
విత్తన రంగంలో విప్లవం తెచ్చిన మండవ
మండవ వెంకట్రామయ్య దూరదృష్టి హైబ్రిడ్ విత్తన రంగం ఏపీలో మొదటి తరంలో విస్తరించటానికి కారణ మైంది.
నూజివీడు సీడ్స్ లిమిటెడ్ అధినేత మండవ వెంకట్రామయ్య (Sri Mandava Venkatramaiah) భారతీయ వ్యవసాయ రంగంలో ఒక విశిష్ట వ్యక్తి. నూజివీడు సీడ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. ఆయన తన 94వ ఏట నూజివీడు మండలంలోని తక్కులూరులో సోమవారం కన్నుమూశారు.
మండవ వెంకట్రామయ్య 1931లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, చిలువూరు గ్రామంలో మండవ సుబ్బయ్య, సుఖవాణి దంపతులకు జన్మించారు.
బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం నుంచి అగ్రికల్చర్ బిఎస్సీ, ఆగ్రాలో బీఆర్ కాలేజీ నుంచి అగ్రోనమీ (వ్యవసాయ శాస్త్రం) వ్యవసాయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు.
వృత్తి, వ్యాపార ప్రస్థానం
ఆయన వృత్తి ప్రారంభంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అగ్ మార్క్ లో క్లాస్ అధికారిగా పనిచేశారు.
ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా (FCV) టొబాకో గ్రేడింగ్, మార్కెటింగ్‌లో ప్రవీణుడిగా గుర్తింపు పొందారు. రైతుల సహకార సంఘాలను ఏర్పాటు చేసి, వేలం ఆధారిత విక్రయ వ్యవస్థలను అమలు చేసి, రైతులకు మార్కెట్ అవకాశాలు, సకాలంలో చెల్లింపులు అందజేయడంలో కీలక పాత్ర పోషించారు.
1973లో హైబ్రిడ్ కాటన్ సీడ్స్ ఉత్పత్తిని ప్రారంభించి భారతీయ సీడ్స్ రంగంలో పునాది వేశారు. ఇది తరువాత NSL గ్రూప్‌లో భాగంగా నూజివీడు సీడ్స్ లిమిటెడ్‌గా రూపుదిద్దుకుంది. ఇది నేడు భారతదేశంలో అతిపెద్ద సీడ్స్ కంపెనీలలో ఒకటి.
ఆయన దూరదృష్టి, వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో సహాయపడ్డాయి.
కుటుంబం
ఆయన భార్య శ్రీమతి రమా దేవి. కుమారుడు డాక్టర్ మండవ ప్రభాకర్ రావు (Dr. M. Prabhakara Rao), నూజివీడు సీడ్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NSAI) అధ్యక్షుడు. 1982లో కుమారుడు వ్యాపారాన్ని చేపట్టి విస్తరించారు. కుమార్తె మండవ ఆశా ప్రియ (Mandava Asha Priya), కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నారు.
సామాజిక సేవలు
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు సమాజాభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇచ్చారు. పాఠశాలలు, దేవాలయాల పునర్నిర్మాణం, గ్రామీణ బాలికల ఉన్నత విద్యకు సహాయం వంటివి చేపట్టారు. మండవ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు తుక్కులూరు, ఆగిరిపల్లి గ్రామాల్లోని పేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు.
నైతికత, నాణ్యతా పూర్వక వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ఆయన జీవితకాలం చిరస్థాయిగా నిలిచింది.
ఆయన గౌరవార్థం పలు అవార్డులు ఏర్పాటు చేయబడ్డాయి. ఉదాహరణకు ఉత్తమ ఉపాధ్యాయులకు శ్రీ మండవ వెంకట్రామయ్య అవార్డు ఇస్తారు.
మరణం
మండవ వెంకట్రామయ్య ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరులో సోమవారం కన్నుమూశారు. ఆయనకు 94 సంవత్సరాలు. సీడ్స్ ఇండస్ట్రీలో ఆయన మరణం పట్ల విచారం వ్యక్తమైంది. మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సెలబ్రెటీలు సందర్శించి నివాళులర్పించారు.
ఆయన వారసత్వం నూజివీడు సీడ్స్ ద్వారా భారతీయ వ్యవసాయ రంగంలో కొనసాగుతోంది.