వైజాగ్ స్టీల్ ప్లాంటుపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణిని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ఐదేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా వెనక్కి తగ్గకుండా ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తూనే ఉంది. మరోవైపు ఈ ఉక్కు కర్మాగారం కోసం భూములిచ్చిన నిర్వాసితులను, ఈ ప్లాంట్‌నే నమ్ముకుని విధులు నిర్వహిస్తున్న స్థానిక కాంట్రాక్టు కార్మికులను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తోంది. విశాఖ ఉక్కు నష్టాల్లో నడవడానికి కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణమని కేంద్రం చెబుతూ వస్తోంది. ఇదే వంకతో ఈ ప్లాంటులో పని చేస్తున్న సుమారు ఐదు వేల మంది నిర్వాసిత, కాంట్రాక్టు కార్మికులను కొన్నాళ్ల క్రితం ఉన్న ఫళంగా తొలగించింది. వీరిలో నిర్వాసితులు 1500 మంది, మిగిలిన వారు స్థానిక కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నెత్తీనోరూ మొత్తుకున్నా ప్లాంటు యాజమాన్యం ససేమిరా అంటోంది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు
ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించి..
దీంతో వీధినపడ్డ స్థానిక కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేస్తుంటే.. ప్లాంటు యాజమాన్యం దొడ్డిదారిలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పిస్తోంది. ఇలా గత మూడు నెలల్లో ఇప్పటి వరకు చత్తీస్‌గఢ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన 2500 మందికి పైగా కార్మికులను తీసుకొచ్చింది. వారితో స్టీల్ ప్లాంటులో వివిధ పనులు చేయిస్తోంది. పది నుంచి ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న కాంట్రాక్టు కార్మికులను తొలగించి ఏమాత్రం అనుభవం లేని (అన్ స్కిల్డ్) లేబర్‌తో పనులు చేయించడం ప్లాంటు ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అనుభవం లేని కార్మికులు అరగంటలో చేయాల్సిన పనిని రెండు మూడు గంటల పాటు చేస్తున్నారని ప్లాంటు శాశ్వత కార్మికులు చెబుతున్నారు. గతంలో రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌ల ద్వారా ఎంత ఉక్కు ఉత్పత్తి అయ్యిందో.. ఇప్పుడు మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు నడుస్తున్నా అంతే (రోజుకు 16 వేల టన్నులు) ఉత్పత్తి జరుగుతోందని వీరు పేర్కొంటున్నారు. దీనిని బట్టి ఉత్పాదకత ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
ప్రయోజనాలు ఎగ్గొట్టే ఎత్తుగడ..
విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు విధానంలో పని చేసే కార్మికులకు యాజమాన్యం నెలకు రూ.15 వేల నుంచి 20 వేల వరకు వేతనం చెల్లించేది. వీరికి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), ఈఎస్‌ఐ వంటి ప్రయోజనాలను కల్పించేది. అయితే ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులను ఇంటికి పంపేసి వారి స్థానంలో పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చిన కార్మికులకు రూ.500–600 చొప్పున రోజువారీ వేతనంగా ఇస్తోంది. వేతనాల్లో పెద్దగా మార్పు లేకపోయినా, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటివి చెల్లించే అవసరం తప్పుతోంది. ‘ప్లాంటు కోసం భూములిచ్చిన నిర్వాసిత కార్మికులను, దశాబ్దాలుగా ప్లాంటునే నమ్ముకుని పని చేస్తున్న మాలాంటి వారిని కాదని ఇతర రాష్ట్రాల లేబరుతో పని చేయించుకుంటోంది. భార్యాపిల్లలతో ఉన్న మమ్మల్ని యాజమాన్యం రోడ్డున పడేసింది’ అని ఉక్కులో తొలగింపునకు గురైన కాంట్రాక్టు కార్మికుడు ఎన్.నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశాడు.
గతంలో అలా.. ఇప్పుడు ఇలా..
దేశంలోని ఇతర ఉక్కు కర్మాగారాల సామర్థ్యానికి తగిన కార్మికుల సంఖ్యతో పోల్చుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో కార్మికుల సంఖ్య తక్కువ.. ఉత్పాదకత ఎక్కువ. ఇన్నాళ్లూ ఈ ప్లాంటుకున్న ఘనతగా దీనిని అంతా చెప్పుకునే వారు. సెయిల్‌తో పోల్చుకుంటే వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో మ్యాన్ పవర్ (కార్మికులు) తక్కువని పార్లమెంటులో గతంలోనే ప్రకటించారు. పైగా దేశంలోనే అత్యుత్తమ స్టీల్ ప్లాంటుగా దీనికి పేరు. అలాంటి ప్లాంటులో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందన్న సాకు చూపి యాజమాన్యం వేలాది కాంట్రాక్టు కార్మికులకు ఉద్వాసన పలికింది. అదే సమయంలో మరో రెండు వేల మంది శాశ్వత కార్మికులు/ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణతో ఇంటికి పంపేసింది.
ఇదెక్కడి న్యాయం?
‘7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న భిలాయ్ స్టీల్ ప్లాంటులో 11 వేల మంది కార్మికులు ఉన్నారు. అదే ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారంలో 6,500 మంది శాశ్వత కార్మికులున్నారు. అయినప్పటికీ ఇక్కడ పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను ఎక్కువ మ్యాన్ పవర్ ఉన్నారంటూ తొలగించడం అన్యాయం. పైగా వీరి పొట్టకొట్టి బీహార్, చత్తీస్‌గఢ్‌ల నుంచి 2500 మందికి పైగా లేబర్‌ను తీసుకొచ్చి ప్లాంటులో పనులు చేయిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారని తీసేసి అక్కడ నుంచి ఎందుకు తెస్తున్నారు? గతంలో శాశ్వత కార్మికులకు సహాయకారులుగా కాంట్రాక్టు కార్మికులుండే వారు. ఇప్పుడు పర్మినెంట్ కార్మికులు చేసే పనిని అనుభవం లేని ఇతర రాష్ట్రాల కాంట్రాక్టు లేబరుతో చేయిస్తున్నారు. దొడ్డిదారిన వచ్చిన కాంట్రాక్టర్లు స్టీల్ ప్లాంటును చెదపురుగుల్లా తినేస్తున్నారు. ఉక్కును నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అలవిమాలిన చర్యలు తీసుకుంటోంది’ అని విశాఖ స్టీల్ ప్లాంటు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రామస్వామి ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.