
మహిళా ఆటోలో ప్రయాణించిన లోకేష్
ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఆటో డ్రైవర్లు నవ్వుతూ పలకరిస్తారని నారా లోకేష్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ’ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సందర్భంగా, మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తుచేస్తూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. లోకేష్ తన ప్రసంగంలో ఆటో డ్రైవర్ల జీవిత శైలి, వారి చిరునవ్వు వెనుక దాగిన కష్టాలు, ప్రభుత్వ హామీల అమలు వంటి అంశాలును ప్రస్తావించారు.
ఆటో డ్రైవర్ల చిరునవ్వు వెనుక కష్టాలు..
మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ‘ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ పలకరిస్తారు ఆటో డ్రైవర్లు. నేను కూడా ఆటో వెనుక కొటేషన్లు చదువుతూ ఉంటా. అవి చదువుతూ ఉంటే వారి మనస్సు ఏంటో అర్థమవుతుంది‘ అని తెలిపారు. ఆటో డ్రైవర్లు గ్రామస్థాయి నుంచి దేశవ్యాప్త రాజకీయాలు చర్చిస్తారని, వారి జీవితంలోని చిన్న చిన్న అంశాలు కూడా ప్రభుత్వానికి ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. మరి ముఖ్యంగా ‘ఆటోలో ఏ వస్తువు మరిచిపోయినా పోలీసులకు ఇస్తారు‘ అంటూ ఆటో డ్రైవర్ల నిజాయితీని ప్రశంసించారు.
యువగళం పాదయాత్ర హామీలు అమలు..
‘యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చినట్లుగా ఆటో డ్రైవర్లను ఆదుకొనేందుకు ముందుకొచ్చాం‘ అని లోకేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గించామని, ఆటో డ్రైవర్ల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా, ‘రూ. 2 వేల కోట్లు ఖర్చు పెట్టి గుంతలకు మరమ్మతులు చేశాం‘ అంటూ రోడ్ల మరమ్మత్తు పనులను ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఆటో, మాక్సీ క్యాబ్ డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.15 వేల చొప్పున సహాయం అందుతుందని, మొత్తం రూ.436 కోట్లతో 2.90 లక్షల మంది ప్రయోజనం పొందుతారని గుర్తు చేశారు.
అంతకు ముందు ఆయన మహిళా ఆటో డ్రైవర్ ఆటోలో ఎక్కారు, ఉండవల్లి నుంచి విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు ఆటోలోనే ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యలు, వారి జీవన శైలి, వారి కుటుంబాలు, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
Next Story