‘సామాజిక ప్రయోజనమే జాషువా కవిత్వ ఆశయం’
129వ జయంతి సందర్బంగా మహాకవి గుర్రం జాషువాకు నివాళి
సామాజిక ప్రయోజనం కోసమే మహాకవి గుర్రం జాషువా కవిత్వం రాశాడని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు.
మహాకవి గుర్రం జాషువా 129వ జయంతిని పురస్కరించుకొని జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి పూల మాలలు అలంకరించే కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుటూ జాషువా కులం రీత్యా అనేక అవమానాలు ఎదుర్కొన్నా కుంగి పోలేదని కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని తిరగబడ్డాడని తెలిపారు. ఛీత్కారాలు ఎదురైన చోటే ఏ కవికీ జరగనన్ని సత్కారాలు పొందాడని గుర్తు చేశారు.తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి జాషువా కాలికి గండపెండేరం తొడిగారన్నారు. శాసన మండలి సభ్యులు కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మహాకవి గుర్రం జాషువా 129 వ జయంతిని జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోక పోవడం బాధాకరమన్నారు.కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ, నవ యుగు కవి చక్రవర్తి తదితర బిరుదులు, పురస్కారాలు ఎన్నో ఆయనను వరించాయన్నారు.
జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ నగరంలో జాషువా భవన్, జాషువా సమాధి సుందరీకరణ పనులు గత జగన్ ప్రభుత్వంలో ఎక్కడివక్కడ నిలిచి పోయాయన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలిచి పనులను పూర్తి చేసి మహాకవి జాషువాకి నివాళులు అర్పించాలన్నారు. గత జగన్ ప్రభుత్వానికి తెలుగు భాష, సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఎటువంటి గౌరవం, అవగాహన లేదన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పుసులూరి విజయ్ కుమార్, హైకోర్టు న్యాయవాది చందవోలు శోభారాణి, కాపు నాయకులు మాదా రాధా, జిలానీ, రాజపుత్ర సత్యంసింగ్, మెరిగల మణికుమార్, సంఘ సేవకులు బత్తుల కోటేశ్వరరావు, శంకూరి రాజారావు, పాగల్ల ప్రకాష్, ఎంజె జెఎస్ అధ్యక్షులు పినపాటి మోహనరావు, గడ్డం ఎలీషా దాసరి జాన్ బాబు, అటోట జోసెఫ్, ప్రజా సంఘాల నాయకులు నల్లపు నిలాంబరం, ప్రముఖ న్యాయవాది వైకే,తాటికొండ నరసింహారావు, వీరమణి, పద్య గాయకులు బాబురావు, చంద్రపాల్, హార్మోనిస్ట్ సలీంబాబు తదితరులు పాల్గొన్నారు.