విద్రోహ శక్తులకు వణుకు పుట్టించిన మహేష్‌ చంద్ర
x

విద్రోహ శక్తులకు వణుకు పుట్టించిన మహేష్‌ చంద్ర

మహేష్‌ చంద్ర లడ్హా పేరు వినగానే మావోయిస్టుల ఉనికిని లేకుండా చేసిన విషయం గుర్తుకు వస్తుంది. ఆయనను హతమార్చేందుకు వారు వేసిన వ్యూహాన్ని ఛేదించి ముందుకు సాగారు.


ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి లడ్హా ప్రస్తుతం ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా నియమితులయ్యారు. ఆయన 1998 వ బ్యాచ్ ఐపిఎస్ అధికారి. కేంద్ర సర్వీసుో ఉన్నలడ్హాను చంద్రబాబు నాయుడు ఏరికోరి రాష్ట్రానికి తిరిగి పిలిపించారు. గతంలో ఆయన అధికారిగా పనిచేసిన ప్రతి చోటా మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొంత కాలం ఏపీలో పనిచేసి డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీస్‌లో పనిచేసేందుకు వెళ్లారు. తిరిగి ఆయనను ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు పిలిపించి నిఘా విభాగం చీఫ్‌గా నియమించడం ఆయన సిన్సియారిటీకి మారు పేరుగా పోలీస్‌ అధికారులు చెబుతున్నారు.

1998 బ్యాచ్‌కి చెందిన మహేష్‌చంద్ర లడ్హాకు శిక్షణ తర్వాత మొదటి పోస్టింగ్‌ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన అప్పటి విశాఖ జిల్లా చింతపల్లిలో ఇచ్చారు. నక్సల్‌ సమస్యలు తీవ్రంగా ఉన్న సమయంలో ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం మహబూబ్‌నగర్‌లో ఓఎస్డీగా పనిచేసిన లడ్హా నక్సల్‌ ఆపరేషన్స్‌ నిర్వహించారు. 2004 నుంచి కొంత కాలం ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు.
గుత్తికొండ సహా ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామస్తులకు మహేష్‌ చంద్ర లడ్హా అవగాహన కల్పిస్తూనే పలు ఆపరేషన్లు చేపట్టారు. నక్సల్స్‌ ప్రభుత్వంతో చర్చలు జరపాలని నిర్ణయించినపుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయన కీలకంగా వ్యవహరించారు. 2005లో నక్సల్స్‌ ఆయనను లక్ష్యంగా చేసుకుని సైకిల్‌ బాండుతో దాడికి పాల్పడ్డారు.
ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతం కావడం, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ అప్పట్లో మావోయిస్టుల యాక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల పోలీసులు నిత్యం అలర్ట్‌గానే ఉండే వారు. అయితే ఎస్పీ క్యాంపు కార్యాలయం ఒంగోలులోని కొండపై భాగాన ఉండేది. కార్యాలయం హైవేపై ఉండేది. నిత్యం క్యాంపు కార్యాలయం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే కార్యాలయానికి వచ్చి వెళ్లాల్సి వచ్చేది. ఆయన వచ్చి వెళ్లే రహదారిని మావోయిస్టులు పూర్తి స్థాయిలో పరిశీలించి రెక్కీ అనంతరం రంగారాయుడు చెరువు వద్ద ఉన్న అమ్మవారి గుడి మూలపై సైకిల్‌కు బాంబు అమర్చి కార్యాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి లడ్హా వెళుతున్న సమయంలో దూరం నుంచి రిమోట్‌ ద్వారా పేల్చారు. కారు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కావడంతో ముందు వైపు ఇంజన్‌లో నుంచి మంటలు వచ్చాయి. ఒక్క సారిగా కారును ఆపివేసిన డ్రైవర్‌ కిందకు దూకారు. ఇద్దరు గన్‌మెన్‌లు వెనుక వైపు నుంచి కిందకు దూకి చుట్టపక్కల వారిని గమనించి పరుగు పెడుతున్న వారిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఇరువురికి గాయాలయ్యాయి. మావోయిస్టులు తప్పించుకుని పారిపోయారు. సంఘటన జరిగిన వెంటనే కారు దిగిన మహేష్‌ చంద్ర లడ్హా దేవాలయంలో కాసేపు కూర్చుని దేవుని దయతోనే దాడి నుంచి బయట పడినట్లు చెప్పారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచనలం సృష్టించింది. నల్లమల అడవులు కూడా ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఉండటం వల్ల మావోయిస్టులు ఉండేందుకు అనువుగా మారింది.
అనంతరం నిజామాబాద్‌ ఎస్పీగా మహేష్‌చంద్ర లడ్హా బదిలీ అయ్యారు. రేండేళ్ల తర్వాత గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. 2009లో గుంటూరు ఎస్పీగా పనిచేసిన ఆయన అక్కడ రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు. గురజాల, పిడుగురాళ్లలో ఫ్యాక్షనిజంపై చర్యలు తీసుకున్నారు. 2009 ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లాలో రీపోలింగ్‌ జరగకుండా, గొడవలు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. మొదటిసారి ఎలాంటి ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నందుకు ఎన్నికల కమిషన్‌ ఆయనను అభినందించింది.
హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా పనిచేసిన తర్వాత మహేష్‌చంద్ర లడ్హా కేంద్ర సర్వీసులకు వెళ్లి ఎన్‌ఐఏలో పనిచేశారు. మక్కా మసీదు పేలుళ్ల కేసు దర్యాప్తు సహా పలు ఉగ్రవాద కార్యకలాపాల కేసులు, హై ప్రొఫైల్‌ కేసులను దర్యాప్తు చేశారు. అనంతరం సీఆర్పీఎఫ్‌ సదరన్‌ సెక్టార్‌ ఐజీగా పనిచేశారు. అనంతరం విజయవాడ జాయంట్‌ సీపీగా విధులు నిర్వర్తించారు. కాల్‌ మనీ వ్యవహారంలోనూ ఆయన దర్యాప్తు చేశారు.
2018లో విశాఖ కమిషనర్‌గా పనిచేసిన మహేష్‌చంద్ర లడ్హా, అదే సమయంలో జగన్‌పై కోడికత్తితో దాడి జరిగిన వ్యవహారంలో పారదర్శకంగా దర్యాప్తు జరిపించారు. విశాఖలో రౌడీలపై ఉక్కుపాదం మోపారు. ఆయన చర్యలకు చాలా మంది రౌడీలు విశాఖపట్నం వదిలి వెళ్లిపోయారు. చెడ్డీ గ్యాంగ్‌ల భరతం పట్టారు. ఐపీఎస్‌ అధికారి లడ్హా తాను పనిచేసిన ప్రతి విభాగంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సీఆర్పీఎఫ్‌లో విశిష్ట సేవలకుగాను ఈ ఏడాది ప్రెసిడెంట్‌ మెడల్‌ పురస్కారం దక్కింది. 2018లో విశాఖపట్నం సీపీగా పనిచేస్తున్న సమయంలోనూ ప్రెసిడెంట్‌ మెడల్‌ అందుకున్నారు. పనిచేసిన ప్రతి చోటా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్‌ చంద్ర లడ్హా ఏపీ నిఘా విభాగం చీఫ్‌గా నియమితులవడం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుందాం.
Read More
Next Story