ప్రభుత్వం వచ్చాక, దానికి పరిశ్రమ హోదా ఇస్తూ జీవో ఇచ్చింది, ఆ శాఖకు ఇప్పుడు కొత్తగా మంత్రి కూడా ఉన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో 2007 లో తాడేపల్లి గూడెం వద్ద హార్టీకల్చర్ యూనివర్సిటీ స్థాపించారు. అది మొదలు ఎన్నో కొత్త కోర్సులు పండ్ల తోటల యాజమాన్యం విషయంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ శాఖలతో పాటుగా ప్రైవేట్ కన్సల్టెన్సీలు కూడా ఈ రోజున ‘ఫార్మ్ హౌస్’ యాజమాన్యాలకు అందుబాటులోకి వచ్చాయి. మరి ఏడాది పొడుగునా మట్టిలో ఉండే చిన్న సన్నకారు తోటల యాజమానుల పరిస్థితి ఏమిటి? వాళ్ళకు అందాల్సిన సాంకేతిక సహకారం ఏమైంది?

మామిడి విషయంలో ఇటువంటి పరిస్థితికి కారణం ఏమిటి? అనంతపురం జిల్లాల్లో అరటి పండు దిగుబడి పెరిగితే, ‘కోవిడ్’ కాలంలో కూడా గూడ్స్ బళ్ళు వేసి మరీ మన అరటి పంటను ఢిల్లీ మార్కెట్ కు పంపిన మన అధికారులను ఇప్పటి ఈ ప్రభుత్వం వారిని తమ పని చేసుకోనిస్తున్నాదా? ఈ ఏడాది మే ఒకటిన ప్రధాని నరేంద్ర మోడీ వెలగపూడి వచ్చి వెళ్ళాక, నెలపైగా జిల్లా కలక్టర్లు ‘యోగా డే’ పనుల్లో ఉన్నారు.

‘అమరావతి’ బ్రాండ్ ఇమేజి కోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అయితే నెల రోజులు పాటు చివరికి కృష్ణా నదీ ప్రవాహం మీద కూడా రోజు ఎక్కడో ఒక చోట యోగా చేస్తున్న ఫోటోలు పత్రికల్లో కనిపించాయి. అది అయిన వెంటనే వాళ్లమీద ‘మెగా పేరెంట్-టీచర్ మీట్’ బాధ్యత పెట్టారు. ఈ వరసలో వ్యవసాయ సీజన్స్ భూమి పంటలు రైతులు పంట మార్కెటింగ్ సంబంధిత అంశాలు, వాటి వార్తలు మన ప్రాధాన్యతలలో ఎంత చివరి వరసలోకి వెళ్ళాయో చూడొచ్చు.

బాబు తొలి ప్రభుత్వంలో 1996 నాటికి కోటగిరి విద్యాధరరావు వ్యవసాయ శాఖా మంత్రి. ఒకరోజు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి, బెజవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో ప్రాంతీయ హార్టికల్చర్ అధికార్ల సమీక్ష సభలో మాట్లాడుతూ.. “చెట్టు నుండి మామిడి కాయ కోసేటప్పుడు వచ్చే కాయ సొన ఆ కాయకు అంటకుండా చూడాలి. అంటితే పడే మచ్చ కారణంగా విదేశాలకు ఎగుమతి ‘షిప్మెంట్’ వద్ద అవి రిజెక్ట్ అవుతున్నవి.” అలాగే.. “మ్యాంగో సీజన్లో కూడా లండన్ సూపర్ మార్కెట్లో బంగినపల్లి షెల్ఫ్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. సప్లయిలో ఈ గ్యాప్ రాకూడదు...” అంటూ తన సూక్ష్మ పరిశీలన వ్యాఖ్యలతో ఆ రోజు అధికారులను అప్రమత్తం చేసారు. ఇప్పుడు అదే స్థానంలో ఉన్నవారు ఎలా ఉన్నారు? ఏమి మాట్లాడుతున్నారు అనేది మనం ఇక్కడ మాట్లాడకుండా ఉంటేనే మర్యాద.

అది ఏ శాఖ విషయం అయినా అధికారుల వద్ద గత చరిత్ర అంతా ఉంటుంది. అయితే, ప్రభుత్వంలో ఉండే ఐఎఎస్ అధికారులు ‘విషయం’ తెలిసిన సంబంధిత శాఖల అధికారులను మాట్లాడనివ్వాలి. అలాగే ఐఎఎస్ లను వాళ్ళ పై వాళ్ళు మాట్లాడనివ్వాలి. ఇప్పుడు అదిలేదు. హార్టికల్చర్ శాఖ వద్ద ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఉంది, అది ఎప్పటికి దిగుబడికి వస్తుంది, వచ్చాక దాన్ని మార్కెట్ చేయడం ఎలా? ఇవన్నీ కంప్యూటర్లు లేని రోజుల్లో, చంకలో ఉండే ‘ఫైల్స్’ చూసి కలక్టర్ల రివ్యూ మీటింగుల్లో ఆఫీసర్లు చెప్పేవారు. ఆ ఏడు వచ్చే పంట దిగుబడిని మార్కెట్ కు పంపడానికి ఎన్ని గూడ్స్ రైలు బోగీలు (ర్యాక్స్) అవసరం అవుతాయి, ఇదంతా కనీసం పంట కోతకు నెల ముందు రివ్యూ చేసి ఆ అంచనాలతో రైల్వేకి రాసి రాజధానికి నివేదిక పంపేవారు. విషయం తెలియనివారి ‘స్పూన్ ఫీడింగ్’ లేని రోజులవి.

