విజయసాయిరెడ్డి అండ్ కోపై వేట ప్రారంభం
విదేశాలకు పారిపోతారేమో అని విజయసాయిరెడ్డి, అరబిందో ఓనర్ శతర్‌చంద్రారెడ్డి, వైవి కుమారుడుపై లుక్‌అవుట్ నోటీసులు జారీ.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ కీలక నాయకులపై దృష్టి పెట్టింది. వరుసగా వారిపైన కేసులు నమోదు చేస్తూ లుక్‌అవుట్(ఎల్‌వోసీ)నోటీసులు జారీ చేస్తున్నారు. ఇది వరకు సజ్జల రామకృష్ణారెడ్డిపైన ఈ నోటీసులను జారీ చేసిన ప్రభుత్వం తాజాగా మరో ముగ్గురిపైన జారీ చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, రాజ్య సభ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు వైఎస్‌ఆర్‌సీపీ మరో సీనియర్ నాయకుడు, రాజ్య సభ ఎంపీ, మాజీ సీఎం జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి, అరబిందో సంస్థ యజమాని పెనక శరత్‌చంద్రారెడ్డిపైన ఆంధ్రప్రదేశ్ సీఐడీ లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ సర్క్యులర్‌ను జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ. 3,600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీ రావు) నుంచి గత జగన్ ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ వీరి ముగ్గురిపైన కేసు నమోదైంది. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కేవీ రావును బెదిరించి, భయపెట్టి వాటాల్లో అధిక శాతం షేర్లను అరబిందో కంపెనీ పరం చేశారని ఈ ముగ్గురిపైన ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలో సీఐడీ నమోదు చేసిన కేసులో విజయసాయిరెడ్డి, విక్రాంత్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డిలు నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ ముగ్గరిపైన లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.