అమరావతిలో పర్యటిస్తున్న మలేషియా బృందం
x

అమరావతిలో పర్యటిస్తున్న మలేషియా బృందం

మంత్రి నారాయణతో మలేషియా ప్రతినిధులు భేటీ అయ్యారు.


అమరావతిలో రాబోయే ఐదేళ్లలో 6వేల నుంచి 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు మలేసియా కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. మలేసియా బృందం ఆదేశపు మంత్రి, ఎంపీతో కలిసి అమరావతిలో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా మలేసియా ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్న తీరును శుక్రవారం పరిశీలించారు. ఆ తర్వాత సచివాలయంలో వారితో భేటీ అయ్యారు. ఈ భేటీలో మలేసియాలోని సెలాంగార్‌ స్టేట్‌ ఎక్స్‌ కో మంత్రి పప్పారాయుడు,క్లాంగ్‌ ఎంపీ గనబతిరావ్,మలేసియా – ఆంధ్రా బిజినెస్‌ చాంబర్‌ ప్రతినిధులు, పలు ప్రయివేట్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి అభివృద్దికి భారత్‌ తో కలిసి పనిచేస్తామని మలేసియా మంత్రి పప్పారాయుడు తెలిపారు. ముఖ్యంగా మలేసియాలో తెలుగు మూలాలు ఉన్న పారిశ్రామిక వేత్తలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తమ ప్రాజెక్ట్‌ ల గురించి మంత్రి నారాయణకు వివరించారు. ప్రధానంగా ఐదు కీలక సెక్టార్‌ లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ముందుకొచ్చాయి. ఎడ్యుకేషన్,టూరిజం – హాస్పిటాలిటీ, ట్రేడ్‌ అండ్‌ కామర్స్, రియల్‌ ఎస్టేట్, తెలుగు సంçస్కృతి, సంప్రదాయాలకు చెందిన వివిధ ప్రాజెక్ట్‌ ల్లో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. అమరావతిలో మెడికల్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు మలేషియాలోని సైబర్‌ జయ యూనివర్శిటీ ముందుకొచ్చింది. అలాగే ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌ ఏర్పాటుకు బెర్జయ గ్రూప్‌ ముందుకొచ్చింది.

ప్రపంచంలో టాప్‌ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి : మంత్రి నారాయణ
అమరావతిలో జరుగుతున్న అభివృద్ది పనులను మంత్రి నారాయణ మలేసియా ప్రతినిధులకు వివరించారు. ఇప్పటికే 51 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయి,పనులు కూడా ప్రారంభమయ్యాయని, నిర్ధేశిత గడువులతో నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. కేపిటల్‌ సిటీలో 360 కిమీ మేర ట్రంక్‌ రోడ్లు ఏడాదిన్నరోగా, 1500 కిమీ మేర లే అవుట్‌ రోడ్లు రెండేళ్లలోగా, అధికారులు,ఉద్యోగులు,ప్రజాప్రతినిధులకు చెందిన 4000 ఇళ్లను వచ్చే మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలనే టార్గెట్‌ పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ వారికి వివరించారు. అలాగే పాలనా భవనాలైన సచివాలయం టవర్లు,అసెంబ్లీతో పాటు హైకోర్టు భవనాలను రెండున్నరేళ్లలో పూర్తి చేసేలా టార్గెట్‌ పెట్టుకుని ముందుకెళ్తున్నామన్నారు. గత మూడు నెలలుగా వర్షాల వల్ల పనులకు కొంతమేర ఆటంకం కలిగిందని, రాబోయే రోజుల్లో పనులు వేగవంతం అవుతాయని మంత్రి నారాయణ మలేసియా బృందానికి వివరించారు.
Read More
Next Story