Tragedy | కన్నీరు ఆవిరైంది.. గుండె పగిలింది..
x

Tragedy | కన్నీరు ఆవిరైంది.. గుండె పగిలింది..

భార్య వివాహేతర బంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. నా కొడుకును కాపాడండి. అని సీఎంను కోరుతూ, క్వారీ కొండ పైనుంచి దూకేసిన ఘటన ఇది.


చావే శరణ్యం అనుకున్నాడు. ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. రాత్రంతా ఆ క్వారీ కొండపై గడిపాడు. పొగిలిపొగిలి రోదించాడు. అయినా, భారం తగ్గలేదు. తాను చనిపోతున్నా అనే మోహనాచారి వీడియో చూసిన గ్రామస్తులు క్వారీ వద్దకు చేరుకున్నారు.

కన్నీటితో అర్థించారు. మోహనన్నా.. నీవు ఏ తప్పు చేయలేదు. కిందికి దిగారా. కిందపడితే కాళ్లు చేతులు విరుగుతాయి. లక్షలు పెట్టి వైద్యం చేయించే స్థోమత మీ అమ్మకు లేదు. నన్ను భయపెట్టగాకునో. నీ దండం పెడతా కిందికి దిగు. అదే సమయానికి గ్రామస్తులు అంతా క్వారీ ఉన్న కొండ కిందకు చేరారు. అందరూ వేడుకుంటున్నారు. అయినా,

అవమానభారంతో ఉన్న ఆ వ్యక్తి అందరూ చూస్తుండగానే దాదాపు కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి గ్రానైట్ క్వారీలో దూకేశాడు. విపరీతమైన దెబ్బలు. తల పగిలింది. రక్తపుమడుగులో ఉన్న అతనిని ఆస్పత్రికి తరలించారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించాడు. భార్య వివాహేతర సబంధం భరించలేని ఓ భర్త అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకున్నాడు.


"నా భార్య నా మాట వినలేదు. ఓ ఉద్యోగి ఆమెను ట్రాప్ చేశాడు. ఈ అవమానం భరించలేను. నేను చనిపోతున్నా. నా ఎనిమిదేళ్ల కొడుకును కాపాడండి" అని ఆ వ్యక్తి సీఎం, డిప్యూటీ సీఎంను అర్ధిస్తూ, సెల్ఫీ విడుదల చేశాడు.

చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన సంఘటన ఇది.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు (జీడీ. నెల్లూరు) నియోజకవర్గం పెనుమూరు మండలం గుంటుపల్లె గ్రామ సచివాలయం గుడ్యానంపల్లెలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన రవి ఆచారి రెండో కొడుకు మోహనాచారి (36)కి పాకాల మండలం గాదంకి గ్రామానికి చెందిన సరితతో పదేళ్ల కిందట పెళ్లయింది వారికి ఒక ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. అప్పటి వరకు వారి జీవితం అన్యోన్యంగానే సాగేది.
కొంతకాలంగా కిందట సరితకు గుంటిపల్లి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. వారి మధ్య ఏర్పడిన వివాహేతర బంధం వల్ల కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని మోహనాచారి సెల్ఫీ వీడియోలో ఆవేదన చెందాడు. రెండు నెలలుగా వారిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. అయినా, భార్య ప్రవర్తనలో మార్పు రాకపోగా, వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగితోనే ఉంటానని తెగేసి చెప్పడంతో మనస్థాపానికి గురైన మోహనాచారి ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
"భార్య సరిత, ఆమెతో వివాహేతర సంబంధం సాగిస్తున్న గుంటుపల్లి సచివాలయ ఉద్యోగి నా చావుకి కారణం" వారిపై చర్యలు తీసుకోండి అని మోహనాచారి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. "దాదాపు 50 రోజులుగా నా భార్య సరితలో మార్పు తీసుకుని రావడానికి ఎన్నో విధాలుగా చెప్పాను. ప్రయోజనం లేదు. ఆ ఉద్యోగితోనే వెళ్లిపోతాను. అని చెబుతోంది. దీనిని భరించడం నా వల్ల కాలేదు. అందుకే చనిపోతున్నా" అని వీడియోలో మోహనాచారి తన వేదన వ్యక్తం చేశాడు.
"నా భార్య, ఆమెను ట్రాప్ చేసిన సచివాలయ ఉద్యోగిని శిక్షించండి" అని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అభ్యర్థించాడు. నా ఎనిమిదేళ్ల కొడుకును కాపాడండి అని కూడా మోహనాచారి కోరాడు. కాగా, ఆ వీడియో చూసిన గ్రామస్తులు క్వారీ వద్దకు చేరుకుని కిందికి దిగిరావాలని కోరుతుండగానే. కొద్ది సేపటికి దూకేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని చిత్తూరు ఆస్పత్రికి, తరువాత మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మోహనాచారి మరణించాడు. అంతకుముందు ఈ ఘటనపై పోలీసులు సెల్ఫీ సూసైడ్ కింద కేసు నమోదు చేశారు. పెనుమూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు మోహనచారి తండ్రి రవి ఆచారి, కొన్ని రోజులకు ఆయన అన్న కూడా మరణించారు. దీంతో తల్లి, భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. కాగా, పింఛన్ కోసం సచివాలయ ఉద్యోగితో మాట్లాడాను. మినహా నాకు ఎవరితో కూడా సంబంధాలు లేవు. దీనిపై మధ్యస్థం కూడా జరిగిందని మోహనచారి భార్య చెబుతోంది. ఇటీవల ఒకసారి సచివాలయానికి వెళ్లడానికి నా భర్త పిలిచినా, వెళ్లలేదు. ఫోన్ చేసి మాట్లాడమని చెప్పినా.. నేను చేయలేదు. అని సరిత మీడియాకు చెప్పింది. నన్ను అనుమానిస్తుండడం వల్లే నేను ఎవరితో ఫోన్ లో మాట్లాడలేదని ఆమె అంటోంది. నా భర్త చెప్పినట్లు ఆయన బామర్ది భార్య ద్వారా కాన్ఫరెన్స్ కాల్ కూడా మాట్లాడలేదు. వారికి ఈ విషయాలు ఏమి తెలియవని ఆమె చెబుతోంది.
చిన్న విషయాలకు సెల్ టవర్లు ఎక్కడం వంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ప్రజలు, పోలీసుల రంగ ప్రవేశంతో అనేక సంఘటనలు చాలా వరకు సుఖాంతం అయ్యాయి. చిత్తూరు సంఘటనలో మోహనాచారి మనసు మారడానికి గ్రామస్తులు శతవిధాల ప్రయత్నించారు. కళ్లెదుటే అతను ఎంతఎత్తు నుంచి దూకి, ప్రాణాలు తీసుకోవడం జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సచివాలయ ఉద్యోగి పరారీలో ఉన్నట్లు సమాచారం.
Read More
Next Story