ప్రతిఏటా వచ్చినట్టే మహాత్మాగాంధీ జయంతి మళ్లీ వచ్చింది. మర్రిచెట్టుకు ఎన్నికాయలు కాసినా ఏవో కొన్నే మొలకెత్తుతాయి. వాటిలోనూ కొన్నే పెరుగుతాయి. నీడనిచ్చి జనానికి సేద తీరుస్తాయి. అలాంటి మర్రిచెట్టు మన మహాత్ముడు. గుజరాత్ పోర్ బందర్ లో పుట్టి దక్షిణాఫ్రికా వెళ్లిన మోహన్ దాస కరమ్ చంద్ గాంధీ అక్కడ నివసించే భారతీయుల కోసం రెండు ఆశ్రమాలు స్థాపించారు. డర్బన్‌లోని ఫీనిక్స్ సెటిల్‌మెంట్ లో ఒకటి, జోహన్నెస్‌బర్గ్‌లోని టాల్‌స్టాయ్ ఫార్మ్. టాల్‌స్టాయ్ రష్యన్ రచయిత, తత్వవేత్త. పూర్తి పేరు లియో టాల్‌స్టాయ్. తాను పెట్టిన ఆశ్రమానికి టాల్ స్టాయ్ పేరు పెట్టినపుడు అందరూ ముక్కునవేలేసుకున్నారు. 1910 నుంచి 1913 వరకు ఈ ఆశ్రమాలు నడిచాయి. ప్రజల్ని అహింసా సత్యాగ్రహాం వైపు మళ్లేలా శిక్షణ ఇవ్వడానికి వీటిని నడిపారు. ట్రాన్స్‌వాల్‌లోని భారతీయుల పట్ల ఇంగ్లీషు వారి వివక్షకు వ్యతిరేకంగా ఆయన అహింసాయుత సత్యాగ్రహాలను ఎంచుకున్నారు. ఆ సమయంలో గోపాల్ కృష్ణ గోఖలే దక్షిణాఫ్రికాలో పర్యటనకు వచ్చారు. గాంధీ దీక్షాశిబిరాలను చూసిన గోఖలే- గాంధీని ఇండియా వచ్చి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనమని కోరారు. ఆయన కోరిక మేరకు యువ బారిస్టర్ గాంధీ 1915 జనవరి 9న భారతదేశానికి తిరిగి వచ్చారు. భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేశారు. ఆ తర్వాత రంగంలోకి దూకారు.
ఆ తర్వాత ఏడాదికి అంటే 1916లో కాశీ విశ్వవిద్యాలయానికి వైస్రాయ్ హార్డింజ్ ప్రారంభోత్సవం చేసినపుడు గాంధీజీ మాట్లాడారు. అదో అద్భుత ప్రసంగంగా చెప్పేవారు.
'ఏదో ఒకనడు మనకు స్వరాజ్యం వస్తుంది. అయితే అది దానంగా రాదు. బ్రిటీషవారు ఎంతో స్వేచ్ఛాప్రియులైనా స్వాతంత్య్రానికై స్వయం కృషి చేయని వారికి స్వాతంత్య్రాన్ని ఎన్నటికీ దానంగా ఇవ్వరు. ఈ విషయంలో మనం బోయరు యుద్ధం నుంచి కొంతగుణపాఠం నేర్చుకోవాలి. కొన్నేళ్ల కిందటబ్రిటీష్ సామ్రాజ్యానికి శత్రువులుగా ఉన్న బోయర్లు ఇప్పుడు దానికి మిత్రులు' ఇలా సాగుతుంది ఆనాటి గాంధీ ఉపన్యాసం. అప్పటికి ఆయనలా ప్రసంగించిన భారతీయుడు లేకపోవడమే ఈ ఉపన్యాసం ప్రాధాన్యత. అదో సాహసం.
