
కుల గణన లేకుండా స్థానిక ఎన్నికలు సాధ్యమేనా?
బీసీ కుల గణనకు కమిషన్ ను నియమించారా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లు (OBC Quota), స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతం ఒక కీలకమైన చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర హైకోర్టు సోమవారం బీసీ కుల గణనకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఈ అంశంపై మరింత ఉత్కంఠను రేకెత్తించింది.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే జనాభా ఆధారిత డేటా అవసరమని, అందుకు కుల గణన తప్పనిసరి అని హైకోర్టులో అఖిలభారత వెనకబడిన కులాల ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ గౌరవ అధ్యక్షుడు డా అలా వెంకటేశ్వర్లు తదితరులు పిటిషన్ వేశారు. నిజానికి అప్పటికే మరొక పిటిషన్ కూడా దాఖలయి ఉంది.ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు దాఖలు చేశారు.
డాక్టర్ వెంకటేశ్వర్లు దాఖలు చేసిన ఈ పిటిషన్ సోమవారం నాడు జస్టిస్ రవి చామలపాటి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. కులజనాభా నిర్ధారణ కోసం ఒక డెడికేటెడ్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందా అనే విషయం మీద కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు సకాలంలో జరిగే అవకాశాలు ఉన్నాయా? లేదా? అనే సందేహాలు పలువురిలో ఉన్నాయి.
పిటిషన్ విచారణలో కీలక మలుపు
రాష్ట్రంలో వెనకబడిన తరగతుల జనాభా 50 శాతం దాకా ఉందని, స్థానిక సంస్థల్లో బిసిల కోటా 29 శాతం నుంచి 34 శాతం మించలేదని డాక్టర్ వెంకటేశ్వర్లు పిటిషన్ లో పేర్కొన్నారు. బిసిల జనాభా ఎంతో శాస్త్రీయంగా నిర్ధారించిన దాఖలా లేదని చెబుతూ ఇలాంటి శాస్త్రీయ సమాచారం లేకుండా ఎన్నికలకు వెళ్లడం బిసిలకు న్యాయం జరగకుండా అడ్డుకోవడమే అవుతుందని ఆయన వాదించారు.
రాజ్యాంగంలో 14, 15(4), 15(5), 16(4) 38, 40, 46 అధికరణల ప్రకారం , 73వ, 74 వ రాజ్యాంగ సవరణ ప్రకారం బిసిలకు జనాభా ప్రాతిపదిక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని పిటిషనర్ వాదించారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని అధికరణ 342ఏ(3) ప్రకారం బీసీల జాబితా శాస్త్రీయంగా ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే చేయించి రూపొందించాకే ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు.
దీని మీద హైకోర్టు స్పందిస్తూ ప్రభుత్వాన్ని బీసీ కుల గణనకు కమిషన్ నియమించారా అని అడిగి, పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఇంతవరకు కుల గణన జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 19కి వాయిదా వేసింది.
ప్రభుత్వ స్పందన, కుల గణన స్థితి
ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు బీసీ కుల గణన చేపట్టలేదు. దీని ఫలితంగా రిజర్వేషన్లు గత డేటా ఆధారంగా అమలు చేయడం అన్ని వర్గాలకు నష్టదాయకమని వాదనలు వినిపిస్తున్నాయి. కులగణనకోసం డెడికేటెడ్ కమిషన్ ను నియమించకుండా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం 2026లో జరిగే జనగణన (Census) లో కుల వివరాలను చేర్చాలని నిర్ణయించింది. ఇదే విధంగా ఎస్‌సీ సబ్-క్యాటగరైజేషన్‌ను 2026 జనగణన తర్వాత అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే బీసీలకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు. ఈ అంశంపై హైకోర్టు ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకోవచ్చని భావిస్తున్నారు.
