
లోకేష్ కథలు కూడా బాగా చెబుతారు
టీచర్లలో స్పూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్న మంత్రి నారా లోకేష్.
మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయుల్లో గురు భావాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యా శాఖ మంత్రిగా ఆయన సమాజంలో గురువులకు లభించే గొప్ప కీర్తిని, గొప్పతనాన్ని చెబుతూ ఉపాధ్యాయులలో స్పూర్తిని నింపేందుకు బీజాలు వేస్తున్నారు. గురువారం మెగా డీఎస్సీ కార్యక్రమంలో కూడా అదే చేశారు. చరిత్రలో జరిగిన ఓ వాస్తవ సంఘటనను ఓ కథలా చెప్పే ప్రయత్నం చేశారు. దీని కోసం ఆయన స్టోరీ టెల్లర్‌గా మారారు. లోకేష్ ఏమి చెప్పారంటే..
మెగా డీఎస్సీలో ఎంపికైన గౌరవనీయులైన గురువులారా.. ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక గురువుకు దక్కిన అపూర్వమైన గౌరవం గురించిన కథ. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. 1996, అక్టోబర్ 3వ తేదీన ఈ సంఘటన జరిగింది. అప్పటి భారత రాష్ట్రపతి, గౌరవనీయులైన డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు ఒమన్ దేశంలో అధికారిక పర్యటనకు వెళ్లారు.
మస్కట్ విమానాశ్రయంలో ఊహించని ఓ సంఘటన జరిగింది. ఒమన్ రాజు, సుల్తాన్ ఖబూస్ బిన్ సైద్ గారు స్వయంగా విమానాశ్రయానికి వచ్చేశారు! ఒమన్ అధికారులంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో కంగారు పడిపోయారు. ఎందుకంటే, ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం రాజు గారు విమానాశ్రయానికి రావడం అసాధారణం. ‘మేమేమైనా తప్పు చేశామా?‘ అని అధికారులు భయపడ్డారు. గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, రాజు గారు ఎంతో ఆదరంగా డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారిని స్వాగతించారు. అంతటితో ఆగలేదు రాజు స్వయంగా తన కారును నడుపుకుంటూ, శర్మ గారిని రాజభవనానికి తీసుకెళ్లారు. ఇదంతా చూస్తున్న ఒమన్ అధికారులకు ఏమీ అర్థం కాలేదు. ప్రోటోకాల్ ఇలా ఉల్లంఘించడం ఏంటని వారు సీరియస్‌గా ఆలోచించారు. కానీ, రాజభవనానికి చేరాక నిజం తెలిసింది. ఒమన్ రాజు ఖబూస్ బిన్ సైద్ గారు గతంలో పూణేలో చదువుకున్నారు. ఆ సమయంలో వారికి పాఠాలు చెప్పిన గురువు ఎవరో తెలుసా? మన డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారే!
అదిగో, ఒక గురువు పట్ల శిష్యుడు చూపించిన గౌరవం! రాజు తన గురువును చూసి, ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి, స్వయంగా విమానాశ్రయానికి వచ్చి, కారు నడిపి తన గురువు పట్ల తనకు ఉన్న గౌరవాన్ని, భక్తిని, ప్రేమను, చూపించి ఆదరించారు. ఇది గురువుల గొప్పతనాన్ని చాటుతుంది కదా!
మన గురు కబీర్ దాస్ గారు ఒకమాట చెప్పారు.. అదేంటంటే.. దేవుడు, గురువు ఒకేసారి ఎదురుపడితే, మొదట గురువుకే నమస్కారం చేస్తానని. ఎందుకంటే, గురువే దేవుడి వైపు నడిపించే మార్గదర్శి. ఈ కథ మనకు గురువు యొక్క ఔన్నత్యాన్ని, శిష్యుడి గౌరవాన్ని చూపిస్తుంది. ఇలాంటి గురువులు మనకు స్ఫూర్తిగా నిలుస్తారు.. అంటూ మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయుల్లో స్పూర్తిని నింపే ప్రయత్నం చేశారు.
Next Story