
ప్రకాశం జిల్లా పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది భావిస్తున్న ఈ ప్రమాదంలో రూ.500 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని ఓ పొగాకు పరిశ్రమలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు క్షణాల్లో పరిశ్రమ మొత్తానికి వ్యాపించాయి, స్థానికంగా తీవ్ర భయాందోళన సృష్టించాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంతో సుమారు రూ.500 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు వేస్తన్నారు.
సింగరాయకొండలో బీకేటీ సంస్థ ఆధీనంలో జీపీఐ కంపెనీ అద్దెకు తీసుకుని నడిపిస్తున్న పొగాకు ప్రాసెసింగ్ యూనిట్ ఇది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పరిశ్రమలోని రసాయనాలు, పొగాకు స్టాక్, ప్యాకింగ్ సామగ్రి మంటలకు ఆహుతి అయ్యాయి. భారీగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, దట్టమైన పొగ కమ్ముకోవడం కారణంగా సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, సమయానికి రక్షణ చర్యలు చేపట్టడంతో మానవ నష్టం సంభవించలేదు.
సమాచారం అందుకున్న వెంటనే ఒంగోలు, సింగరాయకొండ, చీరాల ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిస్థితిని సమీక్షించి, చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా నిరోధించారు. పరిశ్రమలోని పొగాకు స్టాక్, యంత్రాలు, మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తిగా దగ్దమయ్యాయి. దాదాపు రూ.500 కోట్ల విలువైన నష్టం జరిగినట్లు అధికారులు, పరిశ్రమ యాజమాన్యం అంచనా వేస్తున్నారు. ఈ యూనిట్ ప్రకాశం జిల్లా పొగాకు ఎగుమతులకు కీలకమైనది కావడంతో, స్థానిక రైతులు, కార్మికులపై ఈ ప్రమాదం తీవ్ర ప్రభావం చూపనుంది. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని సందర్శించి, పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరిపారు. అగ్నిప్రమాద కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను కఠినతరం చేయాలని సూచించారు.
Next Story