సోము వీర్రాజు  నామినేషన్ కు హాజరు కాని లోకేష్
x

సోము వీర్రాజు నామినేషన్ కు హాజరు కాని లోకేష్

కూటమిలో ఎమ్మెల్సీలుగా ఐదుగురు నామినేషన్ దాఖలు చేశారు. నలుగురు నామినేషన్ లకు హాజరైన లోకేష్ బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు నామినేషన్ కు హాజరు కాలేదు.


శాసన సభ్యుల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో వేడి పుట్టించాయి. మొత్తం ఐదు స్థానాలు ఖాళీ కాగా అందులో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలు, జనసేన ఒక స్థానం, బీజేపీ ఒక స్థానంలో పోటీ చేశాయి. మొదట నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, ఒక స్థానంలో జనసేన పోటీ చేస్తాయని అందరూ భావించారు. నామినేషన్ల గడువు ముందు రోజు తమకు ఒక స్థానం కావాలని బీజేపీ కోరటంతో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ కేంద్ర పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎదురు చూడాల్సి వచ్చింది.

తెలుగుదేశం పార్టీ తరపున ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరుకు చెందిన బీద రవిచంద్ర యాదవ్, కర్నూలు జిల్లాకు చెందిన బీటీ నాయుడు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కావలి గ్రీష్మ లను అభ్యర్థులగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. బీటీ నాయుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తి అవుతున్నందున ఆ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావులు పదవీ విరమణ చేస్తుండగా, జంగా కృష్ణమూర్తి వైఎస్సార్ సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతూ పదవికి రాజీనామా చేశారు. మొత్తం ఐదు స్థానాల్లో బీటీ నాయుడుకు స్థానం దక్కింది. మిగిలిన నలుగురు కొత్త వారిని ఎంపిక చేశారు. జనసేన పార్టీ నుంచి నాగబాబును ఎంపిక చేయగా బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎంపికయ్యారు. నాగబాబు రెండు రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన నలుగురు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.

సోము వీర్రాజు నామినేషన్ కు హాజరు కాని లోకేష్

జనసేన అభ్యర్థి కె నాగబాబు, టీడీపీ అభ్యర్థులు నాయుడు, రవిచంద్ర, గ్రీష్మల నామినేషన్ లకు హాజరైన లోకేష్ బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు నామినేషన్ కు హాజరు కాలేదు. ఇది ప్రస్తుతం చర్చగా మారింది. సోము వీర్రాజు నామినేషన్ చివరి 15 నిమిషాల ముందు దాఖలు చేశారు. సెక్రటేరియట్ లోనే ఆ సమయంలో ఉన్నప్పటికీ లోకేష్ హాజరు కాలేదని, నలుగురికి హాజరై ఒకరికి హాజరు కాకపోవడం అంటే సోము వీర్రాజు వ్యవహారంపై లోకేష్ కాస్త కినుక వహించారే ప్రచారం జరుగుతోంది.

గతంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారనే అనుమానం

సోము వీర్రాజు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను సమర్థించారనే ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీ కూడా బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించింది. దాంతో కొంత అనుకూలత ఉంటే ఉండొచ్చు కానీ బీజేపీ వారికి, వైఎస్సార్సీపీకి ఎటువంటి సంబంధం లేదనే వాదన బీజేపీ వారిలో ఉంది. సోము వీర్రాజు లోకేష్ ను పరిగణలోకి తీసుకునే వారు కాదని, అందుకే ఆయన నామినేషన్ దాఖలు సమయంలో రాలేదని పలువురు ఎమ్మెల్యేలు చర్చించుకోవడం విశేషం. అయతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాత్రం నామినేషన్ సమయంలో సోముతో ఉన్నారు. వీర్రాజు నామినేషన్ పత్రాలు తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలోనే కూర్చుని సరిచూసుకున్న తరువాత నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు. జనసేన, టీడీపీ అభ్యర్థుల విషయంలో తీసుకున్న చొరవ బీజేపీ అభ్యర్థి విషయంలో లోకేష్ తీసుకోలేదంటే ఏదో మతలబు ఉండి ఉంటుదనే అనుమానం ప్రజల్లో ఉంది. సోము మాత్రం నామినేషన్ వేసిన తరువాత సెక్రటేరియట్ లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

అసంతృప్తి వాదులకు నచ్చ జెప్పే పనిలో లోకేష్

మంగళవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. అందరి నామినేషన్లు ఓకే కావడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెప్పొచ్చు. తమకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం వస్తుందని భావించిన చాలా మంది సీనియర్లు భంగపోయారు. ప్రధానంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ వి సత్యనారాయణ వర్మ తనకు అవకాశం ఉంటుదని నామినేషన్ పత్రాలు కూడా రెడీ చేసుకున్నారు. ఆయనకు టిక్కెట్ రాపోవడంతో నియోజకవర్గంలోని ఆయన అభిమానులు, పార్టీ నాయకులు కూడా ఆశ్చర్య పోయారు.

నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ధ కొన్ని ఫైల్స్, కాగితాలు తగులబెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వర్మ అభిమానులు బూతులు తిట్టారు. నినాదాలు చేశారు. ఆదివారం కాస్త ఆవేశానికి గురైన వర్మ సోమవారం కామ్ అయ్యారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానని చెప్పారు. అయితే వర్మ గతంలోనూ తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పిఠాపురం నుంచి గెలిచారు. ఆయనకు కాపుల్లో ఎక్కవ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. ఆయనకు నచ్చ జెప్పేందుకు రంగంలోకి దిగిన టీడీపీ పెద్దలు సక్సెస్ అయ్యారు.

ఇక మిగిలిన సీనియర్ నాయకులకు కూడా లోకేష్, చంద్రబాబు నాయుడు చెప్పారంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ లు చేసి వారికి నచ్చ జెప్పారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుకు పూర్తి స్థాయిలో కోరలు పీకేశారు. లోకేష్ కనుసన్నల్లోనే ఇవి జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

Read More
Next Story