
తలరాతలు మార్చుతున్నారు..కీప్ ఇట్ అప్
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొంత మంది టీచర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై ప్రశంసల జల్లులు కురిపించారు. వినూత్న రీతిలో పాఠాలు చెబుతూ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచిన ఆమె కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఇంతకీ సంగతేంటంటే.. మంత్రి నారా లోకేష్ మండపేట శారదా మున్సిపల్ పాఠశాలలో SGT గా పనిచేస్తున్న అమలదాసు కావేరిని ప్రశంసిస్తూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘ప్రయత్నమే తొలి విజయం అని భావించిన మండపేట శారదా మున్సిపల్ పాఠశాలలో ఎస్జీటీ అమలదాసు కావేరి గారికి అభినందనలు.
జీరోగా ఉన్న విద్యార్థుల సంఖ్యను 11కి చేర్చిన మీకు హ్యాట్సాఫ్. పిల్లల వయసు, ఆలోచనలకి తగ్గట్లు వినూత్నమైన బోధనా పద్ధతులతో పాఠాలు చెబుతున్న తీరు చాలా బాగుంది. ఆటపాటలతో చదువు నేర్పిస్తూ, నైతిక విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, దేశభక్తిని బోధించడం చాలా సంతోషం. ఎఫ్ఎల్ఎన్, టీఎల్ఎమ్, రీల్స్ తయారు చేసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం ప్రశంసనీయం. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కిచెన్ గార్డెన్ అభివృద్ధి చేసిన మీ కృషి చాలామందికి స్ఫూర్తినిస్తుంది’ అని రాసుకొచ్చారు.
అంతకు ముందు ఓ పోస్టులో.. పిడుగురాళ్ల మండలం, తుమ్మలచెరువు మెయిన్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్న షేక్ ఫిరోజ్ భాషాపై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు నవంబర్ 8వ తేదీన తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ప్రతి రోజూ ఉదయం ముందుగా స్కూలుకు వెళ్లి, సాయంత్రం అదనపు సమయం స్కూలులోనే ఉంటూ విద్యార్థులకు క్లాసులు తీసుకునే మీ కమిట్మెంట్‌కు హ్యాట్సాఫ్. మీరు పిల్లలకు నేర్పిన తెలుగు, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ డిజిటల్ ప్రింటింగ్‌లా అందంగా ఉంది. పిల్లలకు వివిధ సబ్జెక్టుల్లో ఉన్న భయాలను పోగొట్టేందుకు, వారిలో ఒకరిగా కలిసిపోతూ ఆటపాటలతో విద్యా బోధన చేస్తున్న షేక్ ఫిరోజ్ భాషా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. స్కూల్లో ప్రస్తుతం 200 మంది పిల్లలు చదువుతుండడం గొప్ప విషయం’ అని పేర్కొన్నారు.