ఆ కాలానికి తెలుగువాళ్లకి ఉన్న ఏకైక వార్తాపత్రిక ఆంధ్రపత్రిక.. గాంధీ గురించి రాస్తూ ఈ ఉపన్యాసాన్ని కోట్ చేసింది. ఆయన్ను గొప్పవానిగా కీర్తించింది. ఆయన వేసుకున్న డ్రెస్ గురించి అప్పుడు వచ్చిన వార్తల్లో ఇదొకటి. 'తొలిరోజుల్లో గాంధీజీ వషం మార్వాడీ గుజరాతీ సేఠ్ ల మాదిరి ఉండేది. తలమీద కోరతలపాగ, గుండె కిదుగా బొందులతో ముడివేసిన చొక్కా, ధోవతి, ఆకు చెప్పులు, మొలలో గడియాం' ఉండేవట. దక్షిణాఫ్రికాలో తన కేసుల్ని తానే వాదించకున్న వాడు గాంధీ. అక్కడ సంపాయించిందీ, బహుమతులుగా వచ్చిందీ అంతా ఒక ట్రస్ట్ కి అప్పగించి దానిమీద వచ్చే వడ్డీని ప్రజాసంక్షేమకార్యక్రమాలకు వినియోగించుకోమని వదిలేసి వచ్చారట ఆరోజుల్లోనే.
అటువంటి గాంధీజీ 1921లో మన బళ్లారి వచ్చారు. అప్పటికి బళ్లారి అనంపురం జిల్లాలోనే ఉండేది. ఆంధ్రపత్రికలో ఆయన టూరు విశేషాలు రాశారు. దాన్ని గురించి ప్రముఖ రచయిత,కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తిరుమల రామచంద్ర తన హంపీ నుంచి హరప్పా పుస్తకంలో ఇలా రాశారు.
'గాంధీని చూడాలని ఉంది. మా అమ్మను అడిగితే మా తాతను అడగమంది. తాతగారిని బ్రతిమిలాడితే కాదనరు అనే అభిప్రాయం కలిగింది. మా వూరి నుంచి దాదాపు వందమంది వెళుతున్నట్టు తెలిసింది. తాతగారిని అడిగాన. వేలంది జనం వస్తారు, ఐతే బసచేయడానికి మన బంధువులు ఉన్నారు. కానీ ఆ గుంపులో నీవు తప్పిపోతే నేను వెదగ్గలనా? అంటూ అంగీకరించారు.
గాంధీజీ రాకకు ఒకరోజు ముందే మేము బళ్లారి వెళ్లాం. నేను అంతకుముందు బళ్లారి మీదుగా రెండుమూడు సార్లు రైల్లో ప్రయాణం చేశాను. కాని ఆనాటి గోల వేరుగా ఉంది. రైలు స్టేషన్ ద్వారాలన్నింటికి బంతిపూల దండలు, ఒక్కోచోట నిచ్చమల్లి దండలు. గాంధీజీకి స్వాగతం చెబుతూ నినాదాలతో పతాకాలు కట్టారు'
గాంధీజీ ఘనస్వాగతం పలికేందుకు బళ్లారి బంగ్లా కాంపౌండ్ సిద్ధమైంది. కొన్ని వేలమంది కూర్చోవచ్చు. కాంపౌండ్ లో పెద్ద వేదిక ఏర్పాటైంది. బల్లలు వేసి తెల్లటి ఖద్దరు బట్ట వేసి పల్చటి పరుపులు వేశారు. దిండ్లు పెట్టారు. మైదానం అంతటా వెదుళ్లు నాటి తొరణాలు,పూలమాలలు కట్టారు. ప్రవేశ ద్వారం వద్ద రాట్నాల తోరణం కట్టారు. మొత్తం మీద అదో పండగలా ఉంది.
ధార్వాడ నుంచి ఫోర్డ్ కారులో గాంధీ...
ఆరోజుల్లో ఫోర్డ్ కార్లు బాగా ఫేమస్. బంగ్లా కాంపౌండ్ కిటకిటలాడుతోంది. ఆంధ్రనాటక పితామహుని చివరి కుమారుడు భోగీంద్రనాథ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయన కాశీ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదివారు. హిందీ బాగా మాట్లాడతారు. గాంధీజీకి జై అనే నినాదాలు మిన్నంటాయి. గాంధీజీ హిందీలో మాట్లాడితే భోగీంద్రనాథ్ తెలుగులోకి అనువదించారు. మహిళలు త్యాగం చేయాలి, విరాళమివ్వాలి అని గాంధీజీ పిలుపిచ్చారు. అంతే కొన్ని వందల మంది మహిళలు తమ చేతులకున్న బంగారు గాజుల్ని ఇచ్చారు. బంగారు గొలుసుల్ని గాంధీ చేతిలో ఉంచారు. దేశంలో స్త్రీ పురుషులు అందరూ ఖద్దరు కట్టాలన్న పిలుపుకి బాగా స్పందన వచ్చింది. పురుషులు విలాసవస్తువులు ధరించరాదన్నారు. అసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలని గాంధీ ప్రసంగించారు.
