కేబినెట్‌లో సెంటర్‌ ఆఫ్‌ ద అట్రాక్షన్‌గా లోకేష్‌
x

కేబినెట్‌లో సెంటర్‌ ఆఫ్‌ ద అట్రాక్షన్‌గా లోకేష్‌

మెగా డీఎస్సీ బాగా నిర్వహించారంటూ మంత్రి నారా లోకేష్‌ను మంత్రి వర్గ సమావేశంలో మంత్రులు అభినందించారు.


కేబినెట్‌ సమావేశంలో మంత్రి నారా లోకేష్‌ సెంటర్‌ ఆఫ్‌ ద అట్రాక్షన్‌గా నిలిచారు. మంత్రులు అందరూ నారా లోకేష్‌ మీద ప్రశంసల వర్షం కురిపించారు. మెగా డీఎస్సీ సమర్థంగా నిర్వహించారంటూ మంత్రులందరూ లోకేష్‌కు అభినందనలు తెలిపారు. మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు కోర్టుల్లో 72 కేసులు వేసినా ప్రతి సమస్యను ఒక సవాల్‌గా స్వీకరించారని, వాటిని అన్నింటిని ధీటుగా ఎదుర్కొంటూనే వెనకడుగు వేయకుండా అనుకున్న ప్రకారం మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించారని మంత్రులు అందరూ లోకేష్‌ మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఇదే సందర్భంలో పోలీసు శాఖలో పని చేస్తున్న చాలా మంది కానిస్టేబుళ్లు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారనే దానిపైన మంత్రుల మధ్య చర్చకు వచ్చింది. దాదాపు 400 మంది పోలీసులు మెగా డీఎస్సీకి ఎంపికై ఉంటారని మంత్రులు అంచనాకు వచ్చారు. అయితే పోలీసులు ఇలా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న నేపథ్యంలో ఏర్పడే ఖాళీలను త్వరగా భర్తీ చేయాలనే అంశంపైన కూడా చర్చించారు. ఈ క్రమంలో ఉత్పన్నమయ్యే న్యాయపరమైన సమస్యలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని, వాటిని పరిష్కరించుకుంటూనే పోలీసు పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని మంత్రి లోకేష్‌ ప్రస్తావించినట్లు సమాచారం.

గత రెండు కేబినెట్‌ సమావేశాల్లోను మంత్రి నారా లోకేష్‌ సెంటర్‌ ఆఫ్‌ ద అట్రాక్షన్‌గానే నిలిచారు. తన యువగళ పాదయాత్రకు సంబంధించిన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకొచ్చి ఆందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సాక్షాత్తు ప్రధాని చేతుల మీదుగా దానిని ఆవిష్కరింప చేసుకున్నారు. ఆ సందర్భంగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో మంత్రులందరూ లోకేష్‌ను అభినందించారు. తర్వాత ఇటీవల జరిగిన మరో కేబినెట్‌ సమావేశంలో కూడా లోకేష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేల గురించి కేబినెట్‌లో ప్రస్తావించి, చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని సున్నితంగానే టీడీపీ ఎమ్మెల్యేలందరికీ లోకేష్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఆరోపణలు పునరావృతమైతే చర్యలు తప్పవనే వార్నింగ్‌ అందరికీ ఇచ్చారు. ఆ సందర్భంగా కూడా లోకేస్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.


Read More
Next Story