స్థానిక ఎన్నికల వాయిదా అవకాశాలు పెరిగినట్లే
రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలుపెట్టింది. ఫిబ్రవరిలో పంచాయతీలు, ఏప్రిల్‌లో మునిసిపాలిటీల ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే హైకోర్టు పిటిషన్ నేపథ్యంలో ఈ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పాత కుల సమాచారం ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తే, అన్ని వర్గాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు వాయిదా పడితే ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించవచ్చు. కానీ ఈ ప్రక్రియ కూడా ఇంకా మొదలుకాలేదు. పొరుగు తెలంగాణాలో డెడికేషన్ కమిషన్ నిర్ణయించిన కులజనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాలేదు. రిజర్వేషన్లను పెంచుతూ తీసుకున్న జి.వొ మీద హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఆంధ్రా కూడా అదే దారిలోనే వెళుతున్నట్లు కనిపిస్తున్నది.
సామాజిక న్యాయం, రాజకీయ ప్రభావం
మరోవైపు.. రాష్ట్రంలో కుల గణనతోపాటు, జనాభా దామాషా మేరకు బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా వర్గీకరించాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. ఈ విషయం మీద తాను కూడా కోర్టులో పిటిషన్ వేశానని చెబుతూ బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా వర్గీకరించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, అలా కాని పక్షంలో తాము ఆందోళనకు దిగుతామని ఆయన ప్రకటించారు. ఇంతవరకు బిసి జనాభా మీద శాస్త్రీయంగా అధ్యయనం జరగలేదని, రాష్టప్రభుత్వం వెంటనే దీనికి పూనుకోవాలని శంకర్ రావు తెలిపారు.
ఆంధ్రలో కొనసాగుతున్న పరిస్థితి మీద వ్యాఖ్యానిస్తూ, డెడికేషన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం బిసి కోటానుపెంచడం సాధ్యం కావకపోవచ్చని, కోట ా50 శాతం దాటితోె కోర్టులు కొట్టివేసే ప్రమాదం ఉందని, అదే తెలంగాణలోె జరిగిందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన రాజనీతి శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ ఇ.వేంకటేశు తెలిపారు. " ఆంధ్రాలో బిసి జనాభా 48 శాతం దాకా ఉంది. ప్రస్తుతం ఎస్ సి, ఎస్ టిలకు 22.5 శాతం రిజర్వేషన్లు. మొత్తం కోటా 50 శాతం మించకుండా ఉండాలంటే ప్రభుత్వం స్వచ్ఛందగా బిసికోటాను 27.5 శాతంగా నిర్ణయిస్తూ జి.వొ తీసుకురావచ్చు. అయితే, బిసిలు జనాభా ప్రాతిపదిన రిజర్వేషన్లు కోరుతున్నందున మిగతా 20 శాతాన్ని పార్టీలు జనరల్ కోటాలో బిసి నిలబెట్టి అమలుచేయవచ్చు. దీనితో చట్ట ప్రకారం కోటా 50 శాతం మించకుండా ఉంటుంది. బిసిలకు మొత్తంగా 48 శాతం కోటా వస్తుంది. ఇదొక సామరస్య పరిష్కారం,’ అని ప్రొఫెసర్ వెంకటేశు అన్నారు.
ఇలా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు.
జాతీయ స్థాయిలో 2026 జనగణనలో కుల వివరాలు చేర్చడం బీసీలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చవచ్చు. అప్పటి దాకా స్థానిక ఎన్నికలను వాయిదావేయగలరా? ప్రభుత్వం ఈ అంశంపై త్వరిత నిర్ణయం తీసుకోకపోతే, రాజకీయంగా నష్టాలు తప్పవు.
బీసీ సంఘాలు ఇప్పటికే ఆందోళన మార్గం పడుతున్నాయి. ఎందుకంటే, శాస్త్రీయంగా నిర్ణయించిన జనాభా అధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తే ఎన్నికలు జరగనీయమని బిసి సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బిసిల పిటిషన్ల మీద హైకోర్టు తీర్పు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
మొత్తంగా సామాజిక న్యాయం కోసం కుల గణన తప్పనిసరి అయినప్పటికీ, ఎన్నికల వాయిదా ప్రజా పాలనపై ప్రభావం చూపవచ్చు.

