స్కాన్‌ చేసిన తర్వాతనే లిక్కర్‌ను అమ్మాలి
x

స్కాన్‌ చేసిన తర్వాతనే లిక్కర్‌ను అమ్మాలి

బుధవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం రూపుమాపడానికి ప్రభుత్వం కఠిన చర్యలు ఏపీ ప్రభుత్వం నకిలీ మద్యం సమస్యను అరికట్టడానికి అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. మద్యం షాపులు, బార్లలో అసలైన, నాణ్యమైన మద్యం విక్రయాలు జరగాలని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆ మేరకు ఎక్సైజ్‌ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ప్రతి మద్యం సీసాను క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసిన తర్వాత మాత్రమే షాపు, బార్‌ యజమానులు విక్రయించాలని నియమం విధించారు. ఏపీ ఎక్సైజ్‌ సురక్షా యాప్‌ ఉపయోగించి సీసాపైన క్యూఆర్‌ కోడ్‌ను తప్పకుండా స్కాన్‌ చేయాలని నియమావళిలో స్పష్టం చేశారు. ప్రతి షాపు, బార్‌ వద్ద ప్రత్యేక సూచనా బోర్డులు ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. మేము ఇక్కడ అమ్మే మద్యం క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ ద్వారా అసలైనది, నాణ్యమైనదని ధృవీకరించాము అని ఆ బోర్డులపై రాయాలని నియమాల్లో వివరించారు.

కొనుగోలుదారులకు మద్యం అందజేసే ముందు, ప్రతి సీసా ప్రామాణికతను తప్పకుండా పరీక్షించాలని ప్రభుత్వం నియమం పెట్టింది. సీసాపై సీలు, క్యాపు, హోలోగ్రామ్‌ స్థితి, ప్రామాణికతను తనిఖీ చేయాలని నియమావళిలో తెలిపారు. ప్రతి షాపు, బార్‌లో ‘రోజువారీ మద్యం ప్రామాణికత పరీక్షా రిజిస్టర్‌’ను నిర్వహించాలని ఆదేశించారు. ఆ రిజిస్టర్‌లో విక్రయించిన మద్యం బ్రాండ్లు, బ్యాచ్‌ సంఖ్యలను నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. క్యూఆర్‌ కోడ్‌ పరీక్ష సమయం, స్టాంపు, స్టేటస్‌ ఫలితాలను రిజిస్టర్‌లో రికార్డు చేయాలని సూచించారు. ఏపీ ఎక్సైజ్‌ సురక్షా యాప్‌ డేటా ద్వారా రియల్‌ టైమ్‌ సమాచారాన్ని చూపించాలని నియమం విధించారు. ఎక్సైజ్‌ సిబ్బంది ప్రతి రోజూ మద్యం షాపులు, బార్లలో ఈ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు.
పరీక్షల వివరాలను షాపు రిజిస్టర్‌లో రాసి ఎక్సైజ్‌ అధికారి రోజువారీ సంతకం చేయాలని వివరించారు. డిపో నుంచి మద్యం స్టాక్‌ వచ్చిన తర్వాత, ప్రతి షాపు, బార్‌లోని సరకులో కనీసం 5 శాతం సీసాలను స్కాన్‌ చేయాలని నియమం పెట్టారు. బ్యాచ్‌ పరీక్ష సర్టిఫికెట్‌పై లైసెన్స్‌ హోల్డర్‌ సంతకం చేయాలని నియమావళిలో స్పష్టం చేశారు. ఆ సర్టిఫికెట్‌ను రోజువారీ మద్యం ప్రామాణికత రిజిస్టర్‌లో రికార్డు చేయాలని.. పరీక్షల్లో నకిలీ మద్యం దొరికితే తక్షణమే ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారి లేదా లైసెన్స్‌ హోల్డర్‌ నకిలీ మద్యంపై ఫిర్యాదు చేయకపోతే అది సహకారం లేదా నిర్లక్ష్యంగా పరిగణించాలని తెలిపారు. నకిలీ మద్యం పట్టుబడితే లైసెన్స్‌ను రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. నకిలీ మద్యంపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి 24 గంటలు పనిచేసే మానిటరింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని.. కంట్రోల్‌ రూమ్, వాట్సాప్‌ సహాయ లైన్లు సిద్ధం చేసి సమర్థవంతంగా నడపాలని.. ఫిర్యాదులను 24 గంటల్లో విచారించి నివేదిక సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.


Read More
Next Story