
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
ఆంధ్రాకి ముంచుకొస్తున్న తుపాను, ఈ వారమంతా వర్షాలే..
ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ కి తుపాను ముప్పు పొంచి ఉంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో అల్పపీడనాలు, తుపాన్లు ఏర్పడడం సహజమే అయినా ఈసారి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత ఎక్కువగా ఉంది. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపిన దాని ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. శనివారం నాటికి వాయుగుండంగా, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశముందని పేర్కొంది. తర్వాత సోమవారం నాటికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని అంచనా వేసింది. ఇది తుపానుగా మారితే ‘మొంథా (మొన్‌థా)’గా ఐఎండీ నామకరణం చేయనుంది. దీన్ని థాయ్‌లాండ్ సూచించింది.
దీని ప్రభావంతో రాబోయే అయిదు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. శనివారం బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, ఆదివారం గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.
సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
శుక్రవారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, అనకాపల్లి, గుంటూరు తదితర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా ప్రకాశం జిల్లా పాకాలలో 152.25 మి.మీ. వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలు, వరదల హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ తెలిపింది. అవసరమైతే తప్ప బయటి ప్రయాణాలు పెట్టుకోవద్దని, జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సలహా ఇచ్చింది.
Next Story

