
తొలి రోజు 8 గంటల పాటు విచారణ
రెండో రోజు శనివారం కూడా సిట్ అధికారులు విచారణ చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాలకు దారి తీసిన మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు వ్యక్తులను 8 గంటల పాటు సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప బాలాజీలు లిక్కర్ స్కామ్‌లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జైల్లో ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నలుగురిని విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత అక్కడ నుంచి విజయవాడ సీపీ కార్యాలయంలోని సిట్ ఆఫీసుకు వారిని తరలించారు.
దాదాపు 8 గంటల పాటు తొలి రోజు విచారణ చేపట్టారు. నలుగురు వ్యక్తుల పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మద్యం విషయంలో రాబట్టిన ముడుపులను పెట్టుబడుల కింద ఎలా పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఎన్ని ఆస్తులు కొనుగోలు చేశారు, ఎన్ని ఖరీదైన కార్లు కొనుగోలు చేశారు, ఎవరి పేరు మీద కొనుగోలు చేశారు, ఆ ఖరీదైన కార్లు ఎవరి కోసం కొనుగోలు చేశారు, కుటుంబ సభ్యులకు చెందిన వ్యాపారాల వివరాలు, వాటికి పెట్టుబడులు ఎవరు పెట్టారు, ఎంత పెట్టారు వంటి అనేక ప్రశ్నలు ఆ నలుగురి వ్యక్తుల మీద సిట్ అధికారులు సంధించినట్లు తెలిసింది. శనివారం రెండో రోజు విచారణ చేపట్టనున్నారు.