వెంటాడిన వీధి కుక్కలు..స్పాట్లోనే వ్యక్తి మృతి
x

వెంటాడిన వీధి కుక్కలు..స్పాట్లోనే వ్యక్తి మృతి

వీధి కుక్కల బారి నుంచి తప్పించుకోబోయి...: బైక్ అదుపుతప్పి ఆలయ గోడను ఢీకొట్టి మృతి చెందిన ద్విచక్రవాహనదారుడు.


ఆంధ్రప్రదేశ్ లో వీధి కుక్కల బెడద మరోసారి ప్రాణం తీసింది. వీధి కుక్కల గుంపు వెంబడించడంతో భయాందోళనకు గురైన ఓ ద్విచక్రవాహనదారుడు వాటి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి అదుపుతప్పి ఆలయ గోడను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందిన దారుణ సంఘటన సోమవారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రాయచోటి పట్లణంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయచోటిలోని లక్ష్మీపురంలో నివాసముంటున్న ఫజిల్ (42) అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గాలివీడు రోడ్డులోని అర్బన్ పోలీస్ స్టేషన్ సమీపం నుంచి ద్విచక్ర వాహనంపై తన ఇంటికి బయలుదేరారు. అయితే అదే సమయంలో అక్కడ రోడ్డుపైన ఉన్న వీధి కుక్కలు గుంపుగా అకస్మాత్తుగా ఆయన బైక్‌ను వెంబడించాయి. ఈ క్రమంలో ఆ వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోవడానికి భయంతో వాహనదారుడు ఫజిల్ తన ద్విచక్ర వాహనాన్ని వేగంగా పోనిచ్చారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఆలయ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్ర ప్రమాదంలో ఫజిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచి దుర్మరణం చెందారు. దీంతో ఆ కుటుంబం బోరున విలపించింది.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

అయితే దారుణమైన ఈ దుర్ఘటన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో రోడ్లపై ఆవులు, వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నా మున్సిపాలిటీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వారి నిర్లక్ష్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల బెడదను తక్షణమే నియంత్రించాలని స్థానికులు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. మరోవైపు సమాచారం అందుకున్న రాయచోటి ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Read More
Next Story