సుమారు రెండు మూడు గంటల సేపు విరాళాల సేకరణ జరిగింది. ఓ గోతం నిండా బంగారు ఆభరణాలు వచ్చాయి. విద్యార్థులు గాంధీకి జై అంటూ నినాదాలు చేసుకుంటూ మా స్కూలుకీ రండీ అంటూ చేతులు ఊపి ఆయన్ని తాకేందుకు నానా తంటాలు పడ్డారు.
గాంధీజీ గొప్పతనమేమిటంటే ఆయన విశ్వాసం. ఆయన విశ్వాసం చూసిన వాళ్లందరికీ ఆ ఏడాదో, ఆ మరుసటి ఏడాదో స్వరాజ్యం వస్తుందన్న నమ్మకం కలిగింది.
అప్పటికీ ఇప్పటికీ అందర్నీ వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సే ఉంది. ప్రజల మనసుల్లో అంతటి స్థానం సంపాయించాలంటే ఏమి చేయాలి? అసలంతటి విశ్వాసం ఎలా కలుగుతుందీ? ఆ విశ్వాసం ఎలా స్థిరంగా ఉంటుందీ? అచ్చంగా ఆ రూపంలో కాకపోయినా అస్పష్టంగా మనసుల్లో మిగిలే ఉన్నాయి.
గాంధీజీతో తిరుమల రామచంద్ర..
గాంధీజీ బళ్లారి వచ్చి వెళ్లిన 15 ఏళ్ల తర్వాత హరిజనోద్యమంలో గాంధీజీతో ఒక రాత్రి ఒకే కారులో ప్రయాణించిన మన తెలుగువాడు తిరుమల రామచంద్ర. అప్పటికే దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మద్రాసుకు వెళుతూ మద్రాసు ఇంకా ఎన్ని మైళ్లు అని గాంధీజీ తిరుమల రామచంద్రను అడిగారట. దానికి నలబై మైళ్లు అని చెప్పారట. అయితే తానో కునుకు తీస్తానని, మద్రాసు పొలిమేర్లలో లేపండని చెబుతూ గాంధీజీ నిద్రపోయారు. కారు వేగంగా పోగలిగేదే కాని ముందు వెనుకల నుంచి వస్తున్న లారీల నుంచి ప్రమాదం జరక్కుండా నెమ్మదిగా కారును నడిపారు. గంటంబావుకు మద్రాసు పొలిమేర చేరగానే మేల్కున్న గాంధీజీ మద్రాసు చేరామా అన్నారట. అందరూ ఆశ్చర్యపోయారట. లేపమని చెప్పిన వ్యక్తి దిగ్గున లేచి కూర్చోవడంతో ఆశ్చర్యపోయారు. గాంధీజీ 1932-33లో మద్రాసులో ఓ నెలపాటు ఉన్నారు.
గాంధీజీ స్థితప్రజ్ఞడు. మనసు స్వాధీనంలో ఉన్నవారు, నియమపాలనలో ఆయను ఆయనే సాటి.
గడ్డిపోచలను గండుమగలుగా మలచిన గాంధీజీ అకస్మాత్తుగానో, కాకతాళీయంగానో మహానాయుకునిగా ఎదగలేదు. బాల్యం నుంచి క్రమశిక్షణ, సత్యనిష్ట, సేవాదృష్టి, భగవదర్పణ భావంతో గడిపిన జీవితమే ఆయనను మహాయోధ్దగా, మహాసేనానిగా, జాతిపితగా తీర్చిదిద్దిందంటారు తిరుమల రామచంద్ర.
అటువంటి మహాత్మాగాంధీని యావత్ జాతి ఈవేళ (అక్టోబర్ 2) స్మరిస్తోంది.