లోకేష్‌ నాతో పోటీ పడడమంటే చాలా కష్టం
x

లోకేష్‌ నాతో పోటీ పడడమంటే చాలా కష్టం

కొన్ని విషయాల్లో తన కంటే తన మనవడు దేవాన్‌‡్ష ఫాస్టుగా ఉంటాడని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


టెక్నాలజీలో తన కంటే తన కుమారుడు మంత్రి నారా లోకేష్‌ మెరుగ్గా ఉంటారని, అయినా లోకేష్‌ తనతో పోటీ పడడమంటే చాలా కష్టమని సీఎం చంద్రబాబు అన్నారు. తాను థియరిటికల్‌ పర్సన్‌నని, విజన్‌ ఉందని పేర్కొన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ బ్యాక్‌ గ్రౌండ్, స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్శిటీ ఎంబీఏ పట్టా లోకేష్‌కు అడ్వాంటేజ్‌ అని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన గురుపూర్ణిమ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కన్నా చదివిస్తే ఊహించనంత ఎత్తుకు ఎదుగుతారని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఓ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫాం ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల పాత స్టూడెంట్‌తో పాటు తల్లిదండ్రులను అందులో భాగస్వామ్యం చేయాలని సూచించారు. తాను రాజకీయాలపై ఫోకస్‌ పెట్టిన ప్రతిసారీ గెలిచానని వెల్లడించారు.

ప్రజలకు మరింత మేలు కలిగేలా పని చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రం సాయంతో ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు. తన ప్రయత్నాలకు ఉపాధ్యాయుల సహకారం అవసరమని, టీచర్ల చేతుల్లోనే భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఏ విషయంలోనైనా కాస్తో కూస్తో నిర్లక్ష్యం చేస్తానేమో కానీ, విద్యాశాఖను మాత్రం నిర్లక్ష్యం చేయనని వెల్లడించారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం పెట్టాను.. వివాదాలు లేకుండా అద్భుతంగా డీఎస్సీ నిర్వహించారని వెల్లడించారు. ఒకప్పుడు విద్యా వ్యవస్థ జెడ్పీ ఛైర్మన్ల చేతుల్లో ఉండేది. ట్రాన్సఫర్ల కోసం ఉపాధ్యాయులు జెడ్పీ ఛైర్మన్ల ప్రాపకం కోసం వెళ్లేవారు. విధిలేని పరిస్థితుల్లో టీచర్లు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేవారు. టీచర్లు ఆత్మగౌరవం దెబ్బతినకూడదని టీచర్ల ట్రాన్సఫర్లల్లో తొలిసారి కౌన్సిలింగ్‌ విధానం తెచ్చినట్లు తెలిపారు. బ్రిడ్జి స్కూళ్లు పెట్టాం... బడికిపోదాం కార్యక్రమం పెట్టాం. ఇప్పుడు తల్లికి వందనం ద్వారా పేద విద్యార్థులకు చదువు అందేలా చేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో చక్కటి సంస్కరణలు తెచ్చాం. రాజకీయ నేతల పేర్లను పెట్టకుండా విద్యా వ్యవస్థను పవిత్రంగా ఉంచుతున్నట్లు చెప్పారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ వంటి పేర్లతో రాజకీయాలకతీతంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం శుభ పరిణామమని వెల్లడించారు. పిల్లలకు పుస్తకాల బరువు తగ్గేలా నో బ్యాగ్‌ డే ప్రవేశపెట్టామన్నారు. పిల్లలకు విద్యాబుద్దులతో పాటు విలువలు నేర్పాలి. సంపదతో పాటు విలువలు కాపాడుకోగలిగితే అన్నింటిలోనూ అగ్ర భాగాన ఉండగలమన్నారు. జీతాలిస్తున్నాం కానీ ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టలేదని, ఇబ్బంది రానివ్వనని సీఎం చంద్రబాబు చెప్పారు. ఉద్యోగులు, టీచర్లు ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో అవన్నీ రానున్న రోజుల్లో అందించే బాధ్యత తీసుకుంటామన్నారు.
ఒకప్పుడు ఐటీ అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు ఐటీ రియాల్టీ అని పేర్కొన్నారు. టీచర్లు ఐటీ నాలెడ్జ్‌ కూడా పెంచుకోవాలి, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఏఐ వంటి టూల్స్‌ ఉపయోగించి విద్యార్థులకు చాలా నేర్పించవచ్చన్నారు. క్వాంటం కంప్యూటింగ్‌ తెస్తున్నాం... క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌ లో మార్పులు చేసుకోవాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. కొన్ని విషయాల్లో నాకంటే నా మనవడు దేవాన్‌‡్ష ఫాస్టుగా ఉంటాడని వెల్లడించారు. అలాగే టెక్నాలజీ విషయంలో మీకంటే... పిల్లలు వేగంగా ఉంటే.. అది టీచర్లకు ఛాలెంజ్‌ లాంటిందన్నారు. యువత అవసరాలను ప్రస్తుత ట్రెండ్సును తెలుసుకుంటూ అప్డేట్‌ కావడం నాకూ.. మీకూ అవసరమని, థియరీనే కాకుండా వినూత్నమైన ఆలోచనలతో చదువు చెప్పాలని సూచించారు.
టీచర్ల బాగోగులు చూసుకునే బాధ్యత తనదని, విద్యార్థుల బాధ్యత టీచర్లది అని చంద్రబాబు అన్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దాలి. తన కంటే వేరే రాష్ట్రం మెరుగ్గా ఉంటే నేను తట్టుకోలేనని పేర్కొన్నారు. ఎప్పుడూ రాష్ట్రాన్ని నెంబర్‌–1గా ఉండాలనే కోరుకుంటున్నాను. రాష్ట్రాన్ని నెంబర్‌–1గా చేసేందుకు అవసరమైన వసతులు కల్పించే బాధ్యత నాది. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత టీచర్లది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు గురుపూజోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి అవార్డులు ప్రదానం చేశారు.
Read More
Next Story