స్ధానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా ?
x

స్ధానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా ?

ఎప్పుడు జరుగుతుందో తెలీదు కాని ప్రభుత్వం గతంలో చెప్పినట్లుగా డిసెంబర్లోపు అయితే జరగవని ఖాయమైపోయింది.


ఎప్పటినుండో రాజకీయపార్టీలు ఎదురుచూస్తున్న స్ధానికసంస్ధల ఎన్నికలు(Local body Elections) ఇప్పట్లో జరిగేట్లు లేదు. ఎప్పుడు జరుగుతుందో తెలీదు కాని ప్రభుత్వం గతంలో చెప్పినట్లుగా డిసెంబర్లోపు అయితే జరగవని ఖాయమైపోయింది. ఈ విషయం డెడికేషన్ కమిషన్ ఛైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు(Dedicated Commission Chairman Busani Venkateswar Rao) తాజా మాటలతో అర్ధమైపోయింది. ఇంతకీ బూసాని ఏమి చెప్పారంటే బీసీ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అందించేందుకు గడువు కోరబోతున్నట్లు చెప్పారు. బీసీరిజర్వేషన్(BC Reservations) పెంచే విషయమై ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేయాలన్న హైకోర్టు సూచనతో ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటుచేసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వర్లును ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించింది.

డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పినపుడే హైకోర్టు నెలరోజుల్లో ప్రజాభిప్రాయాన్ని తీసుకుని ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. నవంబర్ 4వ తేదీన ప్రభుత్వం బూసానిని ఛైర్మన్ గా నియమించింది. లెక్కప్రకారమైతే డిసెంబర్ 4వ తేదీకి కమిషన్ అభిప్రాయసేకరణ జరిపి రిపోర్టు అందించాలి. బూసాని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మంజిల్లాల్లో పర్యటించింది. తన పర్యటనల్లో ప్రజాప్రతినిధులను, ప్రజాసంఘాలు, మేథావులతో పాటు మామూలు జనాల నుండి అబిప్రాయాలను సేకరించింది. బీసీ రిజర్వేషన్లు ఫైనల్ అయిన తర్వాత మాత్రమే స్ధానికసంస్ధల ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఏమో పోయిన ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్లజాబితా ప్రకారమే స్ధానికసంస్ధల ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నది. అయితే ప్రభుత్వం అనుకున్నట్లు జరగలేదు. దాంతో బీసీ రిజర్వేషన్ కోసమని ప్రత్యేకంగా డెడికేటేడ్ కమిషన్ ను నియమించాల్సొచ్చింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ నిర్వహించింది. దాని ప్రకారం స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలి. అయితే ఇపుడు 42 శాతం రిజర్వేషన్ అమలుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్షాలు, బీసీ కులసంఘాలు 42 శాతం రిజర్వేషన్ పై డిమాండ్ చేస్తుంటే రేవంత్(Revanth), మంత్రులు ఏమీ మాట్లాడటంలేదు. ఈ నేపధ్యంలోనే బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏమీ తేల్చుకోలేకపోతోంది. ఈ నేపధ్యంలోనే డెడికేటెడ్ కమిషన్ బీసీ రిజర్వేషన్లపై అభిప్రాయసేకరణ మొదలుపెట్టింది. రాష్ట్రం మొత్తంమీద అభిప్రాయ సేకరణ కార్యక్రమం నెలరోజుల్లో అయ్యేట్లులేదు. అంటే కోర్టు గతంలో చెప్పినట్లుగా డిసెంబర్ 4వ తేదీకి రిపోర్టు రెడీ అయ్యేట్లులేదు. అందుకనే బూసాని మాట్లాడుతు కమిషన్ గడువు పెంచమని ప్రభుత్వాన్ని అడగబోతున్నట్లు చెప్పారు.

ఇటీవలే ఆర్ధికశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti SrinivasaReddy) మీడియాతో మాట్లాడుతు డిసెంబర్లో స్ధానికసంస్ధల ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. జనవరి నెలకు పంచాయితీల్లో కొత్త సర్పంచులు ఉంటారని గట్టిగా చెప్పారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే మంత్రి మాట జరిగేట్లులేదు. అభిప్రాయసేకరణ జరిపి రిపోర్టు తయారుచేసేందుకు బూసాని ఎంతకాలం గడువు కోరుతారో తెలీదు. ప్రభుత్వం ఎంత గడువు ఇస్తుందో తెలీదు. అందుకనే ఇవన్నీ జరిగి స్ధానికసంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలీకుండా ఉంది. మొత్తంమీద క్లారిటి ఉన్న విషయం ఏమిటంటే డిసెంబర్లోగా స్ధానికసంస్ధల ఎన్నికలు జరగవని.

Read More
Next Story