అబ్బబ్బా… ఈ రొయ్య మీసాలు చూడండి, ఎంతపొడవో!
x

అబ్బబ్బా… ఈ రొయ్య మీసాలు చూడండి, ఎంతపొడవో!

అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌లో అరుదైన రొయ్య సందడి


మానవ చరిత్రలో మీసాలకు, గడ్డాలకు ఎంత చరిత్ర ఉందో తెలియదు గాని మనకు మాత్రం ఓ సామెత ఉంది.. వీడికీ ఉన్నాయిరా 'రొయ్యకున్నంత మీసాలు' అనే సామెత. దీన్ని ఏ సందర్భంలో వాడారో కాని ఇప్పుడు అంతర్వేదిలో దొరికిన రొయ్య మీసాలు మాత్రం బారెడు పొడవున ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

మీటరున్నర పొడవైన మీసాలతో, బారుగా మెరిసిపోతున్న ఈ రొయ్య ఒక్కసారిగా అంతర్వేది తీరాన్ని ఆకట్టుకుంది. డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌కు మత్స్యకారులు తీసుకొచ్చిన ఈ అరుదైన లాబ్‌స్టర్‌ను చూడటానికి జనం గుమిగూడారు. సాధారణంగా వలకు చిక్కే రొయ్యలకంటే పూర్తిగా భిన్నంగా, పొడవాటి మీసాలతో రాజసం ఉట్టిపడేలా కనిపించిన ఈ సముద్ర జీవి అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకట్టుకుంది.
“ఇలాంటి రొయ్య (లాబ్ స్టర్) చాలా అరుదుగా వలకు పడుతుంది. దీని మీసాలే దీని ప్రత్యేకత” అని మత్స్యకారులే ఆశ్చర్యంతో చెప్పారు. కొంతమంది సెల్‌ఫోన్లతో ఫొటోలు తీసుకుంటూ, మరికొందరు దగ్గరకు వెళ్లి చూస్తూ తిలకిస్తూ కనిపించారు. సముద్రంలో రోజూ వేటకు వెళ్లే మత్స్యకారులకే ఆశ్చర్యం కలిగించిన ఈ లాబ్‌స్టర్‌, ఈ రోజు హార్బర్‌కు వచ్చినవారికి చిన్న సంబరంలా మారింది.
ఈ రొయ్య కూర కూడా చాలా రుచిగా ఉంటుందని, మార్కెట్లో ఒక్కోటి రూ.500 నుంచి రూ.800 వరకు ధర పలుకుతుందని మత్స్యకారులు తెలిపారు. థాయ్‌లాండ్, లావోస్, చైనా వంటి దేశాల్లో వీటికి మంచి గిరాకీ ఉంటుందని చెప్పారు. అందుకే ఇలాంటి అరుదైన లాబ్‌స్టర్‌ వలకు చిక్కితే మత్స్యకారులకు అదో అదృష్టంగా భావిస్తారు. ఇలా ఎప్పుడో ఒకసారి వలకు చిక్కే ఈ వింత జీవులు, మత్స్యకారుల జీవితంలో చిన్న ఆనందాన్ని, ఆసక్తిని తీసుకొస్తాయి. అంతర్వేది తీరంలో ఆ రోజు ఈ ‘బారు మీసాల లాబ్‌స్టర్‌’ అదే చేసింది.
Read More
Next Story