
MAHARASTRA | ఫడ్నవీస్ కోసం ఏపీలో మడేలయ్య’కు పూజలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన పది కాలాలు సంతోషంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ లోని రాచర్లలో ‘మడేలయ్య’ గుడిలో పూజలు చేశారు రజకులు.
ప్రజల మనస్సుల్లో ఒక నాయకుడు జీవిత కాలం ఉండాలంటే ఏదో ఒక మంచి పని చేయాలి. సాయం పొందిన వారు జీవితాంతం గుర్తు పెట్టుకునే విధంగా ఆ పని ఉండాలి. అప్పుడు ఆ నాయకుడు ప్రజల మనిషి అవుతాడు. సాయం పొందిన వారికే కాకుండా వారి చుట్టు పక్కల వారికి కూడా దేవుడు అవుతాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఫడ్నవీస్ ఆంధ్రప్రదేశ్ లోని కొందరికి దేవుడి కంటే ఎక్కువయ్యారు. ఎందుకు అలా జరిగింది. ఏమిటా కథ...
భారతదేశంలోని 16 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నారు. మహారాష్ట్రకు గతంలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్రలోని రజకులను కూడా ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి చేశారు. అందుకు సంబంధించిన ఫర్మాలటీస్ అన్నీ పూర్తి చేసి కేంద్రం ఆమోదం కోసం పంపించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనపై సమగ్ర నివేదిక కోసం వెనక్కు పంపింది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా దిగిపోవడంతో రజకుల ఎస్సీ రిజర్వేషన్ ప్రయత్నాలు ఆగిపోయాయి.
భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు ప్రస్తుత మహారాష్ట్రలోని రజకులు (దోభీ) ఎస్సీ జాబితాలో ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా సెంట్రల్ ప్రావిన్స్ లో ఉన్న మహారాష్ట్రలో రజకులు ఎస్సీ జాబితాలోనే ఉన్నారు. మహారాష్ట్ర ఏర్పడ్డ తర్వాత అప్పట్లో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్యూల్డ్ కులాల జాబితాలో రజకులకు అవకాశం కల్పించకపోవడంతో, ఆ రాష్ట్రంలోని రజకులు సుదీర్ఘకాలంగా ఎస్సీ రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ముగిసిన మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి విజయం సాధించడంతో ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవ్వాలని రజక ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎనుముల పుల్లయ్య తమ కుల దైవం మడేలయ్య స్వామికి మొక్కుకున్నారు.
ఫడ్నవీస్ పేరు ముఖ్య మంత్రి పీఠానికి ఖరారు కావడంతో రాచర్లలోని చెరువు కట్టపై ఉన్న మడేలయ్య స్వామి గుడికి స్థానిక రజకులు చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయంలో పూజలు చేసి మళ్లీ మా కులం వారికి మంచి రోజులు వచ్చాయని, ఈ సారి తప్పకుండా రజకులు మహారాష్ట్రలో ఎస్సీ జాబితాలోకి మారుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాచర్లలో సుమారు వంద కుటుంబాల రజకులు ఉంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా రజకులు ఎక్కువగానే ఉన్నారు. ఈ సందర్భంగా ఎనుముల పుల్లయ్య మాట్లాడుతూ మహారాష్ట్రలో రజకులకు మంచి రోజులు వచ్చాయని అందుకే, ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారని, మహారాష్ట్ర రజకుల చిరకాల ఎస్సీ రిజర్వేషన్ వాంఛ నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మడేలయ్య దేవుని పూజా కార్యక్రమంలో నగరికంటి సింగరయ్య, రమేష్, అంకయ్య, వెంకటేశ్వర్లు, రమణ తదితరులు పాల్గొన్నారు. వీరంతా రజక సంఘంలో ఉన్న నాయకులు.