అవినీతి కోసమే ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు:మాజీ సీఎం వైఎస్‌ జగన్‌
x

అవినీతి కోసమే ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు:మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

మొన్న ఇసుక పాలసీమీద ఘాటు విమర్శలు చేసిన మాజీ సీఎం జగన్‌ తాజాగా మద్యం పాలసీపైన ధ్వజమెత్తారు. అవినీతి కోసం వేసిన స్కెచ్‌ కాదా అంటూ నిలదీశారు.


ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీ, లిక్కర్‌ షాపులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వంటి పలు అంశాలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసేసి, వాటిని ప్రైవేటు వ్యక్తులను అప్పగించడం అవినీతి కోసం వేసిన స్కెచ్‌ కాదా అంటూ నిలదీశారు. మద్యం మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్‌ అడ్డాగా మారిపోయిందని ధ్వజమెత్తారు. మద్యం పాలసీపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తన ఎక్స్‌ వేదికగా ఎండగట్టారు. ఈ మాఫియాకు సూత్రదారి, పాత్రదారి సీఎం చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇంకా జగన్‌ ఏమన్నారంటే..
మీ మనుషులతో సిండికేట్‌ ఏర్పాటుచేసి షాపులను కొట్టేయడం నిజం కాదంటారా? అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతో అమ్మి, డిస్టలరీలద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి వేలకోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచిన మాట వాస్తవమే కదా? అంటూ ప్రశ్నించారు. మీరు తెచ్చిన లిక్కర్‌ పాలసీ గొప్పదే అయితే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మీ కనుసన్నల్లో ఎందుకు బెదిరింపులకు దిగారు? అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? కమీషన్ల వాటాలు వేసుకున్న మాట వాస్తవం కాదా? మీరు ఇవన్నీ చేసిన తర్వాత నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్ముతారా? మీకింత వారికింత చొప్పున నచ్చిన రేట్లకు అమ్ముకోవడానికి సిండికేట్లకు ఓకే చెప్పినట్టు కదా?
కొత్తపాలసీ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రానీయకుండా గండికొట్టారు. ప్రజలను మభ్యపెట్టడానికి చీప్‌ లిక్కర్‌ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దీని కోసం క్వాలిటీని తగ్గిస్తూ, ఇంకోవైపు అమ్మకాలు విపరీతంగా పెంచేసి, తద్వారా డిస్టలరీల నుంచి లంచాల ఆదాయం పెంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 20 డిస్టలరీల్లో 14 చంద్రబాబు హయాంలో వచ్చినవే. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో ఒక్క డిస్టరీలకి కూడా అనుమతి ఇవ్వలేదన్నారు.
ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మితే అమ్మకాలపై నియంత్రణ ఉంటుంది. అమ్మకం వేళలు కూడా నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల మద్య నియంత్రణ అనే ప్రాథమిక బాధ్యత దిశగా ప్రభుత్వాలు కాస్తైనా పనిచేసినట్టు అవుతుంది. కానీ మీ సొంత ఆదాయంకోసం ఆ లక్ష్యానికి తూట్లుపొడిచినట్టే కదా? ఒక ఫక్తు లిక్కర్‌ వ్యాపారిలా ఆలోచిస్తున్నారు కాని, రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిలా ఎందుకు ఆలోచన చేయడంలేదు? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు.
2014–19 మధ్య రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. ప్రజల ఆరోగ్యాలను, కుటుంబాల పరిస్థితులను పణంగా పెట్టేలా లిక్కర్‌ పాలసీని తెచ్చి దాని మీద కాసులు ఏరుకున్నారు. కాగితాలమీద కనిపించే దుకాణాలే కాకుండా, వాటికి అదనంగా పర్మిట్‌ రూమ్స్, దీనికి తోడుగా 43వేల బెల్టుషాపులతో లిక్కర్‌ ఏరులై పారింది. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే దళారులకు, రాజకీయ వ్యాపారులకు చెక్‌ పెట్టింది. దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించి మద్యం అమ్మకాలను నియంత్రించింది. అమ్మకాలు కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగేలా చేసింది. ఇప్పుడు మీ మనుషులకు అప్పగించారు. ఇక వీళ్లు ఏర్పాటు చేసే పర్మిట్‌రూమ్స్, బెల్టుషాపులకు లెక్కే లేదు.
లక్షల సంఖ్యలో ఉద్యోగాలంటూ అబద్ధాలు మీద, అబద్ధాలు చెప్పి రోజూ మీ మీడియాలో ఊదరగొట్టే మీరు, మీ స్వార్థం కారణంగా ప్రభుత్వ లిక్కర్‌ షాపుల్లో పనిచేస్తున్న 15వేలమంది ఒక్కసారిగా నిరుద్యోగులై రోడ్డునపడ్డారు. మరి, వీరి బాగోగుల సంగతేంటని సీఎం చంద్రబాబును నిలదీశారు.
మీ అక్రమార్జనకోసం, మీకు, మీవాళ్లకు అవినీతి డబ్బు సంపాదించడంకోసం అమలు చేస్తున్న లిక్కర్‌ పాలసీ రాష్ట్రానికి, ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరం. అక్కచెల్లెమ్మల ఉసురు, యువత ఉసురు, ఆరోగ్యం రూపేణా ప్రజల ఉసురు మీరు పోసుకున్నట్టే అని విమర్శించారు. అవినీతి ధ్యేయంగా తెచ్చిన లిక్కర్‌ పాలసీతో రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారని, మీ చర్యలను వెంటనే సరిదిద్దుకోండని, లేకుంటే ప్రజల తరఫున ఉద్యమిస్తామని జగన్‌ హెచ్చరించారు.
Read More
Next Story