సరే, ఈ మామిడి పండు సీజన్లో రైతుల వెతలు తెలుసుకోవడానికి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా వెళ్ళి వచ్చాడు కనుక, మనం కూడా దీన్ని అటు నుంచే చూసుకుంటూ వద్దాం. కాంగ్రెస్ 1994లో ఇక్కడ ఓడిపోయాక, పడేళ్లకు తిరిగి 2004లో అధికారంలోకి వచ్చింది. మొదటి నుంచి దానికున్న సంక్షేమ పథకాల దృష్టితో భూమిలేని నిరుపేద ఎస్సీ ఎస్టీలకు బంజరు భూములు పంపిణీ చేసింది. ప్రధానంగా ఇవి సాగునీటి వసతి లేని మెట్ట భూములు.

దాంతో వీటిలో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఉచితంగా పండ్ల మొక్కలు ఇచ్చి, ‘ఇందిరా ప్రభ’ పేరుతో తమ భూముల్లో తోటలు సాగుచేసుకునే రోజుల్లో రైతులకు ఉపాథి హామీ పథకం కింద వేతనాలు చెల్లించింది. ‘ఇందిరా జల ప్రభ’ పేరుతో పాడుబడిన చెరువుల పూడిక తీసి వాటి పటిష్టపర్చి వాటి గట్లపై పండ్ల మొక్కలు నాటడం జరిగింది. ప్రతి పది ఎకరాలకు బోర్లు వేసి మోటర్లు పెట్టింది. ఉచిత కరెంటు కూడా ఇచ్చింది. ఫలితంగా ఆ మొక్కలు బ్రతికాయి. అలా ఎదిగిన మొక్కల రకాల్లో మామిడి ప్రధానం. ఆనాడు అలా నాటిన ఆ పచ్చదనం చిత్తూరు నుంచి పల్నాడు వరకు మెట్ట భూముల్లో వ్యాపించింది.

ఆ పధకం గడచిన పాతికేళ్లలో కాయ కాస్తా పండు అయింది. ఒకప్పటి రైతు కూలీలు మామిడి తోటల రైతులు అయ్యారు కానీ, దేశంలో మారుతున్న మార్కెట్ ఒడిదుడుకులు ఈ కొత్త రైతుల్ని శాశ్విత లబ్దిదారులుగానే వాళ్ళు ఎప్పటికీ ప్రభుత్వం వైపు ఆశగా చూసే స్థితిలోనే ఉంచింది. మామిడిలో ఏటా చాలమణిలో ఉండే ‘టేబుల్’ వెరైటీ (రసాలు, బంగినపల్లి) మార్కెట్ కు ఎప్పుడూ ఇబ్బంది లేదు. ఆ తోటల యజమానులు వాళ్ళు ఎక్కడో నగరాల్లో ఉంటూ తమ తోటలు ‘లీజు’కు ఇస్తారు. కానీ రెండవదైన ‘జ్యూస్ వెరైటీ’ పండించే రైతుల పరిస్థితి ‘ప్రాసెసింగ్ యూనిట్ల’ యాజమానుల వాణిజ్య ప్రయోజనాల మేరకు ఉంటున్నాయి. వీళ్ళు ఒకప్పటి ప్రభుత్వ పధకాల లబ్ధిదారులు.

ఇప్పటి ఈ పరిస్థితికి విదేశాలలో గిరాకీ తగ్గి ఎగుమతులు లేవు అంటున్నారు. గత ఏడాది మామిడి గుజ్జు నిల్వలు ఇంకా అలాగే గిడ్డంగుల్లో ఉన్నాయి అంటున్నారు. అయితే, ఇకముందు ఈ మామిడి గుజ్జులో ఉండే పోషక విలువలు సాంకేతికంగా పరిశీలించి దీన్ని చాక్లెట్లు క్యాండిలు జ్యూస్ ప్యాక్స్ గా మార్చి ప్రభుత్వ అంగన్వాడీలు, స్కూళ్ళలో పిల్లలకు ‘డైట్’గా ప్రవేశపెట్టే అవకాశం ప్రభుత్వం పరిశీలించవచ్చు. మార్కెట్లోకి ‘టెట్రా ప్యాకింగ్’ విధానం వచ్చాక ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇదంతా జరగాలి అంటే, కొత్తగా ప్రభుత్వ శాఖగా మారిన ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్’ చొరవ చూపి డిమాండ్ – సప్లై మధ్య ప్రతి దశలోకి అది ప్రవేశించి, ఒక కార్యాచరణ రూపొందించాలి.అదొక్క మామిడి అనే కాదు, తరుచూ ఏటా మనం చూస్తున్న టమోటా, ఉల్లిపాయలు వంటి ఉత్పత్తుల విషయంలో కూడా వాటిని పండించే రైతుల వెతలు కారణంగా ప్రభుత్వ యంత్రాంగం విమర్శకు గురి కాకుండా చూడాలి.



Read More
Next Story