వేదిక మీదకు లోకేష్
x

వేదిక మీదకు లోకేష్

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వేదికపై ఉంటారా? ఉండరా అనే సందేహం చాలా మందిలో ఉంది.


అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేదికపై లోకేష్ ఉంటారని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడిగా లోకేష్ వేదిక మీదకు వస్తారని, ఆయన మానవ వనరులు, టెక్నాలజీ శాఖల మంత్రిగా ఉన్నందున అవకాశం ఉంటున్నట్లు చెబుతున్నారు. గతంలో విశాఖ వేదికపైకి కూడా ప్రధాన సభలో లోకేష్ పాల్గొన్నారు. లోకేష్ వివిధ కంపెనీలతో సత్సంబంధాలు నెలకొల్పుతూ అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు తీసుకొస్తున్నారు. అందువల్ల ఆయన ప్రజెంట్ అవసరమనే భావనను సీఎం వద్ద కొందరు పార్టీ పెద్దలు వ్యక్తం చేసినట్లు సమాచారం.

మొదట అమరావతి ఇన్విటేషన్ లో ప్రధాన మంత్రి పేరుతో పాటు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పేర్లు మాత్రమే వేశారు. ఆ తరువాత జనసేన క్యాడర్ నుంచి వ్యతిరేకత రావడం, పవన్ కల్యాణ్ ను కరివేపాకులా వాడుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకోవడంతో ఆలోచించిన ప్రభుత్వం రెండో సారి రూపొందించిన ఇన్విటేషన్ కార్డులో పవన్ కల్యాణ్ పేరును చేర్చింది. ఈ కార్డులు ముఖ్యమైన వారికి అధికారులు అందజేస్తారు. కూటమిలో మంచి వాతావరణం ఉండాలంటే తప్పకుండా పవన్ కల్యాణ్ పేరు కూడా ఉండాలని భావించిన సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అడ్వర్టైజ్ మెంట్లలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పక్కన లోకేష్ ఫొటోను కూడా చేర్చారు. అంటే వేదికపై ఆయన కూడా తప్పకుండా ఉంటారని అధికారులు, పాలకులు చెప్పకనే చెప్పారు. ఇప్పటి వరకు లోకేష్ వేదికపై ఉంటారా? ఉండరా? అనే చర్చ సాగింది. అడ్వర్టైజ్ మెంట్లో ఫొటోను చేర్చడంతో తప్పకుండా వేదికపై ఉంటారని నిర్థారణ అయింది.

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం సభలో వేరొక వేదికపై కూర్చొనే అవకాశం కల్పించింది. సుమారు 30 మంది రైతులను వేరొక వేదికపై కూర్చొనేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. రైతులకు ఇంటింటికీ ఆహ్వానాలు పంపించి పిలిపిస్తున్నారు. వారికి వేదిక వద్ద ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయడం ద్వారా సముచితంగా సభ వద్ద గౌరవించినట్లు అవుతుందని సీఎం అధికారులకు సూచించారు.

Read More
Next Story